సంగారెడ్డి జిల్లా బార్డర్ లో అక్రమంగా ఫ్యూయల్ దందా

సంగారెడ్డి జిల్లా బార్డర్ లో అక్రమంగా ఫ్యూయల్ దందా
  • అక్కడి కన్నా ఇక్కడ లీటర్​ కు రూ.9 ఎక్కువ
  • బ్లాక్ మార్కెట్​లో లీటర్​ వద్ద రూ.4 లాభంతో అమ్ముతున్న వ్యాపారులు   
  • బార్డర్​ పెట్రోల్​ బంకుల్లో తగ్గిన అమ్మకాలు 

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : ఃకర్నాటక పెట్రోల్ తెలంగాణలో అక్రమంగా అమ్ముతున్నారు. తెలంగాణ కన్నా అక్కడ పెట్రోల్​ ధర తక్కువగా ఉండడంతో అక్రమంగా తరలించి అమ్ముతున్నారు.  దీంతో తెలంగాణ బార్డర్ లోని పెట్రోల్ బంకుల్లో సేల్స్ తగ్గిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం కర్నాటక  బార్డర్​లో ఉంటుంది. ఇది మారుమూల ప్రాంతం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్​ దందా నిర్వహిస్తున్నారు.  ఏడాది కాలంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న 18 పెట్రోల్ బంకుల్లో క్రమేణా సేల్స్ తగ్గుతూ వస్తున్నాయి. కర్నాటకలో లీటర్ డీజిల్ రూ.86, లీటర్ పెట్రోల్ రూ.101గా ఉండగా,  తెలంగాణలో లీటర్ డీజిల్ రూ.95, పెట్రోల్ రూ.110గా ఉంది.  ఈ రెండు రాష్ట్రాల్లో  పన్నుల్లో తేడా వల్ల ఈ మార్పులు కనిపిస్తున్నాయి. దీన్ని కొందరు వ్యాపారస్తులు ఆసరా చేసుకుని అక్కడి పెట్రోల్, డీజిల్ తరలించి  లీటర్​ రూ.5 తక్కువగా అమ్మకాలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో తెలంగాణ ఆర్టీసీ పైన కూడా ప్రభావం చూపాయి. టీఎస్​ఆర్టీసీ ఏడాది కింద కర్నాటక నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ ను డంప్ చేసుకోవడం అప్పట్లో దూమారం రేపింది. 

50 శాతం తగ్గుదల 

నారాయణఖేడ్ బార్డర్​లో ఉన్న ఒక్కో పెట్రోల్ బంకులో గతేడాది ఇదే సమయంలో రోజుకు మ్యాగ్జిమం పెట్రోల్ 4వేల లీటర్లు అమ్మితే ఇప్పుడు 2 వేలు, డీజిల్ అప్పుడు 3 వేల లీటర్లు అమ్మగా, ప్రస్తుతం 1500 లీటర్లకు సేల్స్ పడిపోయాయి. ఈ పరిస్థితి బార్డర్​లోని 18 పెట్రోల్​ బంకుల్లో ఉంది. ఈ కారణంగా రాష్ట్ర ఆదాయానికి కూడా గండి పడుతోంది. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పలువురు పెట్రోల్​ బంకు యజమానులు అంటున్నారు.