ఈపీఎఫ్ పెన్షన్ను పెంచండి ..కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు

ఈపీఎఫ్ పెన్షన్ను పెంచండి ..కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
  • పెన్షనర్ల అవసరాలకు రూ. వెయ్యి  సరిపోదని వెల్లడి

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) కింద పెన్షనర్లకు అందుతున్న నెలవారీ ఫించన్  ను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయి కమిటీ మంగళవారం సిఫార్సు చేసింది. ప్రస్తుతం అందుతున్న రూ.1,000 పెన్షనర్లకు ఏమాత్రం సరిపోదని.. దీన్ని తక్షణమే గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని తెలిపింది.పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ను సమీక్షించాలని కమిటీ సూచించింది.

పెన్షనర్లకు సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు స్కీమ్ బడ్జెట్ ను పెంచే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరింది. అలాగే, గిగ్ వర్కర్లను 'ఈ-శ్రమ్' పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదును తప్పనిసరి చేయాలని, వారికి బీమా, ప్రమాద రక్షణ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందేలా చూడాలని తెలిపింది.

రిజిస్టర్డ్, అన్-రిజిస్టర్డ్ గనుల సమగ్ర డేటాబేస్ సిద్ధం చేయాలని, అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కఠిన చర్యలు తీసుకుంటూ కార్మికుల భద్రతను కాపాడాలని చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాదాల సమయంలో పరిహారం అందడంలో ఆలస్యం జరుగుతోందని కమిటీ గమనించింది. వీరికి సకాలంలో ఈఎస్ఐ (ఈఎస్ఐ), పీఎఫ్ (పీఎఫ్) సౌకర్యాలు కల్పించాలని సూచించింది.

సామాజిక భద్రతా పరిధిని మరింత మంది కార్మికులకు విస్తరించేలా ఈఎస్ఐసీ  వేతన పరిమితిని త్వరగా సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది. కార్మిక కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అమలు కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ అంచనాల్లోనే నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని కూడా కమిటీ కోరింది. కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.