ఇమ్రాన్ ఖాన్..నటనలో సల్మాన్, షారుఖ్ ఖాన్లను మించిండు: ఫజ్లుర్ రెహ్మాన్

ఇమ్రాన్ ఖాన్..నటనలో సల్మాన్, షారుఖ్ ఖాన్లను మించిండు: ఫజ్లుర్ రెహ్మాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లను మించిపోయారని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్  అన్నారు. వజీరాబాద్లో ఇమ్రాన్పై జరిగిన దాడిని ఆయన ఓ డ్రామాగా అభివర్ణించారు. తాను మొదట ఇమ్రాన్పై జరిగిన దాడి గురించి విని బాధపడ్డానని.. ఇప్పుడు అదంతా డ్రామాగా అనిపిస్తోందన్నారు. 

‘‘ఇమ్రాన్ శరీరంలోకి దిగిన బుల్లెట్ ఎలా ముక్కలుగా అయిపోతుంది. శరీరంలో బాంబ్ పేలుడు ముక్కలు గురించి విన్నాం..కానీ బుల్లెట్ ముక్కల గురించి ఎప్పుడు వినలేదు. దాడి జరిగిన వెంటనే ఇమ్రాన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించకుండా లాహోర్ కు తీసుకెళ్లడం ఆశ్చర్యం కల్గించింది. ఇమ్రాన్ అబద్ధాలను ప్రజలు కూడా నమ్ముతున్నారు’’ అని అన్నారు. 

పాకిస్థాన్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ తో ఇమ్రాన్ ఖాన్ వజీరాబాద్ లోని అల్లాహోచౌక్లో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కాలికి గాయమవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.