
- భర్త హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
- వివరాలు తెలిపిన నల్గొండ జిల్లా గట్టుప్పల్ పోలీసులు
చండూరు ( గట్టుప్పల్), వెలుగు : భర్త హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని నల్గొండ జిల్లా గట్టుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం పీఎస్ లో మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు. గట్టుప్పల్ మండలం వెల్మకన్నెలో మల్లేశ్, హేమలత దంపతులు ఉంటున్నారు. మూడేండ్లుగా హేమలత దూరంగా ఉంటుండగా.. ఆమెపై భర్త నిఘా పెట్టాడు.
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హేమలత, ఆమె ప్రియుడు రేవెల్లి నవీన్ కలిసి చంపేందుకు ప్లాన్ చేశారు. ఈనెల10న మల్లేశ్ ఇంటికి టైల్స్ పెట్టేందుకు వచ్చిన నవీన్ ముందస్తు ప్లాన్ మేరకు అతడితో కలిసి మద్యం తాగారు. మత్తులో ఉండగా బైక్ పై ఇంటికి తీసుకొచ్చాడు.
నిద్రపోయిన తర్వాత మల్లేశ్నోరు, ముక్కును టవల్ తో గట్టిగా అదిమి పట్టి శ్వాస ఆడకుండా చేశారు. అతడు కొట్టుకుంటుండగా కాళ్లను భార్య నొక్కిపట్టగా.. నవీన్ గొంతు నులిమి హత్య చేశారు. మృతుడి మల్లేశ్ తల్లి వల్లపు వెంకటమ్మ ఫిర్యాదుతో గట్టుప్పల్, మునుగోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనుమానంతో మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య చేసినట్టు ఒప్పుకుంది. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, బైక్, టవల్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎస్ వెంకట్ రెడ్డి, ఏఎస్ఐ ఆర్ అంజయ్య, స్టాఫ్ రమేష్, సుదర్శన్ ను ఎస్పీ అభినందించారు.