సారు రాలే.. రివ్యూ చేయలే

సారు రాలే..  రివ్యూ చేయలే
  •    కామారెడ్డి, ఎల్లారెడ్డికి సాగునీరిస్తామని హామీ
  •     కంప్లీట్​కాని కాళేశ్వరం ప్రాజెక్ట్​22వ ప్యాకేజీ పనులు
  •     సీఎం మాటిచ్చి రెండేళ్లు పూర్తి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్ట్​22 వ ప్యాకేజీ పనులపై రివ్యూ చేసి పనులు త్వరగా కంప్లీట్​అయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పి రెండేళ్లు గడిచాయి. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నిజాంసాగర్​లోని గుల్​దస్తా గెస్ట్​ హౌస్​కు వచ్చి గానీ, హైదరాబాద్​లో గానీ రివ్యూ చేయలేదు. ఏళ్లు గడుస్తున్నా 22 వ ప్యాకేజీ పనులు కంప్లీట్​ కాలేదు. సదాశివనగర్​ మండలం భూంపల్లి వద్ద కొంతమేర మెయిన్​ రిజర్వాయర్​పనులు, కాల్వల పనులు జరిగాయి. మెయిన్​ కెనాల్స్, డిస్ర్టిబ్యూటర్ ​కెనాల్స్, గుజ్జల్,  కాటేవాడి, తిమ్మక్​పల్లిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులుకు భూ సేకరణ కంప్లీట్​కాలేదు. ఇంకా 1500 ఎకరాల  భూమి సేకరించాల్సి ఉంది. ప్రధానంగా ఫండ్స్​ కొరత ఉంది. 

సాగు నీళ్లకు గోస..

కామారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం రైతులు గోసపడుతున్నారు. సాగునీటి వనరులు లేక బోర్లు, వర్షాధారంగా  పంటలు పండిస్తున్నారు. జిల్లాలో  5 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో 4 లక్షల ఎకరాల్లో బోర్లు, వర్షాల ఆధారంగా పంటలు వేస్తారు. లక్షా 5 వేల వ్యవసాయ కరెంట్​కనెక్షన్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్​22వ ప్యాకేజీ పనులు కంప్లీట్​అయితే తమకు సాగునీరు అందుతుందని ఆశిస్తున్న  రైతులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. బోర్ల తవ్వకం, మోటార్లు, రిపేర్లకు ఏటా రూ.వేలల్లో ఖర్చవుతోంది. గత 2 ఎన్నికలతో పాటు, రెండేళ్ల కింద జిల్లాకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినందున పనులు త్వరగా అవుతాయని అంతా ఆశించారు. ఈ ఏడాది మార్చిలో బాన్సువాడ నియోజక వర్గానికి కేసీఆర్​ వచ్చినా, ఈ పనులపై రివ్యూ చేయలేదు. నిజామాబాద్ ​జిల్లా మంచిప్ప దగ్గర పనులు కంప్లీట్​అయితే ఇక్కడికి నీళ్లు వస్తాయి.

‘అన్నింటికి మించి సాగునీళ్లు రావాలి. ఇది బతుకుదెరువు ముచ్చట. మనం కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తున్నాం. మీకు దగ్గరిదాక వచ్చినయ్​.100 శాతం కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లిచ్చి తీరుతాం. 10, 15 రోజుల్లో ఇరిగేషన్​ ఇంజినీర్లను తీసుకొని మళ్లీ నేనే వస్తా. నిజాంసాగర్ ​ప్రాజెక్ట్ ​దగ్గర ఉన్న గుల్​దస్తా గెస్ట్​హౌజ్​లో కూర్చొని పనులపై రివ్యూ చేస్తా. రెండు నియోజకవర్గాలు వ్యవసాయ ఏరియాలు. 25 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు ప్లాన్​ చేశాం. గుజ్జల్, కాటేవాడి, తిమ్మక్​పల్లిల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్లాన్ చేశాం. నిజామాబాద్​జిల్లాలోని కొండెంచెరువు దగ్గరి నుంచి నీళ్లు వస్తాయి. ఇంకా కొంత పనులు జరగాలి. ఈ ఏరియాలో ఫేమస్​ దేవుళ్ల పేర్లు పెట్టున్రి. పనులు జెల్ది అయితయ్. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే బాధ్యత నాది.’ 2021, జూన్​ 20న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి.