అబద్ధాలు చెప్పేవాళ్లని నమ్మరు

అబద్ధాలు చెప్పేవాళ్లని నమ్మరు

కొంతమందికి అబద్ధం చెప్పనిదే నిద్ర రాదు. అది వాళ్లకి తెలియకుండా వాళ్లలో పెరిగే వ్యసనం. ఆ వ్యసనం వల్ల అతడికి మంచి జరగకపోయినా, ఒక్కోసారి ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకు ఉదాహరణే చిన్నతనంలో చాలామంది చదువుకున్న ‘‘నాన్నా.. పులి!’’ కథ.

ఒక ఊళ్లో సోమయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ప్రతి రోజూ తన గొర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లి, సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు సోమయ్యతో పాటు అతడి కొడుకు రాము కూడా వస్తానన్నాడు. పిల్లవాడికి కూడా గొర్రెల పెంపకం గురించి తెలుస్తుందనే ఉద్దేశంతో సోమయ్య రాముని వెంటబెట్టుకుని, గొర్రెల మందను అడవికి తీసుకెళ్లాడు. సోమయ్య రాముకి కొన్ని జాగ్రత్తలు చెప్పి,పులి లాంటి క్రూర మృగం వస్తే పిలవమని చెప్పి తన పనులు చేసుకుంటున్నాడు. 

కొంతసేపు ఆ అడవిలో పచ్చని చెట్లను చూస్తూ హాయిగా కాలక్షేపం చేశాడు రాము. నాన్నను సరదాగా ఆటపట్టించాలనుకుని, ‘నాయనా! పులివచ్చె! రక్షించు! రక్షించు!’ అంటూ ఏడుస్తూ బిగ్గరగా అరిచాడు రాము. సోమయ్య పరుగుపరుగున రాము దగ్గరకు వచ్చి చూస్తే, అక్కడ పులి లేకపోగా, రాము ‘పులి లేదు గిలి లేదు’ అంటూ నవ్వాడు. రాముని మందలించి సోమయ్య మళ్లీ పొలం పనుల్లోకి వెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా రాము మరోమారు తనను రక్షించమని కేకలు వేశాడు. మళ్లీ సోమయ్య పరుగున వెళ్లి చూశాడు. రాము నవ్వుతూ కనిపించాడు. ఈసారి మరింత గట్టిగా మందలించి తన పనిలోకి వెళ్లిపోయాడు సోమయ్య. 

ఈసారి నిజంగానే పులి వచ్చింది. రాము భయంతో వణికిపోతూ, ‘నాయనా! ఈసారి నిజంగానే పులి వచ్చింది, రక్షించు!’ అని పెద్దగా కేకలు వేశాడు. అంతకు ముందు రెండుసార్లు రాము తనను ఆటపట్టించటంతో సోమయ్య ఈసారి వెళ్లలేదు. పులి కడుపునిండుగా గొర్రెలను తినేసింది. రాము చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకున్నాడు. సాయంత్రమయ్యాక పనులు పూర్తి చేసుకుని రాము దగ్గరకెళ్లి చూసేసరికి కొన్ని గొర్రెలు కనిపించలేదు. రాము ఏమో చెట్టు మీద కూర్చుని ఏడుస్తున్నాడు. విషయం తెలుసుకున్న సోమయ్య, ‘ఒక్కసారి అబద్ధం చెప్తే, ఆ తరవాత ఎన్నిసార్లు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు రెండు సార్లు అబద్ధం చెప్పటం వల్ల, మూడోసారి నిజం చెప్పినా నేను నమ్మలేదు’ అని రాముకి నీతి బోధించాడు.

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో, ‘అశ్వత్థామ మరణించినట్లు చెప్తేనే ద్రోణుడిని సంహరించగలం లేదంటే ఆయనను ఎదుర్కోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు’ అని శ్రీకృష్ణుడు పలికాడు. అదే సమయంలో అశ్వత్థామ అనే ఏనుగు మరణించింది. ‘‘కాబట్టి, అశ్వత్థామ మరణించాడు అంటే దోషం ఉండదని’’ శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఉపాయం చెప్తాడు. ఆ మాటలు చెవిన పడిన వెంటనే భీముడు, ద్రోణాచార్యుని ఎదుటికి వెళ్లి, ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలుకుతాడు. ఆ మాటలు విన్నా కూడా ద్రోణాచార్యుడు నమ్మడు. ‘ధర్మరాజు చెప్తేనే నమ్ముతా’ అంటాడు. ధర్మరాజు ఎల్లవేళలా సత్యాన్నే పలుకుతాడు. ధర్మరాజు వచ్చి ‘అశ్వత్థామ హతః’ అంటుండగానే శ్రీకృష్ణుడు శంఖం పూరిస్తాడు. ‘కుంజరః’ అనే పదం ఆ శంఖనాదంలో కలిసిపోతుంది. ధర్మరాజు చెప్పాడంటే నిజమే అని భావించిన ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తాడు. అశ్వత్థామ.. చిరంజీవి అని తెలిసిన్పటికీ, ధర్మరాజు మాట మీద అంత నమ్మకం. 

కొంతకాలం క్రితం ఒక రాజకీయనాయకుడు ఉండేవాడట. ఎన్నికలప్పుడు తియ్యటి వాగ్దానాలు చేసేవాడట. ఆ మాటలను నమ్మిన ప్రజలంతా ఆయనకు ఓట్లు వేసి గెలిపించారట. గెలిచాక తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా.. మళ్లీ అవే వాగ్దానాలు చేశాడట. అయినా ఆయనను మూడు సార్లు గెలిపించారట. మూడుసార్లు ఇదే విధంగా చేశాడట. నాలుగోసారి ఎన్నికల్లో నిలబడినప్పుడు నిజంగానే ప్రజలకు మేలు చేయాలి అనుకున్నాడు. ఎప్పటిలాగే వాగ్దానాలు చేశాడు. కానీ, ప్రజలు ఈసారి ఆ రాజకీయనాయకుడి మాటలు నమ్మలేదు.

అతడిని ఓడించారు. గతంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా, అసత్యమే పలుకుతున్నాడని అనుకోవడం వల్లనే.. తనను ఓడించారని, తాను చేసిన తప్పుకు మనసులోనే బాధపడ్డాడు ఆ రాజకీయ నాయకుడు. హాస్యానికి కూడా అసత్యం చెప్పొద్దంటారు పెద్దలు. అందుకే ‘సత్యం వద’ అని మన వేదాలు చెప్తున్నాయి. అసత్యం చెప్పే వారి వల్ల వాళ్లకే కాకుండా, ఇతరులకు కూడా హాని జరుగుతుందని అనుభవం మీద తెలుసుకున్న పండితులు ‘సత్యమేవ జయతే’ అని పలికారు. సత్యం పలికితే ఎందులోనైనా విజయం సాధించగలుగుతారు. - డా. వైజయంతి పురాణపండ, ఫోన్: 80085 51232