న్యూఢిల్లీ: తమ ఖాతాలకు ఆడిటింగ్ అవసరం లేనప్పటికీ, చెల్లించాల్సిన పన్ను (సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్) మొత్తం రూ.లక్ష ఉంటే, జూలై 31లోపు కట్టాలని ఐటీశాఖ స్పష్టం చేసింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సెప్టెంబరు దాకా గడువు ఇచ్చినా, ఇండివిజువల్స్ పన్ను బాధ్యత రూ.లక్ష దాటిన వారికి మాత్రం అదనపు సమయం ఇవ్వలేదని తెలిపింది. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ మొత్తాన్ని తీసేసిన తరువాత కూడా రూ.లక్ష, అంతకంటే ఎక్కువ మొత్తం కట్టాల్సి ఉంటే, జూలైలోపే చెల్లించాలి. లేకపోతే వడ్డీ భరించాల్సి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరం కోసం ఐటీఆర్ ఫైలింగ్‌కు, ఫామ్ 16 ఇవ్వడానికి కూడా గడువు పెంచినట్టు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు టీడీఎస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి గడువు పెంచినా, నాన్–శాలరీ కేసుల్లో టీడీఎస్ జారీకి మాత్రం గడువు పెంచలేదు. బ్యాంకులు వీరికి వచ్చే నెల 15లోపు 16ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. వడ్డీ పొందినందుకు వసూలు చేసే టీడీఎస్మొత్తాన్ని వాపసు పొందడానికి 16ఏ అవసరం. ఈ విషయమై డెలాయిట్ ఇండియాకు చెందిన సరస్వతీ కస్తూరిరంగన్ మాట్లాడుతూ ‘ఐటీఆర్ ఫైలింగ్‌కు అదనంగా టైమివ్వడం మంచిదే! అయితే ఆలస్యంగా రిటర్నులు వేసినందుకు వడ్డీ కట్టాల్సిందే. దీనివల్ల ఇండివిజువల్స్ పన్ను బాధ్యత రూ.లక్ష దాటిన వాళ్లు నష్టపోతారు”అని అన్నారు. అయితే సీనియర్ సిటిజన్స్ జూలై 31లోపు పన్ను కడితే, దానిని అడ్వాన్స్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. బిజినెస్/వృత్తిపరమైన ఆదాయం లేనివారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది.
