లేఔట్, బిల్డింగ్ పర్మిషన్లకు కొత్త విధానం

లేఔట్, బిల్డింగ్ పర్మిషన్లకు కొత్త విధానం
  • తనిఖీ ఆఫీసర్లుగా ఆర్ఐలు, డీటీలు, అసిస్టెంట్ ఇంజినీర్లు   
  • సర్క్యులర్ జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణ అనుమతులు, లేఔట్ పర్మిషన్లకు త్వరలోనే టీఎస్ బీపాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లేఔట్, బిల్డింగ్ సైట్లలో తనిఖీల కోసం సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్లు, టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్లను నియమించాలని అన్ని జిల్లాల డీపీఓలను ఆదేశించింది. జిల్లా, ఆఫీసర్ పేరు, డిపార్ట్ మెంట్, హోదా, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ వివరాలను అందజేయాలని ప్రత్యేక ఫార్మాట్ ను పంపింది. టీఎస్ బీపాస్ చట్టం– 2020 అమలులోకి వచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో లేఔట్, ఇంటి నిర్మాణ పర్మిషన్ల కోసం ఆన్ లైన్ లో, మీ సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు కట్టుకోవాలంటే పంచాయతీ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకుంటే పంచాయతీ సెక్రటరీ పరిశీలించి ఈ– పంచాయతీ ద్వారా అనుమతి ఇచ్చేవారు. కానీ ఇక నుంచి మీ సేవ ద్వారా భూమికి సంబంధించిన ఓనర్ షిప్ డాక్యుమెంట్లు, ఇంటి ప్లాన్ తయారు చేసుకుని టీఎస్‌ బీపాస్‌లో అప్‌లోడ్‌ చేయాలి. సంబంధిత శాఖల అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్మిషన్ ఇవ్వనున్నారు. అనంతరం 21 రోజుల్లో దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే పర్మిషన్ ఇచ్చినట్లుగానే భావించాలి. డాక్యుమెంట్లు సక్రమంగా లేని కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అనుమతి లేని నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారం పంచాయతీలకు ఉంది.

ఆఫీసర్ల నియామకం ఇలా.. 

జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ లేదా కలెక్టర్ నామినేట్ చేసిన ఎవరైనా ఇంజనీర్ గ్రామ పంచాయతీల్లో లేఔట్ అప్రూవల్ కోసం సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. అలాగే లేఔట్(10 ఎకరాల వరకు) ఉంటే జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్(డీటీసీపీఓ), లేఔట్10 ఎకరాలు మించితే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. బిల్డింగ్ పర్మిషన్ విషయానికొస్తే మండలం యూనిట్ గా టీఎస్ బీపాస్ ను అమలు చేయనున్నారు. సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్ గా రెవెన్యూ ఇన్ స్పెక్టర్/ డిప్యూటీ తహసీల్దార్, టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్ గా మండల ఇంజినీరింగ్ ఆఫీసర్(పీఆర్ ఏఈఈ/ఏఈ) లేదా కలెక్టర్ నామినేట్ చేసిన ఇంజనీర్ వ్యవహరిస్తారు.   

పంచాయతీలకు కొత్త ఖాతాలు..  

లేఔట్, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారులు చెల్లించిన టీఎస్ బీపాస్ ఫీజు మొత్తం తొలుత స్టేట్ పూల్ అకౌంట్ లో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని పంచాయతీలవారీగా ట్రాన్స్ ఫర్ చేసేందుకు ప్రతి జీపీకి కొత్త సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవాలని ప్రభుత్వం అన్ని పంచాయతీల సెక్రటరీలను ఆదేశించింది.