ఎల్ఆర్ఎస్ పేరుతో రూ. 38 వేల కోట్లు గుంజుడే

V6 Velugu Posted on Jul 22, 2021

ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి
భూముల మార్కెట్ విలువతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను 7.5 శాతానికి పెంచడం అన్యాయం. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇండ్ల జాగలు కొనుక్కోలేని పరిస్థితి తలెత్తుతుంది. రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గించాలి. రిజిస్ట్రేషన్ చార్జీల భారం నుంచి ప్రజల దృష్టిని పక్కకు మరల్చేందుకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి. - నారగోని ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ఎల్ఆర్ఎస్​ మరింత భారం
నిరుడు రూ. వెయ్యి చెల్లించి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకున్న వారి  నుంచి ఎవరైనా ప్లాటు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే వారికి ఖర్చు తడిసి మోపెడు కానుంది. కొత్త మార్కెట్ వ్యాల్యూ ప్రకారమే వారి నుంచి రెగ్యులరైజేషన్ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు బోడుప్పల్​లో ఓ వ్యక్తి ఎల్ఆర్ఎస్ లేని 200 చ.గజాల (167 చ.మీ.) ప్లాటుకు అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అక్కడ పాత మార్కెట్ వ్యాల్యూ చదరపు గజం రూ.7 వేలు ఉంటే.. కొత్త మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.10,500కు పెరిగింది. అతను మున్సిపాలిటీలో ఇంటి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా, లేదా రెగ్యులరైజేషన్ చేసుకున్నా గతం కంటే 10 శాతం చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

హైదరాబాద్, వెలుగు:ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు చార్జీలు, పన్నుల రూపంలో జనం నుంచి పైసలు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే భూముల విలువ, రిజిస్ట్రేషన్​ చార్జీలు పెంచిన సర్కారు వాటితోపాటు ఎల్ఆర్ఎస్ చార్జీలు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) పేరుతో సుమారు రూ.38 వేల కోట్లు వసూలు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఖాళీ జాగలు, అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్ ద్వారా రూ.22 వేల కోట్ల ఆదాయం వస్తుందని సర్కార్ కిందటేడాది అంచనా వేసినప్పటికీ.. పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలతో ఈ రాబడి రూ.25 వేల కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. 
(మొదటి పేజీ తరువాయి)
అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీ స్థలాలు గుర్తించి వీఎల్టీ ద్వారా రూ.3 వేల కోట్ల వసూలుకు ప్లాన్ చేసింది. దీంతోపాటు బుధవారం నుంచి అమల్లోకి రాబోయే కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల మార్కెట్ విలువలతో ప్రభుత్వానికి ఈ ఏడాది అదనంగా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం
ప్రభుత్వం నిరుడు ఆగస్టు 31న ఎల్ఆర్ఎస్ స్కీమ్– 2020ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది అక్టోబర్ 31న అప్లికేషన్ల గడువు ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా 25,59,562 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,06,891.. గ్రేటర్ వరంగల్ పరిధిలో 1,01,033.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51,395 దరఖాస్తులు అందాయి. పంచాయతీల నుంచి 10,83,394, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.255.95 కోట్ల ఆదాయం వచ్చింది. పంచాయతీ, మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ల నుంచి మరో 4 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం మొత్తంగా 10 లక్షల వరకు వస్తాయని భావించినా అంచనాకు మించి వచ్చాయి. దీంతో సర్కార్ రూ.10 వేల కోట్లుగా పెట్టుకున్న టార్గెట్ తర్వాత డబుల్ అయ్యింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు విచారణను నిలిపివేసి సుప్రీంకోర్టులో తేల్చుకోవాలంది. దీంతో ఇన్నాళ్లు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పక్కనబెట్టిన ప్రభుత్వం.. మళ్లీ వీటిపై దృష్టి పెట్టింది. సుప్రీం తీర్పు వచ్చేలోపు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఏరియాల వారీగా అప్లికేషన్లను చార్ట్ అవుట్ చేయడం, సైట్ ఇన్ స్పెక్షన్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
వీఎల్టీ పేరిట ఖాళీ ప్లాట్లకు వసూళ్లు 
ఖాళీ ప్లాట్లకు వాటి మార్కెట్​విలువలో 0.5% ఏటా ట్యాక్స్ గా స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెల్లించాలని.. ఇట్లా కట్టిన రశీదు ఉంటేనే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్ (జీ/2280/2017) జారీ చేసింది. దీని ప్రకారం రూ.5 లక్షల మార్కెట్ విలువ ఉన్న ప్లాటుకు రూ.లక్షకు రూ.500 చొప్పున ఏటా రూ.2,500 ట్యాక్స్ చెల్లించాలి. మున్సిపాలిటీ వసూలు చేసే ఇంటి పన్ను కంటే ఇది ఎక్కువే. 2017 ఏప్రిల్ 17 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఈ ఉత్తర్వులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర మున్సిపల్ చట్టం–2019లోనూ సర్కార్ పలు సెక్షన్లను చేర్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఆర్నెళ్లలోపు నిర్మాణ పర్మిషన్లు ఇవ్వదగిన ఖాళీ జాగాలన్నింటిని గుర్తించి ట్యాక్స్ విధించాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎల్ ఆర్ఎస్ కోసం వేచి చూస్తున్న 14.75 లక్షలకు పైగా ప్లాట్ల ఓనర్లు వీఎల్టీ నుంచి తప్పించుకోలేరు. రిజిస్ట్రేషన్ టైమ్​లోనో, ఇంటి పర్మిషన్ టైమ్​లోనో ట్యాక్స్ బకాయిలు చెల్లించాలి. ఇలా సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం రాబట్టవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఆదాయం డబుల్
రాష్ట్రంలోని భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు, అపార్ట్​మెంట్లలో ఫ్లాట్ల మార్కెట్ వాల్యూను, రిజిస్ట్రేషన్ల చార్జీలను భారీగా పెంచడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం డబుల్ కానుంది. పెరిగిన కొత్త విలువలు, చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ లాంటి అడ్డంకులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే సాధారణ రోజుల్లో నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేది. రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ వాల్యూ పెరగడంతో నెలవారీ ఆదాయం రూ. వెయ్యి కోట్లు దాటే చాన్స్ కనిపిస్తోంది. ఈ లెక్కన రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి గతంతో పోలిస్తే ఏటా రూ.7 వేల కోట్లు అదనంగా రావొచ్చని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూనూ పెంచినందున ధరణి పోర్టల్ ద్వారా అదనంగా మరో రూ.3 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.  జాగాలు, ఇండ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.10 వేల కోట్లు అదనంగా ఖజానాకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tagged revenue, Telangana government, LRS,

Latest Videos

Subscribe Now

More News