రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలనే బీఆర్ఎస్ ఏర్పాటు : మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలనే బీఆర్ఎస్ ఏర్పాటు : మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నాచారంలో రూ.42 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్స్ ఎక్స్ ట్రుడర్ ప్లాంట్ ను మంత్రి సత్యవతి రాథోడ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు.  

ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. భారతదేశంలోనే  తెలంగాణ ఫుడ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ఈ సంస్థ ద్వారా పౌష్టికాహారం అందుతోందన్నారు. ఇక్కడి పౌష్టిక ఆహారాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా అందించాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థలను మరింత అభివృద్ధి చేసే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ పోషకాహార సంస్థ, యూనిసెఫ్ సూచనల మేరకు మంచి బలమైన పౌష్టికాహారాన్ని తెలంగాణ ఫుడ్స్ ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.