సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి : ఇండియా కూటమి నేతలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి : ఇండియా కూటమి నేతలు

కాశీబుగ్గ, వెలుగు: ఎస్‌‌‌‌ఐఆర్ పేరుతో కోట్లాది ఓట్లను తొలగిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌‌‌‌లో ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

బుధవారం వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి, కుడా చైర్​పర్సన్​ గుండు సుధారాణి, ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ తదితరులు పాల్గొని పోచమ్మమైదాన్ సెంటర్ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు చోరీ, ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.