ఆసీస్‌‌‌‌ కాస్కో... నేడు(అక్టోబర్ 08) టీమిండియాతో మ్యాచ్

ఆసీస్‌‌‌‌  కాస్కో... నేడు(అక్టోబర్ 08) టీమిండియాతో మ్యాచ్

చెన్నై: మొత్తం 15 మంది.. వేర్వేరు ప్రాంతాలు.. భిన్నమైన అభిరుచులు! కానీ అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే. 2011 చరిత్రను రిపీట్‌‌‌‌ చేస్తూ మరోసారి కప్‌‌‌‌ కొట్టాలె. దానికి తొలి అడుగు ఘనంగా వేసేందుకు మన వీరులు సిద్ధయ్యారు. ఓవైపు ఆసియా గేమ్స్‌‌‌‌లో అథ్లెట్లు పతకాల మోత మోగిన వేళ.. మరోవైపు సొంతగడ్డపై పరుగుల జాతర మొదలుపెట్టేందుకు టీమిండియా రెడీ అయ్యింది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగే తమ తొలి పోరులో ఇండియా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ బ్యాటర్లకు, అంతే స్థాయి కలిగిన కంగారూల పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌ మధ్య రసవత్తర పోరాటం జరగనుంది. చెపాక్‌‌‌‌లో ఇరుజట్లకు మంచి ట్రాక్‌‌‌‌ రికార్డు ఉండటంతో ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌ను అంచనా వేయలేం.  

గిల్​కు జ్వరం.. పాండ్యాకు గాయం..

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌ను దిగ్విజయంగా ముగించిన టీమిండియాకు  భారీ షాక్‌‌‌‌లు తగులుతున్నాయి. డెంగ్యూ కారణంగా ఓపెనర్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో ఆడతాడో లేదో తెలియడం లేదు. మరోవైపు నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌లో ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా చేతి వేలికి గాయమైంది. అయితే అతను ఆడతాడని తెలుస్తోంది. 36 ఏళ్ల కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌, 35 ఏళ్ల విరాట్‌‌‌‌ కోహ్లీతో పాటు అనుభవజ్ఞుడైన ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవి అశ్విన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌తో పాటు టోర్నీలో కీలకం కానున్నారు. 

కెరీర్‌‌‌‌ ముగింపు దశలో ఉన్న ఈ ముగ్గురు ఇండియాకు కలల కప్‌‌‌‌ను అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అన్న స్థాయిలో మిగతా వాళ్లు కూడా రెడీ అయ్యారు.  మ్యాచ్​ టైమ్​కు గిల్​ కోలుకోకపోతే  రోహిత్‌‌‌‌కు తోడుగా ఇషాన్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా రావొచ్చు. కోహ్లీ, రాహుల్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ఖాయం కాగా, నాలుగో నంబర్‌‌‌‌ కోసం శ్రేయస్‌‌‌‌, సూర్య మధ్య పోటీ ఉంది. జడేజా, కుల్దీప్‌‌‌‌కు తోడుగా మూడో స్పిన్నర్‌‌‌‌గా అశ్విన్‌‌‌‌ను తీసుకోవచ్చు.  పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌‌‌‌ బరిలోకి దిగనున్నారు.   
 

కంగారు పెడతారా?

ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌‌‌‌కు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. టీమ్‌‌‌‌లో ఆల్‌‌‌‌రౌండర్లు ఎక్కువగా ఉండటం కంగారూలకు అతిపెద్ద బలం. ఇండియన్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై వార్నర్‌‌‌‌, స్మిత్‌‌‌‌కు మంచి రికార్డు ఉంది. మిడిల్‌‌‌‌లో లబుషేన్‌‌‌‌, మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ , గ్రీన్‌‌‌‌, క్యారీ నిలబడితే ఆసీస్‌‌‌‌ను అడ్డుకోవడం కష్టం. మరీ ముఖ్యంగా ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, స్పిన్నర్‌‌‌‌ ఆడమ్‌‌‌‌ జంపా నుంచి ఇండియాకు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. బౌలింగ్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌, స్టార్క్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ పేస్‌‌‌‌కు ఎదురొడ్డి నిలిస్తేనే ఇండియా విజయాన్ని ఆశించొచ్చు. 

తుది జట్లు (అంచనా):

ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), గిల్‌‌‌‌ / ఇషాన్‌‌‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌ / సూర్య, రాహుల్‌‌‌‌, పాండ్యా, జడేజా, అశ్విన్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, బుమ్రా, సిరాజ్‌‌‌‌.
ఆస్ట్రేలియా: కమిన్స్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), వార్నర్‌‌‌‌, మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌, స్మిత్‌‌‌‌, లబుషేన్‌‌‌‌, గ్రీన్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, స్టార్క్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, జంపా.