బోర్లే దిక్కు!..మిషన్​ భగీరథ ద్వారా డిమాండ్​కు తగ్గట్టు నో సప్లయ్

బోర్లే దిక్కు!..మిషన్​ భగీరథ ద్వారా డిమాండ్​కు తగ్గట్టు నో సప్లయ్
  •     ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల నజర్​
  •     పనిచేస్తున్న బోర్ల లెక్కలు తీస్తున్న యంత్రాంగం
  •     పాడైన వాటికి రిపేర్లు, కొత్త బోర్ల తవ్వకంపై దృష్టి
  •     వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో మిషన్​ భగీరథ ద్వారా డిమాండ్​కు తగ్గట్లు తాగునీటి సప్లయ్​ లేదు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు.  స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవడంపై నజర్​ పెట్టారు. అవసరమైన చోట్ల కొత్త బోర్ల తవ్వకం, పైపులైన్లలో లీకేజీలు అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. రిపేర్లెవైనా ఉంటే తక్షణమే చేయించాలని కలెక్టర్​ జితేశ్​​ వీ పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లాలో  526 పంచాయతీలున్నాయి. ఇటీవల ప్రభుత్వం గ్రామాలవారీగా  వాటర్​ సప్లయ్​పై సమాచారం సేకరించింది. ఆర్​డబ్ల్యూఎస్​ ఇంజినీర్లు, పంచాయతీ సెక్రెటరీలు

 స్పెషల్ ఆఫీసర్ల ద్వారా క్షేత్రస్థాయి నుంచి వివరాలు తీసుకున్నారు. గ్రామాల్లో ఉన్న బోర్ల సంఖ్య, ఇందులో పని చేస్తున్న బోరు మోటార్లు, హ్యాండ్​ పంప్​లు, ఓహెచ్​ఎస్​ఆర్​ కనెక్షన్​ మోటార్లు తదితర సమాచారాన్ని సేకరించారు. జిల్లాలో 263 హ్యండ్​పంప్​ సెట్లుండగా వీటిలో 165 పనిచేస్తున్నాయి. 3,386 సింగిల్​ ఫేజ్​ మోటార్లకు గాను 2,940 కండీషన్​లో ఉన్నాయి.1,243 పీడబ్ల్యూఎస్​​ మోటార్లుండగా ఇందులో 1,090 వర్క్​ చేస్తున్నాయి.1,463 వాటర్​ ట్యాంక్​లు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని తాడ్వాయి, గాంధారి, సదాశివ్​నగర్​, రామారెడ్డి, పిట్లం, లింగంపేట, రాజంపేట, జుక్కల్​, మాచారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉంది. ఆయా గ్రామాల్లో పనిచేయని బోర్లను రిపేర్​ చేయించడం, లీకేజీలను అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 278 చోట్ల పైపులైన్ల లీకేజీలు, పైపులైన్లు వేయడంతో పాటు  ట్యాంకుల రిపేర్ల​కు రూ.3.61 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల రిపేర్లు చేయించారు.15వ ఆర్థిక సంఘం నిధులతో  పాటు ఎమ్మెల్యేలు, పంచాయతీ ఫండ్స్​ వినియోగించనున్నారు. ఈ నెల 15 లోగా రిపేర్లు కంప్లీట్​ చేయాలని ఆఫీసర్లు ఆదేశించారు. 

మున్సిపాలిటీల్లోనూ..

మున్సిపాలిటీల్లో నీటి సమస్య రాకుండా చూడాలని కమిషనర్లను కలెక్టర్​ ఆదేశించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో డిమాండ్​కు అనుగణంగా మిషన్​ భగీరథ ద్వారా నీటి సరఫరా లేదు. ఎండలు ఎక్కువైతే సమస్య మరింత తీవ్రం కానుంది. కామారెడ్డిలో ప్రతిరోజూ 12 ఎంఎల్​డీ నీళ్లు సప్లయ్​ చేయాల్సి ఉండగా  8.5 ఎంఎల్​డీ నీళ్లను మాత్రమే సప్లయ్​ చేస్తున్నారు. అది కూడా రోజు విడిచి రోజు నీళ్లను విడుదల చేస్తున్నారు. టౌన్​లోని పలు కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడక్కడ లీకేజీలు ఉన్నాయి. ఇటీవల మున్సిపల్ మీటింగ్​లో అత్యవసరంగా బోర్లను రిపేర్ ​చేయించాలని​, వాటర్​ ట్యాంకుల ద్వారా సప్లయ్​కు చర్యలు చేపట్టాలని సభ్యులు కోరారు.