గుట్టలు తోడేస్తున్రు .. సర్కార్ భూములు, గుట్టలు, చెరువులే మట్టి మాఫియా టార్గెట్

గుట్టలు తోడేస్తున్రు .. సర్కార్  భూములు, గుట్టలు, చెరువులే మట్టి మాఫియా టార్గెట్
  • వార్నింగ్ ఇచ్చినా, కేసులు పెడుతున్నా ఆగని ఇల్లీగల్ దందా
  • గుంతలమయంగా మారిన హ్యాండ్లూమ్  పార్క్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, పీడీఎస్   రైస్  తరలింపు వంటి ఇల్లీగల్  దందాలు ఆగడం లేదు. ప్రభుత్వ భూములు, హ్యాండ్లూమ్  పార్క్  స్థలాలు, గుట్టలను తవ్వి మట్టి తరలిస్తున్నారు. చివరకు ప్రైవేట్​ ప్లాట్లలోనూ తవ్వకాలు జరుపుతున్నారంటే మట్టి మాఫియా ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మట్టి దందాను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుండగా, గుట్టలు కరిగిపోతున్నాయి.

సర్కార్  భూములు, గుట్టలే టార్గెట్..

గద్వాల మండలం అనంతపురం గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 368లో 100 ఎకరాల సర్కార్  భూమి ఉంది. ఇందులో 50 ఎకరాల ల్యాండ్​ను హ్యాండ్లూమ్  పార్క్ కు కేటాయించారు. ఈ స్థలంలో రాత్రి వేళ మట్టి తవ్వుతున్నారు. 10 రోజుల నుంచి మూడు హిటాచీలు, 10 టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ గా తవ్వకాలు సాగిస్తున్నారని అంటున్నారు. జమ్మిచేడు శివారులోని సర్వే నెంబర్ 124లోని తన పొలంలో మట్టి మాఫియా తవ్వకాలు చేస్తుందని చాకలి లక్ష్మన్న వాపోయాడు.

గద్వాల పట్టణం సమీపంలోని శెట్టి ఆత్మకూరు గుట్టల దగ్గర రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతూ మట్టి తరలిస్తున్నారు. ప్రైవేట్​ ప్లాట్లలో తవ్వకాలపై గతంలో ఆందోళనలు చేయడంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గద్వాల మండలం పూడూరు ఎర్రవల్లి చెరువులో ఇటుక బట్టీ వ్యాపారులు నల్ల మట్టిని తరలించారు. ధరూర్ మండల కేంద్రంలోని చెరువు సమీపంలో డంప్​ చేసిన వందల టిప్పర్ల నల్ల మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

ఆఫీసర్లు మారినా..

అప్పటి ఆఫీసర్లతో మాఫియాకు లింకులు ఉండడంతో చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అయితే కొత్త ఆఫీసర్లు వచ్చినా అక్రమ మార్గంలో ఇసుక, మట్టి, పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తూనే ఉన్నారు. ఇటీవల స్పెషల్ ఫోర్స్  ఆఫీసర్లు నాలుగు టిప్పర్లు, 9 ట్రాక్టర్లను పట్టుకున్నారు. కేటిదొడ్డి మండలంలో ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకున్నారు. అక్కడక్కడ పోలీసులు ఇసుక, మట్టి తరలిస్తున్న వెహికల్స్​ పట్టుకొని కేసులు పెడుతున్నా దందా కొనసాగుతోంది.

also read : శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు

ఇప్పటికీ గద్వాల పట్టణానికి పక్క జిల్లాల నుంచి ఇసుక టిప్పర్లు వస్తున్నాయంటే మాఫియా ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక రీచ్ ల వద్ద మైనింగ్  శాఖ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. కొత్త ఎస్ఐలు వచ్చినా, కింది స్థాయి సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నారని అంటున్నారు. సిబ్బందిని మేనేజ్  చేసుకొని తమ వెహికల్స్ ను పక్కదారిలో తప్పిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఒక్కో టిప్పర్  రూ.8 వేలు..

మట్టికి ఫుల్  డిమాండ్  ఉండడంతో లీడర్లే మాఫియాగా మారారు. భూమి కొని పర్మిషన్ తీసుకుని మట్టిని అమ్మితే తక్కువ లాభాలు వస్తాయి. అదే సర్కార్  భూముల్లో తవ్వకాలు జరిపితే ఎక్కువ లాభాలు వస్తాయి. దీంతో ఆఫీసర్లను మేనేజ్  చేసుకొని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్  మట్టిని రూ.6 వేల నుంచి రూ.8 వేలకు అమ్ముతున్నారు.

వెంచర్లకు, ఇంటి నిర్మాణాలకు మట్టి అవసరం ఉండడంతో మట్టి దందా నడిగడ్డలో జోరుగా సాగుతోంది. ఇక బార్డర్  చెక్ పోస్ట్ ల వద్ద అక్రమ వసూళ్లకు తెర లేపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఒక వీడియో వైరల్ గా మారింది. డబ్బులు వసూలు చేస్తూ అవి ఇల్లీగల్  వెహికల్స్ అయినా వదిలి పెడుతున్నారనే విమర్శలున్నాయి. కర్ణాటక, తెలంగాణ మధ్య ఇసుక, మట్టి, పీడీఎస్​ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

రెవెన్యూ, మైనింగ్ వాళ్లు సహకరించాలి

మట్టి తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్  ఆఫీసర్లు కంప్లైంట్  చేయాలి. మట్టి దందాపై కేసులు చేయడానికి లేదు. ఫైన్లు వేస్తున్నాం. రైతుల పొలాల్లో మట్టి తవ్వకాలు జరిపితే పోలీసులకు సమాచారం ఇస్తే ఏ రాత్రి అయినా పట్టుకుంటాం. ఇల్లీగల్  దందాలపై మరింత నిఘా పెంచుతాం.
- వెంకటేశ్వర్లు, డీఎస్పీ, గద్వాల