కేంద్రానికి ఆదర్శం ఇక్కడి స్కీములే

కేంద్రానికి ఆదర్శం ఇక్కడి స్కీములే
  • పీఎం కిసాన్​ సమ్మాన్​, హర్​ ఘర్​ జల్​కు రైతు బంధు, మిషన్​ భగీరథ స్ఫూర్తి
  • దళితులకు కేంద్ర బడ్జెట్​లో నిధులు పెంచాలె
  • దళితబంధుపై సంగారెడ్డిలో మంత్రి రివ్యూ
  • రాష్ట్ర ఆర్థిక మంత్రి  హరీశ్​ రావు

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో చేపడుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. రైతు బంధును పీఎం కిసాన్​ సమ్మాన్​గా, మిషన్​ భగీరథను హర్​ ఘర్​ జల్​ పథకంగా అమలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధు అమలు చేస్తున్నా బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఆఫీసర్లతో దళితబంధుపై హరీశ్  సమీక్ష చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలోని 26 కోట్ల మంది దళితులకు బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది రూ.1.26 లక్షల కోట్లేనని, అవి సరిపోవని, బడ్జెట్​లో మరిన్ని నిధులను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను ఆయన డిమాండ్​ చేశారు. నాడు దళితుల కోసం పదేళ్లలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.6,198 కోట్లే ఖర్చు పెట్టిందని, తెలంగాణ వచ్చాక ఏడేండ్లలోనే టీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.24,114 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.  
 

కాంగ్రెస్​, బీజేపీకి ఉలిక్కిపాటు
ప్రభుత్వ స్కూళ్లల్లో ‘మన ఊరు–మన బడి’ పేరుతో ఇంగ్లిష్​ మీడియం ప్రవేశపెడతానని సీఎం కేసీఆర్​ చెప్పేసరికి కాంగ్రెస్​, బీజేపీలు ఉలిక్కిపడుతున్నాయని మంత్రి హరీశ్​ అన్నారు. సర్కారుకు ఎక్కడ మంచిపేరొస్తదోనని రేవంత్​, సంజయ్​లు ఆగమైతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 1,03,657 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారని, కానీ, బీజేపీ, కాంగ్రెస్​ నేతలు అసలు టీచర్లే లేరని చెప్తూ గుడ్డిగా ఇంగ్లిష్​ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 296 రెసిడెన్షియల్​ స్కూల్స్​ మాత్రమే ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 914కి పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ విద్యాలయం ఉండాలని, ఆ లెక్కన రాష్ట్రంలో ఇంకా 21 నవోదయలు రావాలని హరీశ్​ అన్నారు. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు దమ్ముంటే కేంద్రంతో పోరాడి మిగతా నవోదయ విద్యాలయాలను మంజూరు చేయించాలని సవాల్​ చేశారు. వాటితో పాటు ట్రైబల్​ యూనివర్సిటీ, మైనింగ్​ యూనివర్సిటీ, ఐటీఐఆర్​ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతు బంధు స్పూర్తితో ‘మన ఊరు–మన బడి’ని సీఎం కేసీఆర్​ అమలు చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.  

ప్రైవేటుకు దీటుగా సర్కారు కాలేజీలు: హరీశ్‌‌‌‌
 స్టూడెంట్లకు ఆన్‌‌‌‌లైన్​ పాఠాలు చెప్పాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీలకు దీటుగా సర్కారు కాలేజీల్లో మెరుగైన సౌలతులు కల్పించి, విద్యాబోధన చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్‌‌‌‌​రావు అన్నారు. కరోనా కారణంగా స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా, ఆన్‌‌‌‌లైన్ క్లాసులు నిర్వహించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌‌‌‌లోని హరీశ్‌‌‌‌ రావు ఇంటిలో గవర్నమెంట్ కాలేజీల ప్రిన్సిపల్స్ సంఘం, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ 2022 సంవత్సర డైరీలను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్​ మధుసూదన్​రెడ్డి, ప్రిన్సిపల్స్ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో సర్కారు కాలేజీలకు పూర్వవైభవం తీసుకొచ్చిన లెక్చరర్లు, ప్రిన్సిపల్స్‌‌‌‌ను ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌ అభినందించారు. వచ్చే విద్యాసంవత్సరంలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు కాలేజీలను డెవలప్‌‌‌‌ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో స్టూడెంట్లకు మెరుగైన విద్యాబోధన చేస్తున్నామని మధుసూదన్​రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ విజయ శేఖర్, ఫైనాన్స్ సెక్రటరీ లక్ష్మి, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామానుజాచారి తదితరులు పాల్గొన్నారు.