ఖమ్మం పోడు భూముల కేసులో వెనక్కి తగ్గిన సర్కార్

ఖమ్మం పోడు భూముల కేసులో వెనక్కి తగ్గిన సర్కార్

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం యల్లన్న నగర్ పోడు భూముల వ్యవహారంలో.. బాలింతలపై హత్యాయత్నం కేసులు పెట్టిన విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది సర్కార్. 19 మంది మహిళలు ముగ్గురు పురుషులపై కేసులు పెట్టారు. అందులో నలుగురు బాలింతలు ఉన్నారు. బాలింతల అరెస్ట్, హత్యాయత్నం కేసులపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కూలీలపై నమోదు చేసిన 307 హత్యయత్నం కేసులపై వెనక్కి తగ్గింది. ఐపీసీ 353 సెక్షన్ మాత్రమేనని చెప్పి .. బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు న్యాయవాదులు. అయితే పోలీసులు దాఖలు చేసిన మెమోను న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది. దాంతో 23 మందికి బెయిల్ మంజూరు అవ్వనుంది.

ఇదే ఖమ్మంలో జిల్లాలో గతంలో రైతులకు బేడీలు వేసింది ప్రభుత్వం. అప్పట్లో తీవ్ర దుమారం లేసింది. ఇప్పుడు కూడా పోడు భూముల వ్యవహారంలో మహిళలు.. పైగా అందులో బాలింతలు అని చూడకుండా హత్యాయత్నం కేసులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశం అయింది. పోడు రైతులపై దాడి చేసిన అధికారులపై మాత్రం ఎలాంటి కేసులు పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఓ వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు రైతుల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టమని ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం నోరెత్తడం లేదు. ఎక్కడైనా పోడు రైతులను అధికారులు అడ్డుకున్నారని తెలిస్తే చాలు.. వెంటనే ఎమ్మెల్యేలు అక్కడ వాలిపోతున్నారు. కానీ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పడానికి మాత్రం భయపడుతున్నారు.