
ఒకప్పుడు ఊళ్లో పెద్దవాళ్లంతా ఉదయాన్నే ఒక చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఊరి నడుమ చెట్టుకింద కూర్చొని, మంచి మాటలు చెప్పేటోళ్లు. పిల్లలకు, మనవలకు ఎప్పటికప్పుడు మంచి, చెడు చెప్పేటోళ్లు. ఇండ్లలో ఏ శుభకార్యమైనా వాళ్ల చేతుల మీదనే జరిగేది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. కారణాలేమైనా.. కొన్నేండ్ల నుంచి ఓల్డేజ్ హోమ్స్‌తో పాటు అందులో చేరే పెద్దవాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కొందరు పిల్లలు హెల్త్ సరిగా లేని తల్లిదండ్రులను చూసుకోలేక చేరుస్తున్నారు. మరికొందరు విదేశాల్లో ఉండటం వల్ల పెద్దవాళ్ల బాగోగులు చూసుకునేవాళ్లు లేక హోమ్స్‌లో ఉంచుతున్నారు. సీనియర్ సిటిజన్ల అవసరాలకు తగ్గట్టు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఓల్డేజ్హోమ్స్తోపాటు సీనియర్ లివింగ్ లగ్జరీ అపార్ట్మెంట్స్, అడల్ట్ డే కేర్ సెంటర్లు వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి.
కరోనా వచ్చినప్పుడు పెద్దవాళ్లను ఇండ్లలో ఉంచుకోవడానికి చాలామంది వెనకాడారు. ఎలా అయినా ఓల్డేజ్ హోమ్‌లలో జాయిన్ చేసేందుకు ప్రయత్నించారు. కొందరు ఇంటికి దగ్గర్లోని వృద్ధాశ్రమాల్లో తమ తల్లిదండ్రులను, అవ్వాతాతలను చేర్పించారు. ఇంట్లో ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకుతుండడం, పెద్దవాళ్లను చూసుకునేందుకు వీలు కావడం లేదనే కారణాలతో ఓల్డేజ్హోమ్లకు షిఫ్ట్ చేశారు. ఆ టైంలో చాలామంది పెద్దలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకునే వాళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా బారిన పడినవాళ్లకు సరైన మెడికేషన్ కూడా అందలేదు. దీంతో చాలామంది చనిపోయారు. కొవిడ్ అప్పుడు దాదాపు 70శాతం సీనియర్ సిటిజన్లు సరైన హెల్త్ కేర్ అందక నానా అవస్థలు పడినట్లు ఇటీవల అంతర, మ్యాక్స్ గ్రూప్ సర్వేలో తెలిసింది.
సర్వే ప్రకారం..
అంతర సంస్థ, మ్యాక్స్ గ్రూప్ సహకారంతో ‘‘స్టేట్ ఆఫ్ సీనియర్స్” పేరుతో ఓల్డేజ్ వాళ్లపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. అర్బన్ ఇండియాని ప్రధానంగా తీసుకుని ఈ సర్వే చేశారు. ఇందులో ఉత్తర ఢిల్లీ, ఎన్‌సీఆర్, జైపూర్, పశ్చిమ ముంబయి, పుణె, దక్షిణ బెంగళూరు, హైదరాబాద్‌పై దృష్టిసారించారు. ఈ ప్రాంతాల్లో 60 ఏండ్లు పైబడిన 2,100 మంది వృద్ధులను తీసుకుని రాండమ్ శాంప్లింగ్ మెథడాలజీతో సర్వే చేశారు. ప్రముఖ రీసెర్చ్, కన్సల్టింగ్ సంస్థ ‘ఏయోన్ ఇన్‌సైట్స్ మార్కెట్ రీసెర్చ్’ సాయంతో మార్చి నుంచి మే నెలాఖరు వరకు రెండున్నర నెలల వ్యవధిలో ఈ పరిశోధన పూర్తిచేశారు. ఈ సర్వేలో 70 శాతం మందికి సరైన హెల్త్ ఫెసిలిటీస్ అందుబాటులో లేదని తేలింది. కొవిడ్ టైంలో సీనియర్ సిటిజన్లు తమను చూసుకునేవాళ్లు లేక ఇబ్బందులు పడినట్లు సర్వేలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ల అవసరాలకు తగ్గట్టు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఓల్డేజ్హోమ్స్తోపాటు సీనియర్ లివింగ్ లగ్జరీ అపార్ట్మెంట్స్, అడల్ట్ డే కేర్ సెంటర్లు వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి.
సీనియర్ లివింగ్ లగ్జరీ అపార్ట్మెంట్స్
పెద్దవాళ్లు చివరి దశలో సంతోషంగా, స్వేచ్ఛగా ఉండేందుకు సీనియర్ సిటిజన్ లివింగ్ అపార్ట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని గౌడవల్లి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సీనియర్ లివింగ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్’ నిర్మించింది. ఈ అపార్ట్‌మెంట్స్‌ని పూర్తిగా సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీగా కట్టారు. సింగిల్ బీహెచ్‌కే నుంచి త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి. పెద్దవాళ్లకు హెల్త్ ఫెసిలిటీస్, 24గంటలు అందుబాటులో ఉంటాయి. ఇందులో డాక్టర్ కాల్‌లో, నర్స్ 24గంటలు అక్కడే ఉంటారు. డైనింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులో కొంత అమౌంట్ పే చేసిన వాళ్లకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్ చేసి పెడతారు. కంప్లీట్ హైజీన్‌గా చేసి పెడతారు. ట్రైన్డ్ చెఫ్స్‌తో ఈ ఫెసిలిటీ ఉంటుంది. నర్సులు 24గంటలు అందుబాటులో ఉంటారు. పర్సనల్ అసిస్టెంట్ కేర్ కావాలన్నా తోడుగా ఉంటారు. ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. ఫ్లాట్‌లో పెద్దవాళ్లు జారి పడకుండా యాంటీ స్కిడ్ ఫ్లోర్ ఉంటుంది. వాటర్ పడినా జారవు. పానిక్ బటన్స్‌ని బెడ్‌రూమ్‌లో, వాష్ రూమ్‌లో ఏర్పాటుచేశారు. అత్యవసర టైంలో బటన్ ప్రెస్ చేస్తే అలారం మోగి సెక్యూరిటీకి అలర్ట్ వెళ్తుంది. వెంటనే సెక్యూరిటీ వెళ్లి తమ దగ్గర ఉన్న మరో తాళంచెవితో లోపలికి వెళ్లి కాపాడేలా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లోర్‌లోనూ పెద్దవాళ్లు నడిచేందుకు వీలుగా గోడలకు బార్లు ఏర్పాటు చేశారు.
అడల్ట్ డే కేర్ సెంటర్లు
పిల్లల డే కేర్ సెంటర్లు చూశాం. సిటీలో మొదటిసారిగా అడల్ట్ డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లో గతేడాది ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. పని మీద పిల్లలు ఊరెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు టైంకి భోజనం, మందులు ఇచ్చేవాళ్లు లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ అడల్ట్ డే కేర్ సెంటర్ ఉపయోగపడుతుంది. పెద్దవాళ్లకు తమ ఇంట్లో ఉన్న అనుభవం కలిగేలా ఈ సెంటర్‌ని హోమ్ స్టైల్‌లో డిజైన్ చేశారు. ఇక్కడ నర్స్ ఫెసిలిటీతో పాటు మంచం పట్టిన వాళ్లకు అసిస్టెంట్ హెల్త్ కేర్ కూడా ఉంది. నెలకి 15 రోజుల ప్యాకేజీ. ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. ‘‘విదేశాలకు వెళ్లే పిల్లలు ఆరేడు నెలల పాటు కూడా తల్లిదండ్రులను ఇక్కడ ఉంచి వెళ్లొచ్చు. పెద్దవాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడే వాళ్లకు హైజీన్ ఫుడ్ పెడుతున్నామ’’ని చెప్పారు అడల్ట్ డే కేర్ ఫౌండర్ మాధురి.
పెద్దోళ్లకు వీలుగా ఉండేందుకు
సీనియర్ సిటిజన్ల కోసం మార్కెట్‌లో అత్యాధునిక ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇతరుల సాయం లేకుండా పనులు సొంతంగా చేసుకునేలా ఇవి ఉపయోగపడుతున్నాయి. వీటిలో బాత్రూమ్, టాయిలెట్ అవసరాల కోసం పలు ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. స్నానం చేసేటప్పుడు సపోర్ట్‌గా ఉండేందుకు షవర్ చైర్ విత్ బ్యాక్ రెస్ట్, వాష్ రూమ్‌లో సాయంగా పోర్టబుల్ కన్వర్షన్ కమోడ్, టాయిలెట్ స్క్వాట్ స్టూల్, వాల్ మౌంటెడ్ ఇండియన్ కన్వర్షన్ కమోడ్, ఫోల్డింగ్ కమోడ్ చైర్ విత్ కాస్టర్స్, స్టెయిన్ లెస్ స్టీల్ గ్రాబ్ బార్స్ దొరుకుతున్నాయి. బెడ్ రూమ్ ఎసెన్షియల్స్‌లో ఎయిర్ పంప్ మ్యాట్రిస్, బెడ్ సైడ్ రెయిల్, బెడ్ కంఫర్ట్ వెడ్జ్ వంటివి ఉంటున్నాయి. మొబిలిటి సపోర్ట్‌లో టీ షేప్డ్ ఫోల్డింగ్ కేన్ విత్ వుడెన్ హ్యాండిల్, ఆర్మ్ క్రెట్చ్ సెట్, ఎల్ బో విత్ ఫోల్డింగ్ హ్యాండిల్, వీల్ చైర్ విత్ రైటింగ్ బోర్డ్, రిక్లైనింగ్ వీల్ చైర్ విత్ ఎలెవెటెడ్ ఫుట్ రెస్ట్ వంటి ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి.
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు
- సిటీలో సీనియర్ సిటిజన్లకు సంబంధించి 1997లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ, ఏపీలో 400 నుంచి 500 అసోసియేషన్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా మూడు రకాల యాక్టివిటీస్‌ని ప్రోత్సహిస్తున్నారు.
- సీనియర్ సిటిజన్స్‌కి సొసైటీ సపోర్ట్ ఉండాలి.
- సొసైటీకి సీనియర్ సిటిజన్స్ సపోర్ట్ చేయాలి.
- సీనియర్‌లు సొసైటీలోని మార్పులను గమనించి సహకరించాలి.
- ఇందులో భాగంగా ఒంటరితనంతో పోరాడుతున్న వారికి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లను పెట్టారు.
- సిటీల్లో ఉండే సీనియర్ సిటిజన్స్‌కి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్‌ని సొసైటీలోని మిగతా వాళ్లకోసం అందించాలి. ఓల్డేజ్ వాళ్లకు ఉపయోగకరంగా ఏదైనా చేయాలి. పెన్షన్ వస్తున్న వాళ్ళు లేనివాళ్లకు సాయం చేయాలి.
- గతంలో చాలామంది పెద్దవాళ్ళు మంచి జీతం ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోలేదు. వాళ్లకు ఇన్సూరెన్స్ చేయడానికి ఈ అసోసియేషన్లు ఇన్సూరెన్స్ సంస్థలతో మాట్లాడి ప్రీమియం కట్టని వాళ్లకి ఛాన్స్ ఇచ్చేవిధంగా చేశాయి. 70 ఏండ్లు వచ్చిన వాళ్లు ఇన్సూరెన్స్ కట్టే విధంగా అవకాశం ఇప్పించారు.
వేరే దేశాల్లో ఎలా ఉందంటే..
కొన్ని దేశాలు సీనియర్ సిటిజన్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. వాళ్ల కోసం ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చాయి. ముఖ్యంగా జపాన్, చైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సీనియర్ సిటిజన్ల సేఫ్టీ కోసం చాలా రూల్స్ ఉన్నాయి.
15 వేల ప్రాణాలు
ఫ్రాన్స్‌లో జరిగిన రెండు సంఘటనలు ప్రపంచాన్ని సీనియర్ సిటిజన్ల సేఫ్టీ గురించి మరింత ఆలోచించేలా చేశాయి. 2003 ఆగస్టులో ఫ్రాన్స్‌లో ఎండలు విపరీతంగా పెరిగాయి. ఆ హీట్ వేవ్స్ వల్ల ఆ ఏడాది చివరి నాటికి దాదాపు15 వేల మంది సీనియర్ సిటిజన్ల ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత కూడా చాలామంది సీనియర్ సిటిజన్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దేశంలో రికార్డయిన మొత్తం ఆత్మహత్యల కేసుల్లో సగానికి పైగా సీనియర్ సిటిజన్లవే అని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అయితే.. ఇది కేవలం ఫ్రాన్స్‌కి మాత్రమే పరిమితం కాలేదు. అప్పట్లో చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకే అన్ని దేశాలు సీనియర్ సిటిజన్ల వెల్ఫేర్ కోసం కొన్ని రూల్స్ తీసుకొచ్చాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అప్పుడు సీనియర్ సిటిజన్స్‌కి ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
40 ఏండ్లు దాటితే హెల్త్ ఇన్సూరెన్స్
జపాన్‌లో కనీస ఆయుర్దాయం 83 సంవత్సరాలు. అక్కడ సీనియర్ సిటిజన్ల జనాభా సుమారు 40శాతం. 2000 సంవత్సరం వరకు సీనియర్ సిటిజన్ల బాధ్యత వాళ్ల కుటుంబాలపైనే ఉండేది. కానీ.. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇష్టపడటం లేదని ప్రభుత్వం గుర్తించింది. సీనియర్ సిటిజన్స్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ల పిల్లలు గవర్నమెంట్ హాస్పిటళ్లకు తీసుకెళ్తున్నారు. జబ్బు తగ్గాక వాళ్లలో కొంతమంది తమ తల్లిదండ్రులను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు వెనుకాడుతున్నారు. దాంతో సీనియర్ సిటిజన్లకు సేఫ్టీ అవసరమని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అందుకే సీనియర్ సిటిజన్లకు ఇండ్లు, ఓల్డేజ్‌హోమ్స్ లాంటి సౌకర్యాలు కల్పించడం మొదలుపెట్టింది. ట్రీట్‌మెంట్ ఖర్చులు పెరుగుతున్నాయని గుర్తించి.. 40 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం తప్పనిసరి అనే రూల్ పెట్టింది. ఇన్సూరెన్స్ డబ్బు 65 ఏండ్లు నిండిన తర్వాత వర్తిస్తుంది.
చైనాలో గవర్నమెంటే..
ప్రస్తుతం చైనా జనాభా 140కోట్లు. జనాభా విపరీతంగా పెరుగుతుండడంతో ఒకప్పుడు అక్కడ వన్ చైల్డ్ విధానం తీసుకొచ్చారు. అంటే అందరూ ఒకే బిడ్డను కనాలి. ఆ తర్వాత కొన్నేండ్లకు ఇద్దర్ని కనొచ్చు అని ప్రకటించింది. దాంతో చైనాలో చాలామంది సీనియర్ సిటిజన్లకు అది శాపంగా మారింది. ఒకే సంతానం ఉండడం వల్ల తల్లిదండ్రుల్ని, పిల్లల్ని పోషించడం వాళ్లకు కష్టమైంది. అందుకే అక్కడి గవర్నమెంట్ వయసుపైబడిన వాళ్ల హక్కులు కాపాడేందుకు ఒక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పదవీ విరమణ తర్వాత సీనియర్ సిటిజన్లకు వాళ్ల శక్తికి తగ్గట్టు ఉపాధి చూపించే బాధ్యత ప్రభుత్వానిదే.
రిటైర్మెంట్ తర్వాత ట్రైనింగ్
సింగపూర్‌లో కూడా సీనియర్ సిటిజన్ల కోసం చట్టాలు చేశారు. రిటైర్ అయిన వెంటనే వాళ్లకు కొత్త వ్యాపారం చేయడం నేర్పించడం ప్రభుత్వ బాధ్యత. అందుకయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. దాంతోపాటు సీనియర్ సిటిజన్లకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. సింగపూర్‌కు చెందిన సైనిక అధికారి టెన్‌పింగ్ రిటైర్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకుని, రెండు కేఫ్‌లు నడుపుతున్నాడు. మైఖేల్ చాంగ్ అనే అతను రిటైర్ అయిన తర్వాత నర్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. సొంతంగా ఏజెన్సీ పెట్టి.. 400 మంది సీనియర్లకు పని కల్పించాడు.
ఆస్ట్రేలియా పాలసీ
పదేండ్ల సర్వీసు పూర్తి చేసిన ఆస్ట్రేలియన్ సిటిజన్ ఎవరైనా ఏడాదిలో మూడు నెలలు లీవ్ తీసుకోవచ్చు. తల్లిదండ్రులను చూసుకునేందుకు పిల్లలకు ఈ లాంగ్ లీవ్ ఇస్తోంది అక్కడి గవర్నమెంట్. ఇక్కడ కూడా గవర్నమెంట్ సీనియర్ సిటిజన్ల కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలు చేసింది. రిటైర్మెంట్ అంటే.. లైఫ్‌కి ఎండ్ కార్డ్ పడినట్టు కాదు. లైఫ్‌లో మరో కొత్త కోణానికి పునాది పడినట్టు అని అక్కడి చట్టాలు చెప్తున్నాయి. రిటైర్మెంట్ అంటే అది కెరీర్‌లో మరో దశ అని అక్కడివాళ్లు భావిస్తారు. అక్కడ సీనియర్లకు వ్యాపారం కోసం బ్యాంక్ రుణాలు కూడా ఇస్తుంటుంది. వాళ్లకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అక్కడ పెద్దవాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ. ఆ దేశంలో ప్రతి హాస్పిటల్‌లో ఒక జీరియాట్రిషియన్ (ముసలివాళ్లకు ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్) కచ్చితంగా ఉంటాడు.
టైం బ్యాంక్
స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ‘టైం బ్యాంక్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆ దేశంలో ఏ యువకుడైనా సీనియర్ల కోసం పనిచేయొచ్చు. అంటే.. వాళ్లను షాపింగ్‌కి తీసుకెళ్లడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం లాంటివి చేయొచ్చు. అలా అతను వాళ్లకోసం ఎన్ని గంటలు పనిచేశాడన్నది సోషల్ సెక్యూరిటీ ఆఫీస్‌లో రికార్డ్ చేయించుకోవాలి. ఆ యువకుడు సీనియర్ సిటిజన్ అయినప్పుడు అతను సీనియర్ల కోసం పనిచేసినన్ని గంటలు అతనికి యువకులతో ఫ్రీగా సర్వీస్ ఇప్పిస్తారు. - అంజుమా మహ్మద్.. ఫొటోలు: దుబ్బాక సురేష్ రెడ్డి, జెల్ల నవీన్
23 ఏండ్ల నుంచి హోమ్‌లోనే
నేను 23 ఏండ్ల నుంచి సీఆర్ ఫౌండేషన్‌లో ఉంటున్నా. హోమ్ చాలా బాగుంది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. మాతో పాటు ఉండేవాళ్లు సాయంగా ఉంటారు. స్టాఫ్ చాలా బాగా సహకరిస్తారు. మాకు ఎలాంటి ఫుడ్ అయితే బాగుంటుందో అదే వండి పెడతారు. హోమ్ డాక్టర్ ఉన్నారు. మా కాలక్షేపానికి అలసట లేని ఆటలు ఆడుతుంటాం. ఓపెన్ జిమ్ కూడా ఉంది. నా పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు. ఇక్కడే ఉంటారు. వస్తూ పోతూ ఉంటారు. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడ చేరా. కరోనా టైంలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది తప్ప ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఇప్పుడు అంతా సెట్ అయింది. - ఏబీకే ప్రసాద్, 88 ఏండ్లు, సీఆర్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్
రిటైర్మెంట్ తర్వాత
నేను 2009లో సింగరేణి క్వారీస్లో పనిచేసేవాడిని. 2011లో నా రిటైర్మెంట్. అయితే, రిటైర్ అయ్యాక ఎక్కడ ఉంటే బాగుంటుందని ముందునుంచే ఆలోచించా. 2009 లో నేను, నాతో పాటు పనిచేసే మా జనరల్ మేనేజర్ ఈ హోమ్‌ను చూశాం. ఇక్కడ సౌకర్యాలు బాగుండడం చూసి, ఒక నిర్ణయం తీసుకున్నాం. 2010లో మా బంధువుల్లో ఒకావిడని ఇక్కడ చేర్పించాం. అలా ఇక్కడికి వస్తూ పోయేవాళ్లం. రిటైర్మెంట్ తర్వాత పిల్లలతో అమెరికా వెళ్లి, అక్కడ పదేండ్లు ఉన్నా. తర్వాత ఇక్కడికి రావాలనుకుని ముందుగానే హోమ్ వాళ్ళతో మాట్లాడా. మొన్న దసరా తర్వాత జాయిన్ అయ్యా. - గంగాధర్, సీఆర్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్
వాళ్ల భవిష్యత్ కోసమే
పిల్లలు పట్టించుకోవడం లేదు అనే భావన తప్పు. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు చూసుకునేందుకు కుదిరేది. ప్రస్తుతం అలా ఉండటం లేదు. చదివింది వాళ్ల భవిష్యత్ బాగుండాలనే. దానికి పెద్ద వాళ్ళు అడ్డుకాకూడదు. తల్లిదండ్రులు పిల్లలు చూడట్లేదు, దూరమయ్యారని భావనతో ఉండటం లేదు. మా హోమ్‌లో ఎలాంటి బాధ లేకుండా ఉంటున్నాం.
- మోర రామకృష్ణారెడ్డి
పెరుగుతున్న పెద్దవాళ్ల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్యం పెరుగుతోంది. 2021లో తెలంగాణలో 60ఏండ్లు పైబడినవాళ్లు 11శాతం మంది ఉన్నారని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ సర్వేలో తేలింది. 2031నాటికి ఇది 14.5శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు, 2019లో నిర్వహించిన ఆర్థిక సర్వే ప్రకారం 60ఏండ్ల పైబడిన సీనియర్ సిటిజన్లు 10.6శాతం ఉన్నారు.
అనారోగ్యం వల్లే ఎక్కువ
కొవిడ్ తర్వాత అందరి ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు ట్రీట్‌మెంట్ కోసం అప్పులు తీసుకొచ్చి మరీ ఆరోగ్యం బాగుచేసుకున్నవాళ్లు, ఇప్పుడు వాటిని తీర్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు నిత్యావసర వస్తువులు, ఇతరత్రా వాటి ధరలు అన్నీ పెరగడంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. ఈ టైంలో ఇంట్లో పెద్దవాళ్లు అనారోగ్యం బారిన పడితే చూసుకోలేమని భావిస్తున్నారు. వాళ్లకు టైంకి మందులు ఇవ్వడం, రెగ్యులర్ చెకప్‌లకు తీసుకెళ్లడం, సపర్యలు చేయడం తమవల్ల కాదని అనుకుంటున్నారు. ఇంట్లో పిల్లల చదువులు, తమ ఉద్యోగాలు సాఫీగా సాగవని అనుకుని ఓల్డేజ్హోమ్లకు షిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకి 10 నుంచి 15ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి. అందులో అనారోగ్యం వల్ల జాయిన్ చేస్తున్నామని చెప్తున్నవాళ్లే ఎక్కువమంది ఉంటున్నారు. నెలకి 20 నుంచి 25పైనే అడ్మిషన్లు అవుతున్నాయి. మాది ఉచిత ఓల్డేజ్‌హోమ్ కావడంతో చాలామంది వీటిపైనే చూస్తున్నారు. బెడ్‌కి పరిమితమైన వారికి కొంత అమౌంట్ ఇవ్వాలని మేం అడుగుతున్నా, అందులో సగం కూడా ఇవ్వలేమని చెప్తున్నారు. - మలినేని అరుణ ది నెస్ట్ హోమ్ ఫర్ ది ఎల్డర్స్, మియాపూర్
సేవ చేసినవాళ్లకు..
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ పేరుతో 1999 లో ఏర్పాటు చేశారు. ఐదుగురితో మొదలైన ఈ హోమ్ ప్రస్తుతం 136 మందితో నడుస్తోంది. ఇక్కడ సమాజ సేవ చేసినవాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులతో పాటు ఎవరూ చూసుకునేందుకు లేనివాళ్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఆరోగ్యంగా ఉండి 65 ఏండ్లు పైబడిన వాళ్లను చేర్చుకుంటారు. ఇక్కడ చేరాక అనారోగ్యం బారిన పడిన వాళ్ల కోసం ఆరు బెడ్స్‌తో అసిస్టెంట్ హెల్త్‌కేర్ వార్డ్ కూడా ఉంది. 24 గంటలు డాక్టర్, నర్స్ సౌకర్యం ఉంది. రోజూ మెడికల్ చెకప్ చేస్తారు. ‘ఈ మధ్యకాలంలో 80 ఏండ్లు పైపడిన వాళ్ల నుంచి అడ్మిషన్ రిక్వెస్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ టెంపరరీ అకామిడేషన్ ఉండద’ని చెప్పారు డైరెక్టర్ చెన్నకేశవరావు.
తోడు కోసం
పెద్దవాళ్లకు మంచి తోడు, మాట్లాడేవాళ్ళు ఉండటం వల్ల ఈ అపార్ట్‌మెంట్స్‌ని ఇష్టపడుతున్నారు. ప్రతి పండుగకు పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. మేం కూడా సపోర్ట్ ఇస్తాం. మొత్తం 190 ఫ్లాట్స్ ఉంటే అందులో 120 ఫ్యామిలీస్ ఉంటున్నారు. మొత్తం నాలుగు బ్లాక్స్ రాబోతున్నాయి. ‘ఎ’ బ్లాక్ కంప్లీట్ అయింది. ‘బి’ బ్లాక్ ఇంకో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. సి, డి కూడా చేస్తున్నాం. మొత్తం 5 .65 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్లబ్‌హౌజ్ లో జిమ్, లైబ్రరీ , యోగా సెంటర్, స్విమ్మింగ్ పూల్, మెడిటేషన్ రూమ్, పార్టీ హాల్, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్నారైల నుంచి కాల్స్ వస్తున్నాయి. నిజామాబాద్, వరంగల్, బంజారాహిల్స్ నుంచి చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వెంచర్ స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ కాల్స్ వస్తున్నాయి. – గణపతి కుమార్, సాకేత్ సీనియర్ లివింగ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్స్ మేనేజర్
ఇన్సూరెన్స్ కట్టాలి
ఇన్సూరెన్స్ లేని వాళ్ళను కట్టేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రోత్సహించాలి. లేకపోతే ఎంతోమంది హాస్పిటల్ ఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్నారు. రిటైర్ అయినా పెద్ద ఇండ్లలో ఉండే ఓల్డేజ్ వాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా తమ ఇంటిని బ్యాంక్‌కి తాకట్టు పెట్టుకుని నెలనెలా డబ్బులు పొందేవిధంగా 2005–-06లో రివర్స్ మార్టిగేజ్ పేరుతో చట్టం తీసుకొచ్చాం. వాళ్లు చనిపోయేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇల్లు ఒకటే ఆదాయంగా ఉన్న వాళ్లకు ఇది వర్తిస్తుంది. ఓల్డేజ్ హోమ్స్‌కు ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలి. మా అసోసియేషన్స్‌లో ప్రతి నెలా ఆ నెలలో పుట్టిన అందరికీ కలిపి పుట్టిన రోజు చేస్తాం. అలాగే ఈ బర్త్‌డేలు ఓల్డేజ్ హోమ్‌లకు వెళ్లి జరుపుకోవాలని సూచిస్తున్నాం. అలా హోమ్‌లలో ఉంటున్న వాళ్లకు రిఫ్రెషింగ్‌గా ఉంటుందని భావిస్తున్నాం. ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌లో ఉంటున్న మెంబర్స్‌కి తమ ఏరియాలోని మిగతా పెద్దవాళ్ళ డేటా తీసుకోవాలని చెప్తున్నాం. వాళ్ల దగ్గరకు వెళ్లి టైం స్పెండ్ చేయాలని కూడా చెప్తున్నాం. దీని ద్వారా వాళ్లను పిల్లలు మరింత బాగా చూసుకునే అవకాశం ఉంటుంది. -
డా. రావ్ వి.బి.జె. చెలికాని, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్
ఆయాలుంటారనే నమ్మకంతో
అనారోగ్య కారణాలతోనే అడ్మిషన్లు అవుతున్నాయి. అనారోగ్య సమస్యలు, వాకర్‌తో నడిచేవాళ్లు, మానసికంగా సరిగాలేని వారు, బెడ్ రిడెన్ అయిన వారిని ఎక్కువగా తీసుకుని వస్తున్నారు. ఓల్డేజ్ హోమ్‌లో అయితే ఆయాలుంటారనే నమ్మకంతో ఇక్కడ చేర్పిస్తున్నామని చెప్తున్నారు. పెద్దవాళ్లు ఉంటే తమ పనులకు ఇబ్బంది అవుతుందని, వాళ్ల ఆరోగ్యం చూసుకునే టైం ఉండటంలేదని అందుకే చేరుస్తున్నామని అంటున్నారు. నెలకి 15కి పైగా అడ్మిషన్లు అవుతున్నాయి. 50, 60ఏండ్లు పైబడినవారినే ఎక్కువగా చేరుస్తున్నారు. - ఆయేషా , అమ్మ ఓల్డేజ్ హోమ్, హైదరాబాద్.