12 వేల జాబ్స్ పోయినయ్..హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్

12 వేల జాబ్స్ పోయినయ్..హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్
  •     ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగిస్తున్న కంపెనీలు
  •     ఇంకా వేల మందిపై వేలాడుతున్న కత్తి
  •     ఆందోళనలో ఎంప్లాయీస్
  •     కంపెనీలకు సబ్సిడీలిచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర సర్కార్
  •     ఓ మెయిల్‌‌ పెట్టి..అడ్డగోలుగా తొలగిస్తున్నా స్పందిస్తలే
  •     అమెజాన్‌‌ లే ఆఫ్‌‌పై కేంద్ర కార్మిక శాఖ సీరియస్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో సాఫ్ట్‌‌వేర్ కంపెనీల ఇల్లీగల్ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఐటీ సంస్థలు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. కేవలం ఓ మెయిల్ పంపి జాబ్‌‌లో నుంచి తీసేస్తున్నాయి. ఇలా నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మందిని పెద్ద కంపెనీలే తీసేశాయి. బడా కంపెనీలతో లింక్ ఉన్న చిన్న సాఫ్ట్‌‌వేర్​ కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో భయం పట్టుకున్నది. మరోవైపు ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే టాప్ స్థాయికి చేరుకున్నామని, హైదరాబాద్‌‌ను ఐటీ హబ్‌‌గా మార్చుకున్నామని చెబుతున్న రాష్ట్ర సర్కార్ పెద్దలు.. ఉన్నట్టుండి ఉద్యోగాలు ఊడుతుంటే కిమ్మనడం లేదు. 


గూగుల్, ఫేస్​బుక్, యాపిల్, అమెజాన్, హెచ్‌‌‌‌‌‌‌‌పీ వంటి పెద్ద కంపెనీలు వచ్చాయంటూ భూములు, ఇతర ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. ఇప్పుడు అవే సంస్థలు ఉద్యోగులకు ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌గా లే అఫ్స్​ ప్రకటిస్తుంటే స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో కొంత మంది ఐటీ ఉద్యోగులు కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించారు. దీంతో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్.. అమెజాన్‌‌‌‌‌‌‌‌పై సీరియస్ అయ్యారు. ఉద్యోగులను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నెల రోజుల్లో దేశంలో దాదాపు 45 వేల మంది ఐటీ ఎంప్లాయీస్​ ఉద్యోగాలు పోయాయి. 

సర్కారు గొప్పలు సరే.. ఉద్యోగ భద్రత ఏదీ

ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గొప్పగా గప్పాలు కొంటుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగాలు తీసేస్తుంటే సప్పుడు చేయడం లేదు. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో సర్కారు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు వచ్చాయని, మొత్తంగా 6.39 లక్షల ఉద్యోగులు పని చేస్తున్నారని ప్రకటించుకుంది. వరంగల్, నిజామాబాద్ వంటి సిటీలకూ ఐటీ కంపెనీలు విస్తరిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఐటీ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు మాత్రం ఉద్యోగ భద్రత కల్పించలేకపోతున్నది. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు పెట్టినా పట్టించుకోవడం లేదని జాబ్స్ కోల్పోయిన కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన కంపెనీలకు రాష్ట్ర సర్కార్​ భూములు కేటాయిస్తున్నది. సబ్సిడీలు ఇస్తున్నది. ప్రభుత్వం నుంచి అన్నీ చేస్తున్నప్పుడు కంపెనీలను ప్రశ్నించి, ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఆందోళనలో ఉద్యోగులు

సడన్‌‌‌‌‌‌‌‌గా జాబ్స్ కోల్పోతున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చాలా కంపెనీలు రిక్రూట్​మెంట్​ సైతం నిలిపివేయడంతో ఈఎంఐలు, ఇంటి అవసరాలు, పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులు, ఇతరత్రా అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. నష్టాలు అని చెబుతూ, బెంచ్‌‌‌‌‌‌‌‌పై ఉన్నారని, ప్రాజెక్టులు లేవంటూ తొలగించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏడాదిపాటు ఆరోగ్య బీమాతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్థిక సంక్షోభ భయం!

అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం వస్తుందనే భయంతో ట్విట్టర్ లాంటి బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్, అమెజాన్, ట్విట్టర్, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్, మైక్రోసాఫ్ట్, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ వంటి అనేక కంపెనీలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న ఉద్యోగులను తీసేశాయి. ఇంకా వేల మంది ఐటీ ఉద్యోగులపై కత్తి వేలాడుతోంది. ఈ తొలగింపు ఎఫెక్ట్ చిన్న కంపెనీల్లో ఉన్న ఉద్యోగులపైనా పడుతున్నది. పైగా బ్యాక్ ఎండ్ ఉద్యోగాలకు పెద్ద మోసమే వచ్చి పడింది. చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ పత్రాలతో ఉద్యోగాలు పొందారు. అలాంటి వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరోవైపు పెర్ఫామెన్స్ పేరుతో మరికొందరిని తీసేస్తున్నారు.

రూల్స్ పాటిస్తలే

వాస్తవానికి వరుసగా మూడేండ్లపాటు నష్టాలు వస్తేనే కంపెనీలు లే ఆఫ్ ప్రకటించాల్సి ఉంటుంది. ఆ సమయంలోనూ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. లేబర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ చేయాలి. తీసేస్తున్న ఉద్యోగులకు పరిహారం ఇవ్వడంతో పాటు వారికి చట్టబద్ధంగా రావాల్సినవి ఇప్పించాలి. తిరిగి ఉద్యోగం కల్పించే విషయంపై స్పష్టత ఇవ్వాలి. కానీ కంపెనీలు అలాంటిదేమీ లేకుండా ఒక్క మెయిల్ పెట్టి ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాయి. 

రాష్ట్ర సర్కారు స్పందిస్తలే

ఐటీ కంపెనీలు ఇష్టారీతిన లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సబ్సిడీలు, స్థలాలు ఇచ్చిన ప్రభుత్వానికి.. కంపెనీలో నుంచి ఉద్యోగులను తీసేస్తున్నప్పడు అడగాల్సిన బాధ్యత, హక్కు ఉంటుంది. లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా పట్టించుకుంట లేదు. ప్రభుత్వం కలుగజేసుకుని.. తీసేస్తున్న ఉద్యోగులకు కంపెనీల నుంచి బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ ఇప్పించాలి.
- వినోద్ కుమార్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్​ తెలంగాణ కన్వీనర్

ఒక్క మెయిల్‌‌‌‌‌‌‌‌తో తీసేస్తున్నరు..

దిగ్గజ కంపెనీలు ఒకేసారి చాలా మందిని జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. బ్యాక్ ఎండ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన వాళ్లు, బెంచ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న వాళ్లకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో సో పెర్ఫామెన్స్ ఉన్నవాళ్ల మెడపై కత్తి వేలాడుతున్నది. ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఒక్క మెయిల్‌‌‌‌‌‌‌‌తో ఉద్యోగం పోతున్నది. 
- బి.వెన్నెల, ఐటీ ఎంప్లాయ్, హైదరాబాద్