అక్షర ప్రపంచం : ఊహలే కావ్యాలుగా...

అక్షర ప్రపంచం : ఊహలే కావ్యాలుగా...

ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథానికి ఏనుగు నరసింహారెడ్డి ‘ఊహల వేదిక’ -అని...  
భలే పేరు పెట్టాడు. ఊహ అంటే ప్రాచీనాలంకారాల్లోని ఉత్ప్రేక్ష కాదు. 
అత్యాధునిక కవిత్వపు ప్రాణం ఊహ. పేరు చూడగానే పాఠకులు ఊహల్లో తేలిపోతారు. 
చదివాక ఈ పేరు సార్థకమైందని గ్రహిస్తారు. 

ఈ పుస్తకం 62 వ్యాసాల సంపుటం. ‘‘మబ్బులు సల్లనై ఆకాశంలో తిరిగాయి. భూదేవి స్నానమాడుతుందని వీచేగాలి ప్రకటించింది. పక్షులు పిల్లలపై రెక్కలు గప్పి పడుకున్నాయి” అనే భావం జాషువా ‘పిరదౌసి’లోని ఒక పద్యంలోనిది. మనం అంతగా గమనించని అంశాలను వెలికితీస్తాడు నరసింహారెడ్డి. అలారం అనే ఆంగ్ల పదానికి ‘వేళా ఘంటికల్’ అనే చక్కని మాటను జాషువా ప్రయోగించాడని, గేయానికి కావ్య గౌరవాన్ని తీసుకువచ్చిన డా॥ సి. నారాయణరెడ్డి తన తొలికాలపు ఊహలన్ని గుదిగుచ్చి రాసిన కావ్యం ‘నాగార్జున సాగరం’ అని, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎగరేసిన పాటలనే పంచవన్నెల చిలుకలు మన చుట్టూ గిరికీలు కొడుతూనే వుంటాయని, ‘పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకూ కోటి దండాలు’ అనే పాటలో ఇసుక తిన్నెలకు, చిరుగాలులకు, శిలలకు, అలలకు, కాళ్లకు, కళ్లకు, పెదవులకు, నడుముకు, తొలిజాముకు, సందెవేళకు, ముందునాళ్లకు వ్యక్తిత్వాపాదన చేయడం ఆత్రేయకే సాధ్యమయిందని తెలియజేస్తాడు. 

వస్తువుకు తగిన ఊహలు కవిత్వాన్ని ఉద్దీపింప జేస్తాయంటూ ‘ఎండలను తాళలేక నీడలు చెట్ల కింద దాక్కున్నాయి’ అన్న కొరవి గోపరాజు ఊహనూ ఉదహరిస్తాడు.కవులు ఉపయోగించిన వినూతన పదబంధాలను వివరిస్తాడు ఈ రచయిత. కొలకలూరి ఇనాక్ అమ్మను సంతోషసదీ సామ్రాజ్ఞి, అమాయక అపరబ్రహ్మ, సహ సూర్యకాంతి, సంసార కల్పతరువు, అసంత సౌందర్యావధి, సుగంధ స్వప్నం, వెన్నెల ఆట, ప్రేమలోక దానశీలి, వేకువ వెలుగు మెలకువ, ధైర్య పర్వత శిఖరాగ్ర, స్వర్గలోక పరమహంస అని భావించాడు. ఇవి కొంత సంప్రదాయతను జీర్ణించుకున్నా కొత్త ఊహలున్నాయి. ఎనిమిది మంది భార్యలున్న శ్రీకృష్ణుడు జరిపేది అష్టాంగయోగమేనని చీదెళ్ల సీతాలక్ష్మి అనడం కొత్త ఊహే.

‘చినుకు తాకిన నేల’ అని పుస్తకానికి పేరు పెట్టడం శాంతికృష్ణ అభివ్యక్తి సౌకుమార్యానికి ఒక మంచి ఉదాహరణ. సరిత నరేశ్ ‘అరువు పూలు’ అనే మాట చాలా గొప్ప పదబంధం. పెరుమాళ్ల ఆనంద్ ‘రాలిపడుతున్న ప్రేమ!’ కొత్త ప్రయోగం. కోమటింటిని ‘ఊరుమ్మడి గుమ్మి’ అని మడత భాస్కర్ అనడం కొత్తదనం. కె. ప్రభాకర్ ‘కాల కన్య’ అనడం నవ్య సంప్రదాయం. కాపు స్త్రీకి ‘హాలిక’ అని కొత్తపేరు పెట్టింది కొండపల్లి నీహారిణి. హాజ్ లిట్ చెప్పినట్లు ‘Poetry is the language of imagination' అన్నది కేవలం సౌందర్యాత్మక సృజనకే కాదు. సామాన్యుల ఇతివృత్తాలకూ వర్తిస్తుందని నిరూపించిన కవిత్వం నిజం శ్రీరామమూర్తి ‘బూడిదచెట్ల పూలు’. దాసోజు లలిత ‘దాతి’లో చాకలి ‘సౌడు పూతలతో సర్ఫన్ను కనిపెట్టిన మహా శాస్త్రజ్ఞురాలు’ అన్నది. భిక్షుకున్ని ‘ఆకలి శిఖరం’ అంటాడు గజ్జెల రామకృష్ణ, వాసరచెట్ల జయంతి ‘తురాయి పూలు’లోని కొత్త వ్యక్తీకరణలు వెల్లడిస్తాడీ రచయిత, ‘బృంద కవిత్వ మొక తరగని ఊహ’ అనే ప్రత్యేక వ్యాసమే ఉంది ఇందులో.

కొందరు కవుల కావ్యాల గురించి నరసింహారెడ్డి అభిప్రాయాలు ... 

“ఒక కవితలో కొన్ని వాక్యాలు బాగుండడం వేరు. ప్రతి వాక్యమూ బాగుంటే... అలా ప్రతి కవితా బాగుంటే... అది గజ్జెల రామకృష్ణ ‘దీపముండగానే’ కవిత్వం అవుతుంది. ఇతని తొలి సంకలనమే కవితా ప్రపంచానికి వెలలేని కానుక”.  “విఠలాపురం పుష్పలత కవిత్వ జడివాన కురిపించిన తీరు నన్ను కట్టిపడేసింది. చెక్కిళ్లపై చిరునవ్వు అతికించుకోవడాన్ని చినిగిన గుడ్డకు మాసిక వేసినట్లు అనడం కొత్త ఊహే.’’ ‘ఆనందవర్ధనం’లో సరిగమల సరసగేయం రాసినా, ప్రేమ ప్రయాణం ఘాటు సంస్కృతంలో చేసినా అది కవిత్వమే అవడానికి కారణం అవి స్తంభంకాడి గంగాధర్ హృదయాంతరాళం నుండి ఉబికి వచ్చినవి. కోట్ల వెంకటేశ్వర రెడ్డి మనోహరమైన కవితా సంపుటి ‘అంతర్వాహిని’. కొత్త జంటలకు బహుమతిగా ఇవ్వదగ్గది.శతకం, ఆటవెలది, వచన కవితల గురించి ఈ రచయిత చెప్పిన అందమైన మాటలు:

‘‘హృదయాన్ని తట్టిన ప్రతి భావాన్నీ మాలలా గుచ్చి ఒక హారంలా చేయడమే శతకం.. పద్యంతో ఆడుకోవడానికీ, భక్తిలో మునిగిపోవడానికీ, లోకాన్ని నోరారా తిట్టడానికి, మనసారా నీతులు చెప్పడానికి తెలుగు కవికి పడిపోకుండా ఉన్న ఒక పురా వంతెన.” “జాతుల్లో ఆటవెలది సౌందర్యమే వేరు. ఏ స్థానమూ గురువు కోసమో, లఘువు కోసమో గిరిగీసుకోకపోవడం దాని సౌలభ్యం. ఒకటి మూడులది ఒక కొలత, రెండు, నాలుగులది ఒక కొలత కావడం వల్ల దాని నడకలో నాట్యం వచ్చి చేరడమే కాకుండా కవిని కాస్త సుఖపెడుతుంది.” “ఆధునిక వచన కవిత్వమంటే కనిపించని పునాదుల మీద కట్టవలసిన రంగుల హార్మ్యం. నవ్యత, క్లుప్తత, గుప్తత, సాంద్రత దాని లక్షణం.కవుల కావ్యాలతో పాటు వివిధ సంకలనాలు, కవిత్వాల పాత కొత్త రూపాలు మొ॥ వాటిపై వ్యాసాలు, సందర్భానుగుణంగా ప్రపంచ కవుల కవితలు, కొటేషన్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదివితే - ఊహలే కావ్యాలుగా రూపాంతరం చెందిన తీరు తెలుస్తుంది. 

వర్ధమాన కవులకూ కొత్త కొత్త ఊహలు కలుగుతాయి. కవితా వస్తువులు దొరుకుతాయి. కవిత్వ నిర్మాణ మెలకువలు తెలుస్తాయి. ఈ రచయితే ఉదహరించిన కొప్పోలు యాదయ్య కవితలో ఉన్నట్టు - ‘‘ఊహల రూపాలకు ప్రాణం పోస్తూ / ఆశలని సజీవం చేసి / గమ్యం చేరినప్పుడల్లా / మరిన్ని ఉత్సాహపు ఊహలు / ఉదయిస్తూనే ఉంటాయి.” 

ఎ. గజేందర్ రెడ్డి, 9848894086