కస్టడీకి ఇమ్రాన్.. ఎన్ఏబీకి 8 రోజుల పాటు అప్పగిస్తూ కోర్టు తీర్పు

కస్టడీకి ఇమ్రాన్..  ఎన్ఏబీకి 8 రోజుల పాటు అప్పగిస్తూ కోర్టు తీర్పు

 

  • కస్టడీకి ఇమ్రాన్
  • ఎన్ఏబీకి 8 రోజుల పాటు అప్పగిస్తూ కోర్టు తీర్పు
  • అల్ ఖాదీర్ ట్రస్టు కేసులో విచారణ
  • తోషఖానా కేసులోనూ ఇమ్రాన్​పై నేరాభియోగాలు నమోదు  
  • పాక్​లో కొనసాగుతున్న నిరసనలు
  • నలుగురు మృతి.. వెయ్యి మంది అరెస్టు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు 8 రోజుల కస్టడీ విధించింది. దర్యాప్తు సంస్థ నేషనల్ అకౌంటెబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) 14 రోజుల కస్టడీ కోరగా, కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతించింది. అల్ ఖాదీర్ ట్రస్టుకు అక్రమంగా భూమిని బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలతో ఇమ్రాన్ ను మంగళవారం అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రాత్రంతా ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం ఎవరికీ తెలియనియ్యలేదు. బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఇమ్రాన్ పై ఉన్న రెండు అవినీతి కేసుల విచారణ కోసం ఇస్లామాబాద్ లోని న్యూ పోలీస్ గెస్ట్ హౌస్ ను కోర్టుగా మార్చారు. అల్ ఖాదీర్ ట్రస్టు కేసుపై యాంటీ అకౌంటెబిలిటీ కోర్టు జడ్జి మహమ్మద్ బషీర్ విచారణ చేపట్టారు.

ఎన్ఏబీ లాయర్లు వాదనలు వినిపిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ రూ.5 వేల కోట్ల (పాక్ కరెన్సీ) అవినీతికి పాల్పడ్డారని, ఆయనను 14 రోజుల రిమాండ్ కు అప్పగించాలని కోరారు. అయితే దీన్ని ఖాన్ లాయర్లు వ్యతిరేకించారు. ఇమ్రాన్ పై అక్రమ కేసులు పెట్టారని, ఆయనను విడుదల చేయాలని కోరారు. వాదనలు విన్న కోర్టు.. మొదట తీర్పును వాయిదా వేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి తీర్పు ఇస్తూ.. ఇమ్రాన్ ను 8 రోజుల ఫిజికల్ రిమాండ్ పై ఎన్ఏబీకి అప్పగించింది. మరోవైపు, తోషఖానా కేసులోనూ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఎదుట ఇమ్రాన్ ను హాజరుపరిచారు. ఈ కేసులో అతనిపై కోర్టు నేరాభియోగాలు నమోదు చేసింది. ప్రధానిగా ఉన్నప్పుడు తనకు వచ్చిన గిఫ్టులను తక్కువ ధరకు తోషఖానా నుంచి కొనుగోలు చేసిన ఇమ్రాన్.. బయట వాటిని ఎక్కువ ధరకు అమ్ముకున్నారని కేసు నమోదైంది. 

సుప్రీంలో పీటీఐ పిటిషన్..

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు రాకుండా అడ్డుకున్నారు. కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. ఇమ్రాన్ ను చూసేందుకు తమను అనుమతించకపోవడంపై పీటీఐ వైస్ ప్రెసిడెంట్ షా మహమ్మద్ ఖురేషీ, జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఇమ్రాన్ అరెస్టును సమర్థిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పీటీఐ లీడర్లు బుధవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

ఇంటర్ నెట్, స్కూళ్లు బంద్..  

ఇమ్రాన్ అరెస్టుకు నిరసనగా పాక్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ ఒక్క ప్రావిన్స్ లోనే దాదాపు వెయ్యి మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలు బంద్ చేశారు. స్కూళ్లను క్లోజ్ చేశారు. కాగా, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయారని, చాలామంది గాయపడ్డారని  పీటీఐ లీడర్లు పేర్కొన్నారు.

నాకు ప్రాణహాని ఉంది: ఇమ్రాన్

తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు ఇమ్రాన్ చెప్పారు. ఎన్ఏబీ అధికారులు తనను టార్చర్ పెట్టారని, గత 24 గంటల్లో కనీసం వాష్ రూమ్ కు కూడా వెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెమ్మదిగా గుండెపోటు వచ్చే ఇంజెక్షన్ తనకు ఇచ్చారని ఆరోపించారు. తన డాక్టర్ ఫైసల్ సుల్తాన్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.