
శ్రీచైతన్య, నారాయణ, ఇతర కార్పొరేట్ కాలేజీల్లో ఏటా ఇదే దందా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో ఉండే ఓ వ్యక్తి నిరుడు ఇంటికి దగ్గరలోని ఓ కార్పొరేట్ కాలేజీలో కొడుకును చేర్పించాడు. కానీ అడ్మిషన్ మాత్రం కూకట్పల్లి ఏరియాలో అదే సంస్థకు ఉన్న మరో కాలేజీలో చేసుకున్నారు. అడ్మిషన్ వేరే కాలేజీలో ఇచ్చామన్న విషయం కూడా చెప్పలేదు. దీంతో ఆ స్టూడెంట్‌కు కూకట్ పల్లికి సమీపంలోని బాచుపల్లిలో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఇదేందని కాలేజీ ప్రిన్సిపాల్‌ను నిలదీసినా ఫలితం లేకపోయింది. ఇక, చేసేదేమీ లేక పరీక్షలు ఉన్నన్నీ రోజులు ఆ స్టూడెంట్, అతని తండ్రి అవస్థలు పడుతూ ఎగ్జాం సెంటర్‌కు వెళ్లొచ్చారు. వీళ్లు మాత్రమే కాదు.. నగరంలోని శ్రీచైతన్య, నారాయణ, ఇతర కార్పొరేట్ కాలేజీల్లో చేరుతున్న చాలా మంది ఏటా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా కార్పొరేట్ కాలేజీలు ఏండ్లుగా.. ఒకచోట స్టూడెంట్లను చేర్పించుకొని, మరోచోట క్లాసులు చెప్పిస్తూ.. ఇంకో చోట అడ్మిషన్ చూపిస్తున్నాయి. అయినా ఇంటర్ బోర్డు అధికారులు, రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదు.
గుర్తింపు లేకున్నా చర్యలు తీస్కోలే
రాష్ట్రంలో 2022–23 అకడమిక్ ఇయర్లో 1,353 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. మరో100కు పైగా కాలేజీలు అనధికారికంగా కొనసాగుతున్నట్టు అధికారులు చెప్తున్నాయి. వీటిలో దాదాపు 250 వరకు నారాయణ, శ్రీచైతన్య, ఎస్ఆర్ తదితర కాలేజీలున్నాయి. రెండేండ్ల కిందనే 79 కార్పొరేట్ కాలేజీలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నాయని గుర్తించినా, వాటిపై చర్యలు తీసుకోలేదు. దీనికి సర్కారు ఒత్తిడే కారణమని తెలుస్తున్నది. ప్రతి కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో రెండేసి సెక్షన్లకు అవకాశం ఉంటుంది. కానీ కార్పొరేట్ కాలేజీల్లో సైన్స్ గ్రూపుల్నే కొనసాగిస్తున్నారు. ఒక్కో కాలేజీలో ఏడు సెక్షన్ల వరకూ తీసుకుంటున్నారు. ఒక్కో కాలేజీలో కేవలం బైపీసీ/ఎంపీసీ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నాయి. పేరెంట్స్ చెల్లించే ఫీజులు, స్టూడెంట్ల నాలెడ్జీని బట్టి.. స్టూడెంట్లను విడదీసీ చదువు చెప్తున్నారు.
ఫండ్, లంచాలు ఇస్తున్నందుకేనా?
పేరు పొందిన కాలేజీలనే భావనతో చాలామంది పేరెంట్స్ వారి ఇంటికి దగ్గరనో లేదా వారి బంధువులు ఉన్న ప్రాంతంలోనో కాలేజీలో చేర్పిస్తున్నారు. కానీ వారి అడ్మిషన్ అక్కడ కాకుండా, ఆ కార్పొరేట్ కాలేజీల బ్రాంచుల్లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉంటే, అక్కడి నుంచి ఎగ్జామ్ ఫీజు కడుతున్నారు. చదువు ఇంకోచోట చెప్పిస్తున్నారు. సిటీలోని కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ, నారాయణగూడలోని కాలేజీల్లో ఈ తంతు నడుస్తోంది. అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలకు మున్సిపల్ పర్మిషన్ లేదు. అయినా అక్కడ పదుల సంఖ్యలో కాలేజీలున్నాయి. చిన్ని చిన్న కాలేజీలను పర్మిషన్ లేదని మూసివేయించే సర్కార్, ఇంటర్ బోర్డు పెద్దలు.. ఈ కాలేజీలను మాత్రం ముట్టుకోవడంలేదు. సర్కారు పెద్దలకు ఫండ్.. అధికారులకు లంచాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే వీటిల్లో సరైన వసతులు లేకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే అయ్యప్ప సొసైటీలోని కాలేజీలకు మాత్రం నోటీసులు ఇచ్చినట్టు రంగారెడ్డి డీఐఈఓ వెంక్య నాయక్ చెప్పారు.
సాత్విక్ అడ్మిషన్ కూడా వేరే దగ్గరే
ఇటీవల నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఫస్టియర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాత్విక్ అడ్మిషన్ ఆ కాలేజీలో లేదని విచారణలో తేలింది. వేరే కాలేజీ నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టినట్టు గుర్తించారు. ఆ కాలేజీలో చాలామంది అడ్మిషన్లూ ఇలాగే ఉన్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో శ్రీచైతన్య మేనేజ్మెంట్కు నాలుగైదు కాలేజీలుంటే, వాటిలో రెండింటికి మాత్రమే కోడ్ ఉన్నట్టు వెల్లడైంది.
ఎగ్జాంల తర్వాత చర్యలు తీస్కుంటాం
చదువుతున్న కాలేజీలో కాకుండా, ఇతర కాలేజీల నుంచి ఎగ్జామ్ ఫీజులు పంపించే సంస్థలపై విచారణ చేస్తాం. ప్రస్తుతం ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ఏం చేసినా పిల్లలు డిస్టర్బ్ అవుతారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటాం.
- నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు సెక్రటరీ