తెలంగాణలో వ్యాపారులు సిండికేట్ గా మారడంతో నష్టపోతున్న పత్తి రైతులు

తెలంగాణలో వ్యాపారులు సిండికేట్ గా మారడంతో నష్టపోతున్న పత్తి రైతులు

వ్యాపారుల సిండికేట్.. పడిపోతున్న పత్తి రేటు
క్వింటాల్​కు రూ.రెండు వేలకు పైగా తగ్గిన ధర 
సీజన్ ప్రారంభంలో క్వింటా రూ.10 వేలకు పైనే 
ఇప్పుడు రూ.7 వేల నుంచి రూ.8 వేలు మాత్రమే  
ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ ఉన్నా తగ్గుతోందంటూ తప్పుడు ప్రచారం 
ఈసారి పెట్టుబడి పెరగడంతో పాటు తగ్గిన దిగుబడి 
రేటు కూడా పడిపోవడంతో రైతుల ఆందోళన 

హనుమకొండ/ సిద్దిపేట, వెలుగు : వ్యాపారులు సిండికేట్ గా మారడంతో పత్తి రైతు నష్టపోతున్నడు. సీజన్​ప్రారంభంలో క్వింటాల్​కు రూ.10 వేల దాకా పెట్టి పత్తి కొన్న వ్యాపారులు.. ఇప్పుడు మార్కెట్ కు పత్తి ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో రేటు బాగా తగ్గించారు. అడ్తిదారులు, ఖరీదుదారులంతా ఎక్కడికక్కడ సిండికేట్​గా మారి ధరలు తగ్గిస్తుండడంతో పత్తి రేటు క్వింటాల్ కు రూ.8 వేల నుంచి రూ.7,500 వరకు పడిపోయింది. 

జిల్లాలు, మార్కెట్లతో సంబంధం లేకుండా రోజుకు రూ.100 నుంచి రూ.200 దాకా రేటు తగ్గుతోంది. ఈసారి  విత్తనాలు మొదలుకొని ఎరువుల దాకా అన్నింటి రేట్లు పెరిగి, ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.50 వేల దాకా పెట్టుబడికి అయింది. భారీ వర్షాలు, వరదలు, చీడ పీడల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. చేతికొచ్చిన కొద్దిపాటి పంటకైనా మంచి రేటు వస్తుందనుకుంటే వ్యాపారులు ధర తగ్గించి దోపిడీ చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేట్లు మళ్లీ పెరగకపోతాయా? అని కొందరు ఇండ్లలోనే పత్తి నిల్వ చేసుకుంటుంటే.. ఇంకొందరు అప్పుల బాధ భరించలేక అమ్ముకొని నష్టపోతున్నారు. 

పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి 

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని సర్కార్ అంచనా వేసింది. కానీ క్షేత్రస్థాయిలో దాదాపు 50 లక్షల ఎకరాల వరకే సాగైంది. ఈసారి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పత్తి చేన్లు జాలువారి దెబ్బతిన్నాయి. వేర్లు కుళ్లిపోవడంతో వివిధ తెగుళ్లు సోకి చెట్లు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. కాయ పట్టకపోవడం, పట్టిన కాయ పెరగకపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలతో దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరాకు కనీసం 14  నుంచి 15 క్వింటాళ్లు రావాల్సిన చోట 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి రాలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు ఖర్చులు కూడా పెరిగాయి. దుక్కులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.50 వేల దాకా పెట్టుబడి పెట్టారు. నిరుడు ఒక దశలో వ్యాపారులు క్వింటాల్​పత్తికి రూ.14 వేల దాకా పెట్టి కొన్నారు. ఈసారి కూడా అదే రేటు వస్తే కనీసం పెట్టుబడులు మీదపడకుండా ఉంటాయని రైతులు ఆశించారు. 

అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్.. 

అంతర్జాతీయ మార్కెట్​లో పత్తికి ఫుల్ డిమాండ్​ఉంది. 165 కిలోలు ఉండే బేల్​ధర రూ.63 వేలకు పైగానే పలుకుతోంది. అంటే కిలో పత్తి రూ.381 అన్నమాట. సాధారణంగా ఒక క్వింటా పత్తిలో దాదాపు 34 శాతం పత్తి, 64 శాతం సీడ్​, 2 శాతం వేస్టేజీ కింద పోతుంది. ఈ లెక్కన క్వింటా పత్తిలో 34 కిలోల దూది, 64 కిలోల వరకు పత్తి గింజలు ఉంటాయి. కిలో రూ.381 చొప్పున 34 కిలోల దూదికి దాదాపు రూ.13 వేలు, సీడ్స్ క్వింటాల్ రూ.3,700 ఉండగా.. 64 కిలోలకు రూ.2,300 వరకు వస్తుంది. ఈ లెక్కన క్వింటాల్ పత్తికి రూ.15,300 వరకు వ్యాపారులకు దక్కుతుంది. ఇందులో ట్రాన్స్​ పోర్ట్, కమీషన్లు, వివిధ చార్జీలు తీసేసి క్వింటా పత్తికి రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు రైతులకు ఇచ్చినా వ్యాపారులకు లాభమే తప్ప నష్టం ఉండదని నిపుణులు అంటున్నారు. కానీ వ్యాపారులు మాత్రం అంతర్జాతీయ మార్కెట్​ లో డిమాండ్​తగ్గుతోందని ప్రచారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.  

రోజురోజుకు రేటు తగ్గిస్తున్నరు.. 

ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ.6,380గా నిర్ణయించింది.అంతర్జాతీయ మార్కెట్​లో ఉన్న డిమాండ్ ప్రకారం వరంగల్ ఏనుమాముల, ఆదిలాబాద్​, ఖమ్మం, జమ్మికుంట, మహబూబ్​నగర్​ తదితర మార్కెట్ల​లో వ్యాపారులు సీజన్​మొదట్లో క్వింటాకు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించారు. రేటు మంచిగా ఉందని రైతులు పెద్ద మొత్తంలో పత్తి తీసుకువస్తుండంతో వ్యాపారులు దందాకు తెరలేపారు. పత్తి బేల్​ధర స్థిరంగా రూ.63 వేలకు పైగానే పలుకుతున్నా.. ఇక్కడి వ్యాపారులు మాత్రం రోజురోజుకు ధర తగ్గిస్తూ రైతులను దగా చేస్తున్నారు. సీజన్​ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం పత్తి ధర రూ.రెండు వేలకు పైగా పడిపోయింది. ఈ శుక్రవారం మహబూబ్​నగర్​ బాదెపల్లి మార్కెట్​లో క్వింటా పత్తికి వ్యాపారులు రూ.6,912 రేటు ఫిక్స్​చేయగా.. వరంగల్ ఏనుమాముల మార్కెట్​లో రూ.8,025, ఆదిలాబాద్​లో రూ.8,150, జమ్మికుంటలో రూ.8,250, ఖమ్మంలో రూ.8,300 ధర పలికింది. కానీ రైతులకు సగటున అందేది మాత్రం రూ.7 వేల లోపే. వ్యాపారులు క్వాలిటీ పేరు చెప్పి ఇష్టమొచ్చినట్టు కోత పెడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

అడ్తిదారులే ఖరీదుదారులు

మార్కెట్లలో అడ్తిదారులే ఖరీదుదారుల అవతారమెత్తి ఇష్టారీతిన రేటు డిసైడ్ చేస్తున్నారు. క్వాలిటీ లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు. వ్యాపారులు ఇష్టారీతిన రేటును తగ్గిస్తుండటంతో గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఇండ్లలో దాచుకునేందుకు కొందరు రైతులు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లలో రైతులకు అండగా నిలవాల్సిన పాలకవర్గాల గడువు ముగిసిపోవడం, ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా లీడర్లు, ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకుంటేనే పత్తి రైతులు మెరిసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన కాయిత మల్లేశం రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు సుమారు రూ.35 వేల చొప్పున రూ.70 వేల పెట్టుబడి పెట్టాడు. పోయినేడాది దాదాపు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ఈసారి భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి సగానికి  తగ్గింది. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్​కు రూ.10 వేల దాకా రేటు పెట్టి వ్యాపారులు కొన్నారు. దీంతో మల్లేశం ఎకరంలో పత్తి ఏరించి, మార్కెట్​కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. అయితే వ్యాపారులు రేటు అమాంతం తగ్గించి రూ.8 వేల వరకు మాత్రమే చెల్లిస్తుండడంతో మిగిలిన ఎకరంలో పత్తి ఏరడం ఆపేశాడు. ఈ ధరకు పత్తిని అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రావని, ఇంట్లో నిల్వ ఉంచితే తెచ్చిన అప్పులకు మిత్తి పెరిగిపోతుందని ఆవేదన చెందుతున్నాడు.