ఊర్లల్లో కల్లు లేక వెలవెలబోతున్న మండువలు

ఊర్లల్లో కల్లు లేక వెలవెలబోతున్న మండువలు
  • డిసెంబర్​లో రావాల్సింది.. ఇప్పటికీ వస్తలేదు
  • పోద్దాళ్ల గెలలపై వాతావరణం ఎఫెక్ట్
  • ఈ ఏడాది కల్లు సీజన్ నెలన్నర ఆలస్యం
  • నష్టపోతున్నామని గీత కార్మికుల ఆవేదన

వరంగల్, వెలుగు: డిసెంబర్​లోనే కల్లు పారాల్సిన పోద్దాళ్లు సంక్రాంతి వచ్చినా పారుతలెవ్వు. నెలన్నర దాటిపోతున్నా తాటి చెట్లకు గెలలు వస్తలేవు. అక్కడక్కడ కొన్ని చెట్లకు గెలలు వస్తున్నా ఒకట్రెండుకు మించుతలేవు. పోద్దాడు కల్లు తాగుదామని తాటి వనాలు, మండువల దగ్గరికి వచ్చే జనం కల్లు లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈసారి సీజన్ ​పోయినట్లేనని, తమకు ఆర్థిక కష్టాలు తప్పేట్టు లేవని గీతకార్మికులు ఆవేదన చెందుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్లే తాళ్లు గెలలు లేటుగా వేస్తున్నాయని, కల్లు సరిగా పారట్లేదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. గతేడాది మామిడి పూత ఆలస్యంగా రావడం, ఈసారి తాడిచెట్లు గెలలు వేయకపోవడం ఇందులో భాగమేనని చెప్తున్నారు.

మూడు సీజన్లలో.. నాలుగు రకాల కల్లు

రాష్ట్రంలో 3 సీజన్లలో నాలుగు రకాల తాటికల్లు పారుతుంది. ఇందులో ఒకటి మగ చెట్లది కాగా, మూడు రకాలు ఆడ చెట్లవిగా చెబుతారు. పోద్దాడు కల్లు (పోతు తాడు) మగ తాటి చెట్టు నుంచి వస్తుంది. మిగతా పరుపు, పండు, నాప(ల్యాప) కల్లు రకాలు ఆడ తాటి చెట్లకు పారుతాయి. 

మొన్న మామిడి.. ఇప్పుడు తాటిపై

భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణంతో గత సీజన్లో మామిడి దిగుబడి తగ్గింది. మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. వచ్చిన పూత నిలబడలేదు. అలాంటి వాతావరణమే ఇప్పుడు పోద్దాడుపై పడింది. ఇప్పటికే మొగి పురుగు కారణంగా ఊర్లలో చాలా తాటిచెట్లు ఎండిపోగా.. సిటీ, టౌన్ల చుట్టూ ఉన్న తాటి వనాలు రియల్​ ఎస్టేట్​ వ్యాపారాలకు బలి అయ్యాయి. ప్రస్తుతం రుతుపవనాల్లో తేడా కారణంగా వాతా వరణంలో అకాల మార్పులు చోటుచేసుకున్నాయి. మామూలుగా అయితే పగలంతా ఎండ.. రాత్రిళ్లు చలి, పైర గాలి ఉన్నట్లయితే.. పోద్దాడు కల్లు ఎక్కువగా వస్తుంది. కానీ, వాతావరణంలో మార్పుల కారణంగా రాత్రిళ్లు ఉక్కపోత, పగటిపూట మబ్బులు పడుతున్నాయి. మధ్యాహ్నం సైతం చలి పెడుతోంది. ఈ సీజన్లో నెల పూర్తయినా పోద్దాడు కల్లు పారేందుకు అనువైన వాతావరణం కన్పించడంలేదు.

చలికాలం మొదట్లో పారే దానిని నాప కల్లు, డిసెంబర్ నుంచి మార్చి వరకు పోద్దాడు, ఎండా కాలం ప్రారంభంలో పరుపుతాడు కల్లు, వాన కాలంలో పండుతాడు కల్లు వస్తుంది. కాగా, మూడు నెలలకు పైగా పారే పోద్దాడు కల్లుకు రాష్ట్రమంతా మంచి డిమాండ్ ఉంటుంది.

పోద్దాడు సీజన్.. నెలన్నర లేట్ 

పోద్దాడు కల్లు సీజన్ మామూలుగా డిసెంబర్ మొదటి, రెండు వారాల్లో మొదలైతుంది. తాటి గెలలకు మెర(కోత) పెట్టి కుండ కట్టడం ద్వారా కల్లు పారుతుంది. కానీ ఈ ఏడాది జనవరి రెండో వారం వచ్చినా చెట్లకు తాటి గెలలు సరిగా రాలేదు. గీతకార్మికులకు పాళ్లు పంచుకోవడం ద్వారా తలా ఓ పది చెట్లు వస్తే ఇప్పటివరకు రెండో, మూడో చెట్లకు కల్లు గీసేందుకు అవసరమైన గెలలు వచ్చాయి. ఒక్కో పోద్దాడు చెట్టు తక్కువగా ఐదారు, ఎక్కువగా 8 నుంచి 9 గెలలు వేస్తుంది. కొన్ని ఏరియాల్లో చెట్లకు ఒకట్రెండు గెలలు వస్తుండడంతో గౌడన్నలు తలలు పట్టుకున్నారు. మరో ఇరవై రోజులు గడిస్తే తప్ప ఐదారు గెలులు వచ్చే అవకాశం కనపడట్లేదని వాపోతున్నారు. ఈ లెక్కన ఈసారి పోద్దాడు సీజన్ నెలన్నర లేట్ అయినట్లు భావిస్తున్నారు.

సంక్రాంతికి పోద్దాడు కల్లు లేనట్లే..

తెలంగాణ జిల్లాల్లో పోద్దాడు కల్లు అంటే ఇష్టపడని యూత్ ఉండరు. ఈ కల్లును ఫ్యామిలీ డ్రింక్​గా చెప్పుకుంటారు. మగవారితో పాటు పిల్లలు, మహిళలు ఇష్టంగా తాగుతారు. ఉద్యోగాలరీత్యా హైదరాబాద్, బెంగళూర్, ముంబై వంటి ప్రాంతాల్లో నివాసం ఉండే వారంతా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వస్తారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు పోద్దాడు కల్లు తాగేందుకు ఇష్టపడతారు. దోస్తులతో కలిసి తాటి వనాలకు పోయి పోద్దాడు కల్లు తాగుతుంటారు. కానీ ఈసారి పోద్దాడు కల్లు పారకపోవడంతో వారికి నిరాశ తప్పదని గీత కార్మికులు అంటున్నారు.

గీత కార్మికుల ఉపాధికి దెబ్బ

సీజన్ మొదలైనా పోద్దాడు కల్లు ఇంకా పారకపోవడంతో ఒక్కో గీతకార్మికుడు నెలకు సగటున రూ.20 వేల నుంచి రూ.25 వేలు నష్టపోయారు. తన పాలుకు ఎక్కువ చెట్లు ఉండి పొద్దున, సాయంత్రం కల్లు గీసేటోళ్లు రూ.30 వేలకు పైగా లాస్ అయినట్లే అవుతోంది. ఏటా మామూలు సమయాల్లో పొలం పనులు, కూలీలకు వెళ్లే గీత కార్మికులు పోద్దాడు సీజన్​పై నమ్మకంతో నాలుగు నెలలపాటు వృత్తినే నమ్ముకుని తాటివనాల్లో ఉంటారు. అయితే ఇప్పటికే నెల సీజన్ ఉత్తగ పోయింది. ఇంకో రెండు వారాలు పరిస్థితి ఇట్లనే ఉండనుంది. ఒకవేళ సీజన్ ఏప్రిల్ నెల వరకు కొనసాగినా ఎండల ఎఫెక్ట్ తో జనాలు చల్లని బీర్లు తాగడానికే ఇష్టపడే అవకాశాలు ఉండటంతో కార్మికులు ఈ ఏడాది ఉపాధి కోల్పోయినట్లే అవుతుంది. సీజన్ ఆలస్యంవల్ల రాష్ట్రంలోని ప్రతి గీతకార్మికుడికి నష్టం జరుగుతోంది.

ఉత్తరపు గాలితో పోద్దాడు సీజన్ నెలన్నర పోయినట్లే 

ఏంతక్కువ 18 ఏండ్లుగా కల్లుగీత వృత్తినే నమ్ముకున్నా. ఏటా పోద్దాళ్ల సీజన్లో డిసెంబర్ మొదట్లో సగం, రెండో వారం వచ్చే సరికి ఇంకో సగం గొలలు వచ్చేవి. ఈసారి ఉత్తరపు గాలులు చేయవట్టి నెల అయితున్నా ఒకట్రెండు తాళ్లు తప్పితే మిగతావి రాలేదు. గెలలు వేయాలంటే మరో 20 రోజులు పడ్తది. అంతో ఇంతో కల్లు ఇచ్చే నాప తాళ్లు కూడా మొన్నటి గాలులకు పోయినయ్. గాలి తీరు గౌడ్ అన్నట్లు సీజన్ను నమ్ముకుని బతికే మమ్మల్ని ఈసారి వాతావరణం ఆగం చేసింది. 

- జూలూరి శివాజీ (రెడ్డిపురం, హనుమకొండ)

ఆర్థిక ఇబ్బందులు తప్పేటట్టులేవ్

వాతావరణ పరిస్థితుల వల్ల ఈ సారి పోద్దాళ్ల గొల్లు చాలా లేటుగా ఎల్లినాయి. వచ్చిన చెట్లకు రెండు మూడు కంటే ఎక్కువ రాలేదు. దీనికి తోడు పైరలు సరిగ్గ రాకపోవుడు, గాలులు ఎక్కువవడంతో కల్లు తక్కువ పారుతున్నది. ఈసారి కల్లు  తక్కవ అవడంతో ఇల్లు గడిచేందుకు, ఇతర అవసరాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పేటట్టు లేవ్.​

- జెల్ల ప్రభాకర్ గౌడ్, బేగంపేట, భువనగిరి జిల్లా

గెలల కోసం ఎదురుచూస్తున్నా

ఈ ఏడాది పోద్దాళ్లు శాన లేటైనయ్. రెగ్యులర్​గా వచ్చుడు గెలలు పడ్డాయో లేదో చూసిపోవుడే అయితాంది. 10 చెట్లుంటే రెండింటికే గెలలు పడ్డయ్, అవి కూడా ఒకట్రెండు మాత్రమే వచ్చినయ్. లొట్లు వేసేందుకు ఎదురుచూస్తున్నా. నాలుగు తాళ్లు ఎక్కుకువుంటే బతుకొచ్చని ఆశ పడితే.. వాతావరణం దెబ్బకొట్టంది.

- పాలకుర్తి సాంబయ్య 
(వంగపహాడ్, హనుమకొండ)