జీవో 299 వచ్చి ఆరేండ్లయినా లబ్ధిదారుల సొంతం కాని ఆస్తులు

జీవో 299 వచ్చి ఆరేండ్లయినా లబ్ధిదారుల సొంతం కాని ఆస్తులు
  •     నోటరీల దగ్గరే ఆగిపోయిన ప్రాసెస్​
  •     అసెస్​మెంట్, ఇంటి నంబర్లు ఉన్నా రిజిస్ట్రేషన్​చేయించుకోలేని పరిస్థితి
  •     తమ పేర్ల మీదికి మారనప్పుడు ఆస్తి పన్ను ఎందుకు కట్టాలంటున్న జనం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ స్ట్రక్చర్’ పేరుతో2016లో జీవో నం.299 ఇచ్చినప్పటికీ నేటికీ ఆ ఆస్తులు లబ్ధిదారుల సొంతం కాలేదు. అసెస్ మెంట్ నంబర్లు, ఇంటి నంబర్లు కేటాయించిన అధికారులు వారి పేర్ల మీదికి మార్చడం లేదు. దీంతో సూపర్ స్ట్రక్చర్ లిస్ట్​లో ఉన్నవారు జీహెచ్ఎంసీకి ‘ప్రాపర్టీ ట్యాక్స్’ చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. గ్రేటర్​వ్యాప్తంగా ఈ లిస్ట్​లో ఉన్న ఆస్తులు 10 వేలు ఉండగా, కేవలం వెయ్యి మంది మాత్రమే స్వచ్ఛందంగా ఆస్తి పన్ను కడుతున్నారు. మిగిలినవారు కూడా చెల్లించేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఆస్తులు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ ​చేసి, పేపర్లు ఇస్తేనే కడతామని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం హక్కు కల్పించిందే కానీ రెగ్యులరైజ్ ​చేయట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆ ప్రాసెస్​ పూర్తిచేస్తే ఏటా బల్దియాకు ఆస్తి పన్ను రూపంలో రూ.20కోట్లు వచ్చే అవకాశముంది. 

రిజిస్ట్రేషన్​కు వీలు లేదు 

సూపర్ స్ట్రక్చర్ జీవో ఇచ్చాక ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ పట్టించుకోకపోవడంతో రెగ్యులరైజేషన్ ప్రాసెస్​ముందుకు సాగలేదు. దీంతో జీహెచ్ఎంసీకే నష్టం జరుగుతుంది. అధికారులు బలవంతంగా ఆస్తి పన్ను వసూలు చేయలేకపోతున్నారు. ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు, కరెంట్ మీటర్లు అన్నీ  లబ్ధిదారుడి పేరు మీదనే ఉన్నా రిజిస్ట్రేషన్ ​చేసుకునే వీలులేకుండా పోయింది. నేటికీ సదరు ఆస్తులు నోటరీలపైనే కొనసాగుతున్నాయి. రెగ్యులరైజేషన్ చేస్తే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుంటుంది. ఆ తర్వాతే క్రయవిక్రయాలు జరుగుతాయి.

ఇచ్చి వదిలేస్తున్న ప్రభుత్వం

గ్రేటర్​పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలపై జీవోలు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదు. 2016 లో సూపర్ స్ట్రక్చర్ పేరుతో జీవో నం.299ను విడుదల చేసినప్పటికీ ఆ ప్రాసెస్​ఇంతవరకు పూర్తికాలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాగే జీవో ఇవ్వగా అది నేటికీ పెండింగ్​లోనే ఉంది. 2015లో 58, 59 జీవోల కింద రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చిన దరఖాస్తుల్లో సగం పెండింగ్​లోనే ఉన్నట్లు సమాచారం. 6 నియోజకవర్గాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల రెగ్యులరైజేషన్​కు సంబంధించి ఈ నెల 2న ప్రభుత్వం118 జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులకు నేటికీ గైడ్ లైన్స్ అందలేదు.