ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేక‌పోతున్నాన‌ని 14ఏళ్ల బాలిక ఆత్మ‌హ‌త్య‌

ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేక‌పోతున్నాన‌ని 14ఏళ్ల బాలిక ఆత్మ‌హ‌త్య‌

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఆన్ లైన్ క్లాసులకు హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని 14 ఏళ్ల బాలిక ఆత్మహ‌త్య చేసుకుంది. కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురం జిల్లాలో ఈ ఘట‌న జరిగింది. వ‌ల‌న్చేరి టౌన్ కు చెందిన దేవిక బాల‌కృష్ణ‌న్ (14) అనే చిన్నారి తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా కేర‌ళ ప్ర‌భుత్వం విక్ట‌ర్స్ చానెల్ ద్వారా టెలివిజ‌న్ క్లాసులు, స్మార్ట్ ఫోన్ యాప్ ఫ‌స్ట్ బెల్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హిస్తోంది. అయితే దేవిక కుటుంబం క‌డు పేద‌రికంలో ఉంది. ఆ బాలిక తండ్రి బాల కృష్ణ‌న్ (45) రోజువారీ కూలీ. అత‌డు ఏదైనా ప‌నికి వెళ్లి కూలీ డ‌బ్బులు తెస్తే కానీ కుటుంబం గ‌డ‌వ‌దు. ఓ వైపు లాక్ డౌన్ వ‌ల్ల చాలా రోజుల నుంచి పెద్ద‌గా ప‌నులు లేక‌పోవ‌డంతో పాటు. కొద్ది రోజులుగా అత‌డు అనారోగ్యంతో ఉండ‌డం వ‌ల్ల పూర్తిగా ఎటువంటి సంపాద‌న లేకుండా పోయింది. వాళ్ల ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు. ఉన్న టీవీ కూడా ప‌ని చేయ‌డం లేదు. దానిని రిపేర్ చేయించ‌డానికి కూడా డ‌బ్బు లేక‌పోవ‌డంతో అది మూల‌న‌ప‌డిపోయింది. దీంతో క్లాసులు మిస్ అవుతున్నాన‌న్న బాధ‌లో డిప్రెస్ అయిన దేవిక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

సూసైడ్ నోట్ రాసి… ఒంటికి నిప్పంటించుకుని..

దేవిక సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఇంటిలో క‌నిపించ‌లేదు. ఎక్క‌డో ఆడుకోవ‌డానికి వెళ్లుంటుందిలే అని తండ్రి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కాని రాత్రి స‌మ‌యంలో అక్క‌డికి స‌మీపంలో చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న ఓ ఇంటి ముందు ఒళ్లంతా కాలిపోయిన దేవిక మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లి ప‌రిశీలించ‌గా.. కిరోసిన్ పోసుకుని నిప్ప‌టించుని మ‌ర‌ణించిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచానా వేశారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి పంపి.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆ చిన్నారి ఇంట్లో ప‌రిశీలించ‌గా.. సూసైడ్ నోట్ క‌నిపించింది. ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు. టీవీ ప‌ని చేయ‌డం లేదు. నేను క్లాసులు మిస్ అవుతున్నాను. చ‌దువులో వెనుక‌బ‌డిపోతానేమో.. నేను వెళ్లిపోతున్నాను అంటూ అందులో రాసింది దేవిక‌. ప‌నులు లేక‌, చేతిలో డ‌బ్బులేకపోవ‌డంతో టీవీ రిపేర్ చేయించ‌లేక‌పోయాన‌ని, చ‌దువు కోసం ప్రాణాలు తీసుకుంటుంద‌ని ఊహించ‌లేద‌ని దేవిక తండ్రి విల‌పించాడు.

ద‌ర్యాప్తుకు ఆదేశించిన‌ విద్యాశాఖ మంత్రి..

ఈ ఘ‌ట‌న‌పై కేర‌ళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెస‌ర్ ర‌వీంద్ర‌నాథ్ స్పందించారు. దేవిక‌ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై డీఈవో ద‌ర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. టీవీ, స్మార్ట్ ఫోన్ లేని నిరుపేద విద్యార్థుల‌ను గుర్తించి.. ఇరుగు పొరుగు వారి ఇళ్ల‌లో ఆన్ లైన్ క్లాసులు వినేలా ఏర్పాటు చేయాల‌ని మున్సిప‌ల్, పంచాయ‌తీ అధికారుల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలిచ్చింద‌ని చెప్పారు. కానీ ఇటువంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. వాస్త‌వానికి ఈ ఆన్ లైన్ క్లాసులు ప్ర‌యోగాత్మ‌కంగా స్టార్ట్ చేశామ‌ని, అవి రీటెలికాస్ట్ అవుతాయ‌ని చెప్పారు.