సూర్యాపేట జిల్లాలో మెడికల్ షాపుల ముసుగులో.. లింగనిర్ధారణ పరీక్షలు!

సూర్యాపేట జిల్లాలో మెడికల్ షాపుల ముసుగులో..  లింగనిర్ధారణ పరీక్షలు!
  • సూర్యాపేట జిల్లాలో బయటపడ్డ ఇల్లీగల్ దందా 
  • గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు
  • గ్రామాల నుంచి ఆర్ఎంపీలతో బేరసారాలు 
  • ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు 

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో నకిలీ స్కానింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు వైద్యాధికారులు దాడులు చేస్తున్నా లింగనిర్ధారణ పరీక్షలు ఆగడం లేదు. ఎక్కడపడితే అక్కడే యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే కొందరు డాక్టర్లు కానివారు సొంతంగా స్కానింగ్‌‌ మిషన్లను ఏర్పాటు చేసుకొని పుట్టబోయేది ఆడా.. మగా..? అని చెబుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేసుకుంటున్నారు. 

ఆర్ఎంపీల సాయంతో అబార్షన్లు.. 

జిల్లాలో పలు స్కానింగ్‌‌ సెంటర్ల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్‌‌ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలో కొన్ని చిన్న ఆస్పత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఎక్కువగా అబార్షన్లు చేస్తున్నారు. ఇందులో కొందరు ఆర్‌‌ఎంపీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు 
ఆరోపణలు ఉన్నాయి. 

మెడికల్‌‌ షాపులోనే స్కానింగ్‌‌ దందా..!

జిల్లాలో మెడికల్‌‌ షాపుల్లోనూ స్కానింగ్‌‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్‌‌ రోడ్డులో ఓ మెడికల్‌‌ షాపులో ఇద్దరు వ్యక్తులు స్కానింగ్‌‌ మిషన్‌‌ ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి అనుమతులు, అర్హత లేకుండానే స్కానింగ్‌‌ సెంటర్​ను ఏర్పాటు చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందులో ఒకరు ఓ ఆస్పత్రి మేనేజ్‌‌మెంట్‌‌గా వ్యవహరిస్తూ ఆర్‌‌ఎంపీల మధ్యవర్తిత్వం ద్వారా గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భిణి వద్ద నుంచి రూ.10 వేల వరకు వసూల్​ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రెండు నెలల క్రితమే పేటలో ఘటన.. 

రెండు నెలల క్రితం మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన అనూష ఐదో నెలలో ఒక ఆర్‌‌ఎంపీ సాయంతో లింగనిర్ధారణ పరీక్ష చేయించారు. ఈ స్కానింగ్‌‌ రిపోర్ట్‌‌ లో ఆడ పిల్ల ఉన్నట్టు తేలడంతో ఎలాగైనా అబార్షన్‌‌ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌‌ఎంపీ సాయంతోనే జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర థియేటర్‌‌ సమీపంలో ఒక పేరు లేని ఆస్పత్రిలో అబార్షన్‌‌ చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడ రెండు గంటలపాటు అబార్షన్‌‌ కోసం ప్రయత్నించారు. అనూష పరిస్థితి విషమించడంతో వెంటనే ఖమ్మం తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మృతి
 చెందింది.

హడావుడి చేసి వదిలేశారు..

గత మూడు నెలల క్రితం జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఆస్పత్రులు, అర్హత లేని వైద్యులు,  స్కానింగ్‌‌ సెంటర్లపై  తెలంగాణ మెడికల్‌‌ కౌన్సిల్‌‌ బృందంతోపాటు వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు.  కొంతమంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయగా, అనుమతులు లేని రెండు మూడు ఆస్పత్రులు, స్కానింగ్‌‌ సెంటర్లను సీజ్‌‌ చేశారు. 

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు 

ఎవరైనా స్కానింగ్‌‌ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే పోలీసులు లేదా డయల్‌‌ 100కు సమాచారం ఇవ్వాలి. 

కె.నరసింహ, ఎస్పీ, సూర్యాపేట