పండుగ సంబరాల్లో తొక్కిసలాట...45 మంది మృతి

పండుగ సంబరాల్లో తొక్కిసలాట...45 మంది మృతి

ఇజ్రాయెల్​లో యూదుల పండుగలో తొక్కిసలాట జరిగి 45 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి లగ్ బావోమర్ ఫెస్టివల్​ను జరుపుకునేందుకు పవిత్ర స్థలమైన మౌంట్ మెరన్ దగ్గర యూదులు పెద్దఎత్తున చేరుకున్నారు. పండుగకు పదివేల మందికి మాత్రమే అనుమతివ్వగా లక్ష మందికి పైగా హాజరయ్యారని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా కరోనా కేసులు తగ్గడంతో యువత, పిల్లలు కూడా భారీగా తరలి వచ్చారు. గురువారం రాత్రి మౌంట్ మెరన్ పై రబ్బిషైమన్ బార్ యోచై సమాధి దగ్గర దాదాపు లక్ష మంది పోగయ్యారు. అందరూ డాన్సులు చేస్తూ వేడుక జరుపుకుంటున్నారు. ఇంతలో కొంత మంది పైఅంతస్తు మెట్ల నుంచి జారి కిందపడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. భయభ్రాంతులకు గురై అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. కొందరు అక్కడికక్కడే చనిపోయారు. డెడ్ బాడీల మధ్య చిక్కుకుని ఊపిరాడక మరికొందరు సాయం కోసం కేకలు వేశారు. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాయి. తొక్కిసలాట ప్రాంతం బూట్లు, హ్యాట్ లు, వాటర్ బాటిళ్లు చిందరవందరగా పడి ఉన్నాయి. కొన్ని చోట్ల మెటల్ రెయిలింగ్ లు కూడా విరిగి పడ్డాయి. ఘటనపై మాగెన్ డెవిడ్ ఆడమ్ (ఎండీఏ) రెస్క్యూ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎలి బిన్ మాట్లాడుతూ..  'తొక్కిసలాటలో చిక్కుకున్నవారిని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో రక్షించాం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది' అని అన్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత  ఇజ్రాయెల్ హెల్త్ మినిస్ట్రీ మౌంట్ మెరన్ కు వెళ్లొద్దని ప్రజలను కోరింది.