
- పర్మిషన్ లేని బిజీ-3 విత్తనాలు రావడంతోనే సేల్స్ పై ఎఫెక్ట్
- గుజరాత్, మహారాష్ట్ర నుంచి విత్తనాలు వచ్చాయని అనుమానాలు
- గత ఏడాది కంటే 60 శాతం మేర తగ్గిన అమ్మకాలు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో కమర్షియల్ పత్తి పంటతో పాటు సీడ్ పత్తి పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. కానీ ఈసారి జిల్లాలో కమర్షియల్ విత్తనాల అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ కమర్షియల్ పత్తి సాగు ఏ మాత్రం తగ్గలేదు. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగానే కమర్షియల్ పత్తి పంటను సాగు చేశారు.
రాష్ట్రంలో నిషేధం ఉన్న బిజీ-3 రకపు విత్తనాలు జోగులాంబ గద్వాల జిల్లాకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి అక్రమంగా రావడం వల్లే కమర్షియల్ పత్తి విత్తనాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. కమర్షియల్ పత్తి పంట సాగు పెరిగినప్పటికీ కంపెనీలు డీలర్లకు పంపించిన కమర్షియల్ పత్తి విత్తనాల ప్యాకెట్లు అమ్ముడు పోలేదు.
1.80 లక్షల ఎకరాలలో కమర్షియల్ పత్తి పంట
జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్, కమర్షియల్ పత్తి పంటలు 1.80 లక్షల ఎకరాల్లో సాగు చేశారని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ లెక్కలు చెబుతున్నాయి. సీడ్ పంట 50వేల ఎకరాలు తీసివేయగా లక్ష 30 వేల ఎకరాల్లో కమర్షియల్ పత్తి పంట సాగు చేశారు. ఒక్క ఎకరానికి రెండు కమర్షియల్ పత్తి ప్యాకెట్లు అవసరం పడుతుంది. లక్ష 30 వేల ఎకరాల్లో సాగు చేస్తే దాదాపు 2.60 లక్షల ప్యాకెట్లు జిల్లాలో అమ్ముడుపోవాలి.
కానీ ఈ ఏడాది లక్ష కమర్షియల్ పత్తి విత్తన ప్యాకెట్లు కూడా అమ్ముడు పోలేదని కంపెనీలు చెబుతున్నాయి. గద్వాల టౌన్ లోని కమర్షియల్ పత్తి విత్తనాల డీలర్ గతేడాది 38 వేల ప్యాకెట్లు అమ్మగా ఈ ఏడాది కేవలం 4 వేల ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే అమ్మినట్లు రికార్డులు చెబుతున్నాయి. చాలామంది డీలర్లు, రిటైలర్లు కంపెనీల నుంచి తీసుకున్న కమర్షియల్ విత్తనాలు అమ్ముడుపోకపోవడంతో రిటర్న్ పంపిస్తున్నారు.
గత ఏడాది 1.42 లక్షల ఎకరాలు సాగు
జోగులాంబ గద్వాల జిల్లాలో గతేడాది 1.42 లక్షల ఎకరాల్లో కమర్షియల్ పత్తి పంట సాగు చేసినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. కమర్షియల్ పత్తి సాగు పెరిగినా అమ్మకాలు మాత్రం దాదాపు 60 శాతం తగ్గడానికి కారణం బిజీ- 3 విత్తనాలు అక్రమంగా జిల్లాలోకి ప్రవేశించడమే అంటున్నారు.
బిజీ-3 విత్తనాలపై నిషేధం
భారతదేశంలో బిజీ- 3 విత్తనాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ విత్తనాలను సాగు చేస్తే భూసారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ విత్తనాలు సాగు చేస్తే రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది.. గడ్డి మందు పిచికారీ చేసినా పత్తి చేనుకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. దీంతో రైతుకు ఖర్చు తగ్గుతుంది. అందువల్లే రైతు బీజి-3 విత్తనాల సాగుపై దృష్టి పెడుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తో బిజీ-3 విత్తనాలు పండిస్తున్నారని కంపెనీలు చెబుతున్నాయి. అక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించాయని చెబుతున్నారు.
బిజీ-3 విత్తనాలపై ఆధారాలు లేవు
జోగులాంబ గద్వాల జిల్లాలోకి బిజీ-3 విత్తనాలు వచ్చాయనే దానిపై ఆధారాలు లేవు. కమర్షియల్ పత్తి పంట గత ఏడాది కంటే ఈ ఏడాది పెరిగిన మాట వాస్తవమే. కానీ విత్తనాలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే దానిపై క్లారిటీ లేదు. ఇక్కడ పండే విత్తనాలపై పంట చివరి టైంలో టెస్టులు చేస్తాం అప్పుడే క్లారిటీ వస్తుంది.– సక్రియ నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, గద్వాల.
సీడ్ రైతులకు సీలింగ్ కారణం ఇదే..?
గద్వాల జిల్లాలో క్రాసింగ్ సీడ్ పత్తి పంటకు పెట్టింది పేరు. ఇక్కడ పండించిన సీడ్ విత్తనాలను దేశవ్యాప్తంగా కమర్షియల్ పత్తి విత్తనాలుగా కంపెనీలు అమ్ముతుంటాయి. తెలంగాణలోకి అక్రమంగా బిజీ-3 విత్తనాలు రావడంతో కంపెనీల సీడ్ అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో ఈసారి గద్వాల జిల్లాలో స్పందించే సీడ్ పంట రైతులకు కంపెనీలు సీలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఎకరాకు రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో పెద్ద రచ్చ జరిగింది. రైతులు ధర్నా చేయడంతో దిగొచ్చిన కంపెనీలు ఎంత పండించిన కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాయి. దీంతో సమస్య సద్దుమణిగింది.