నిర్మల్ జిల్లాలో భూమిలో పెరిగిన నీటిశాతంతో పంటలకు కలుపు బెడద

నిర్మల్ జిల్లాలో భూమిలో పెరిగిన నీటిశాతంతో పంటలకు కలుపు బెడద

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన గడ్డి పంటలను మింగేస్తోంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు ఈ గడ్డి నష్టం చేసింది. భూమిలో నీటి శాతం ఎక్కువవడంతో కలుపు విపరీతంగా పెరిగింది. దీనివల్ల పంటల దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ధరలు కూడా తగ్గుతుండటంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. 

తగ్గిన దిగుబడులు 

ప్రతి ఏటా మొక్కజొన్న పంట ఎకరానికి 35 సంచుల దిగుబడి వస్తుండేదని ఈసారి మాత్రం ఆరు నుంచి ఏడు సంచుల దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం మొక్కజొన్న పంట సాగుకు ముప్పై వేల కు పైగా ఖర్చు అవుతుందని వారు చెబుతున్నారు. అయితే క్వింటాలు మొక్కజొన్న ధర ప్రస్తుతం రెండు వేల వరకు మాత్రమే పలుకుతోందని పేర్కొంటున్నారు. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఇక మొక్కజొన్న పంటను నమ్ముకున్న రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. జిల్లాలో మొత్తం 24 వేల ఎకరాలలో ఈసారి మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే సోయా పంట పరిస్థితి కూడా ఇలాగే దయనీయంగా మారిందని అంటున్నారు. ప్రతి ఏటా ఎకరానికి 8 నుండి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా ఈసారి 3 క్వింటాళ్లు కూడా దాటడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరం సోయా పంట సాగుకు 50 వేల రూపాయలు ఖర్చయిందని, ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో ఎకరానికి 15 వేల రూపాయలు కూడా రావడంలేదని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష పదహారు వేల ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు అయింది. అయితే భారీ వర్షాలతో మొక్కజొన్న, సోయాబీన్ పంటలలో గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ఆ గడ్డి ప్రస్తుతం  రెండు పంటలకు ముప్పుగా మారిందని అంటున్నారు.

126 శాతం అధిక వర్షపాతం నమోదు...

ఈసారి జిల్లాలో 126 శాతం వర్షపాతం నమోదయింది. నెల రోజులపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా పంట సాగు కూడా ఆలస్యంగా మొదలైంది. అయితే భారీగా కురిసిన వర్షాలతో భూగర్భంలో నీటి శాతం విపరీతంగా పెరగడం, అలాగే పంట చేలు చాలా చోట్ల నీట మునగడం లాంటి పరిణామాలు మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగుకు ఆటంకంగా మారాయి. అయితే ఈ భూముల లో పంటలు సాగు చేసినప్పటికీ దిగుబడి మాత్రం తగ్గిపోయింది. మొత్తానికి వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న, సోయాబీన్ పంటలను సాగుచేసిన రైతులకు మాత్రం ఈసారి నష్టం కలగజేసింది. 

దిగుబడి బాగా తగ్గిపోయింది... 

భూమిలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున గడ్డి విపరీతంగా పెరిగిపోవడంతో మొక్కజొన్న పంట దిగుబడి తగ్గింది. ఏనాడు కూడా నేను ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఎకరానికి 10 సంచులకు కూడా మొక్కజొన్న దిగుబడి మించడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా తిరగరాని పరిస్థితి ఉంది. ప్రభుత్వమే మిమ్ములను ఆదుకోవాలి.

- భోజన్న, రైతు, వెంగ్వా పేట