విద్యార్థినుల ఆత్మహత్య.. భయంతో హాస్టల్ ఖాళీ చేసిన స్టూడెంట్స్

విద్యార్థినుల ఆత్మహత్య.. భయంతో హాస్టల్ ఖాళీ చేసిన స్టూడెంట్స్

భువనగిరి SC హాస్టల్ లో విద్యార్థినుల ఆత్మహత్యతో... మిగతా స్టూడెంట్స్ హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందడంతో భయంతో ఇంటికి వెళ్లిపోయారు విద్యార్థినిలు. మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారుబాధిత కుటుంబ సభ్యులు. 

ఏం జరిగిందంటే..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య  చేసుకున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుని చనిపోతే సంఘటన స్థలంలో కాకుండా ఆసుపత్రిలో వెళ్లిన తర్వాత పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు తప్పు చేస్తే ఎందుకు సమాచారం ఇవ్వలేదని టీచర్లను నిలదీశారు.  తమ పిల్లల చనిపోవడానికి హాస్టల్ వార్డెన్ శైలజ,ఆటో డ్రైవర్ ఆంజనేయులు పైన వారు  అనుమానం వ్యక్తం చేశారు.  

భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సాయికృప కళాశాల భవనంలో ఎస్సీ హాస్టల్ వసతి గృహం నడుస్తోంది. టెన్త్ క్లాస్ చదువుతున్న వైష్ణవి, భవ్య నిన్న రాత్రి ఒకే గదిలో ఉరివేసుకొని చనిపోయారు. 7వ తరగతి విద్యార్థునులతో వచ్చిన గొడవ అందరికి తెలిసిపోయిందన్న మనస్తాపంతో చనిపోయినట్లు తెలుస్తోంది. 

అంతకు ముందే గొడవ సద్దమనుగేలా వారికి ధైర్యం చెప్పినట్లు వార్డెన్ శైలజ తెలిపారు. తర్వాత ఇద్దరు చున్నీతో ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.  కానీ కుటుంబ సభ్యులు మాత్రం వారిని నమ్మే పరిస్థితి లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్  చేస్తున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యపై దిగ్భ్రాంతి చెందారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఘటనపై పూర్తి విచారణ చేపట్టి రిపోర్ట్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను, అధికారులను ఆదేశించారు.