ఇమ్రాన్ ఖాన్ హెలికాప్టర్ ప్రయాణ ఖర్చు 1 బిలియన్

 ఇమ్రాన్ ఖాన్ హెలికాప్టర్ ప్రయాణ ఖర్చు 1 బిలియన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ హెలికాప్టర్ ప్రయాణాల వల్ల ఖజానాకు రూ.1 బిలియన్ నష్టం వాటిల్లిందని ది నేషన్‌ పత్రిక ఓ నివేదిక ప్రచురించింది. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా హెలికాప్టర్‌లో ప్రయాణించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని విమర్శించింది. అందుకు అయిన ఖర్చు వివరాలను పాకిస్థాన్ సెనేట్ కు సమర్పించినట్లు తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ పీఎంగా ఉన్నప్పుడు  6 ఏవియేషన్ స్క్వాడ్రన్ ద్వారా వీవీఐపీ హెలికాప్టర్ల కోసం రూ. 946.3 మిలియన్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపింది. ఇస్లామాబాద్ లోని తన నివాసం నుంచి పీఎం హౌస్ వరకు ప్రయాణించడానికి కూడా ఇమ్రాన్  హెలికాప్టర్‌ను ఉపయోగించినట్లు ది నేషన్ నివేదికలో స్పష్టం చేసింది. 

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున ఉన్న సమయంలో ఈ లెక్కలు బయటకు వచ్చాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాల అధినేతలు, విదేశీ ప్రముఖుల నుండి పొందిన బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారన్న ఆరోపణలపైన విచారణ జరుగుతోంది. ఇమ్రాన్ పొందిన బహుమతులలో చేతి గడియారం, ఒక జత కఫ్‌లింక్‌లు, ఖరీదైన పెన్, ఉంగరం, నాలుగు రోలెక్స్ వాచీలు ఉన్నాయి.