- ఏఐతో రవాణాను రియల్ టైమ్‌లో పర్యవేక్షించొచ్చు
- ఐఐఎం ముంబై రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశంలో సరుకు రవాణా (లాజిస్టిక్స్) వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ప్రభుత్వానికి, బిజినెస్‌లకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు ఆదా అవుతుందని, దాదాపు కోటి ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొచ్చే అవకాశముందని ఐఐఎం ముంబై ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్లు (డీఎఫ్‌సీలు), మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులు (ఎంఎంఎల్‌పీలు) ఈ విప్లవాత్మక మార్పులో కీలకంగా పనిచేస్తాయని ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ తివారీ శుక్రవారం స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాలతో పాటు అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఏజెంటిక్ ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీని జోడిస్తే సరుకు రవాణాను రియల్-టైమ్‌లో పర్యవేక్షించడం సులువవుతుందని, ఇది సరఫరా ఖర్చులను మరింత తగ్గించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, రైల్వే, రోడ్డు రవాణా మార్గాలను మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులతో కలపడం వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సరుకు సరఫరా వ్యవస్థ మరింత వేగవంతమై, ఖర్చులు గణనీయంగా దిగొస్తాయి. రవాణా, వేర్‌హౌసింగ్, పంపిణీ, ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగాల్లో ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. 2030 నాటికి ఈ రంగానికి అదనంగా 1.15 కోట్ల మంది నిపుణులు అవసరమవుతారని అంచనా.
వెస్ట్రన్ కారిడార్ పూర్తి
ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి నుంచి నవీ ముంబై (జేఎన్పీటీ) వరకు నిర్మించిన 1,506 కిలోమీటర్ల పొడవైన ‘వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్’ (డబ్ల్యూడీఎఫ్‌సీ) పనులు పూర్తికావడం దేశ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది. కేవలం గూడ్స్ రైళ్ల కోసమే నిర్మించిన ఈ మార్గంతో రవాణా సామర్థ్యం పెరిగి, సమయం ఆదా అవుతుంది. కాగా, భారత జీడీపీలో లాజిస్టిక్స్ రంగం వాటా ప్రస్తుతం 13 శాతంగా ఉంది.
