కామారెడ్డి జిల్లాలో పెరిగిన వరి సాగు..

కామారెడ్డి జిల్లాలో పెరిగిన వరి సాగు..

జిల్లాలో 2.98 లక్షల ఎకరాల్లో.. నిరుటి కంటే 20వేల ఎకరాలు ఎక్కువ
వడ్ల కొనుగోలు సెంటర్లపై కలెక్టర్‌‌‌‌ రివ్యూ

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నిరుటి కంటే ఈసారి 20 వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా పెరుగుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వడ్ల కొనుగోలుగుకు ఇప్పటి నుంచే ప్లాన్‌‌ చేస్తున్నారు.

4.98 లక్షల ఎకరాల్లో...

జిల్లాలో సాగుకు అనుకూలమైన భూమి  5 లక్షల ఎకరాలు ఉండగా వానాకాలం సీజన్‌‌లో 4.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాగు విస్తీర్ణంలో 60 శాతం వరి పంటనే ఉంది. సకాలంలో వర్షాలు కురియడం, ఇతర పంటలు సాగు చేసి ఇబ్బందులును ఎదుర్కొంటున్న రైతులు కూడా ఈసారి వరి వైపే మొగ్గు చూపారు. మక్క, పప్పుదినుసుల సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. నిరుడు  వానాకాలం సీజన్‌‌లో జిల్లా వ్యాప్తంగా 2.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే  ఈసారి 2.98 లక్షల ఎకరాలకు పెరిగింది.  నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. 17.800 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు కూడా నిండుగానే ఉంది. చెరువులు, కుంటలు కూడా కంప్లీట్‌‌గా నిండాయి. సాగు నీటి ప్రాబ్లమ్స్​ఉండవని భావించిన రైతులు వరి వైపు వెళ్లారు.   

మక్కతో పాటు, పప్పు దినుసులు తగ్గాయ్​

మక్క, పప్పుదినుసుల పంటలు తగ్గాయి. మక్క ప్రస్తుతం 70,716 ఎకరాల్లో సాగు కాగా నిరుడు 92 వేల ఎకరాల్లో  సాగైంది. నిరుటి కంటే ఈసారి 22వేల ఎకరాలు తగ్గింది. కోతులతో ఇబ్బందులు తలెత్తుతుండడం, నిరుడు ఆశించిన దిగుబడి రాకపోవడంతో  చాలా మంది రైతులు ఈసారి మక్కకు బదులుగా వరి వేశారు. కంది ఈసారి 13,163 ఎకరాల్లో ఉండగా నిరుడు 18,537 ఎకరాల్లో ఉంది. మినుము ఈసారి 2,800 ఎకరాల్లో సాగు చేస్తే పోయిన సీజన్‌‌లో  10 వేల ఎకరాల్లో ఉంది. పెసర సాగు విస్తీర్ణం కూడా నిరుటి కంటే అధికంగా తగ్గింది.  ఈ సీజన్‌‌లో 5,125 ఎకరాలకు వేస్తే నిరుడు 9,940 ఎకరాల్లో ఉంది. సోయా గత సీజన్‌‌లో 71 వేల ఎకరాలు ఉండగా ఈసారి 88 వేల ఎకరాల్లో సాగు చేశారు.  

7 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి..

వానాకాలం సీజన్‌‌లో జిల్లాలో వరి పంట దిగుబడికి సంబంధించి 6.50 లక్షల నుంచి 7 లక్షల మెట్రిక్​టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో కోతలు షురూ కానున్నాయి. వడ్ల కొనుగోళ్లపై ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని గవర్నమెంట్ జిల్లా యంత్రాంగానికి సూచించింది. జిల్లాలో సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోలు సెంటర్ల ఏర్పాటు,  క్లీనింగ్ యంత్రాలు, సంచులు, ఇతర వసతులపై ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించింది.  దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అగ్రికల్చర్, కోఆపరేటివ్, సివిల్ సప్లయ్ ఆఫీసర్లతో కలెక్టర్​ రివ్యూ చేశారు. 

343 సెంటర్ల ఏర్పాటు

జిల్లాలో వడ్ల కొనుగోలుకు ఈసారి 343 సెంటర్లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం  కలెక్టరేట్‌‌లో వానాకాలం సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోళ్లపై ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ప్రతి సెంటర్‌‌‌‌లో వడ్ల క్లీనింగ్ యంత్రం ఏర్పాటు చేస్తామన్నారు. సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. అడిషనల్​ కలెక్టర్ చంద్రమోహన్, డీఆర్డీవో సాయన్న, సివిల్ సప్లయ్ డీఎం జితేంద్రప్రసాద్‌‌, డీఎస్‌‌వో రాజశేఖర్, అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, డీసీవో వసంత పాల్గొన్నారు.