ఇండియాకు వస్తే ఎంతో మేలు.. విదేశీ కంపెనీలకు మోడీ వెల్కమ్

ఇండియాకు వస్తే ఎంతో మేలు.. విదేశీ కంపెనీలకు మోడీ వెల్కమ్
  • యూకే ఎఫ్టీఏతో ఎంతో మేలని ప్రకటన
  • పెట్టుబడులు పెరిగాయన్న యూకే పీఎం స్టార్మర్​

న్యూఢిల్లీ: తమ దేశంలో అపార అవకాశాలు ఉన్నాయని, గ్లోబల్ ​బిజినెస్​లు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత్-యూకే వాణిజ్య ఒప్పందం రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల ప్రజల ఉమ్మడి పురోగతికి కీలకమని అన్నారు. భారతదేశంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని, మౌలిక సదుపాయాలు, ఫార్మా, ఇంధనం, ఫైనాన్స్ లాంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలని యూకే కంపెనీలను ఆహ్వానించారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తో కలిసి సీఈఓల ఫోరంలో మోదీ మాట్లాడారు. 

‘‘భారతదేశ ప్రతిభ స్థాయి, యూకే ఆర్ అండ్ డీ నైపుణ్యం కలయిక గొప్ప ఫలితాలను ఇస్తుంది.  ఆశయాలను నెరవేర్చడానికి మీతో భాగస్వామ్యం చాలా ముఖ్యం.  ఈ ఏడాది జులైలో సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)పై సంతకం చేయడంతో భారత్-యూకే సంబంధాలు బలోపేతం అయ్యాయి”అని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ఎంఎస్ఎంఈలకు మేలు చేస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని వివరించారు.

స్టార్మర్ మాట్లాడుతూ, ఈ వాణిజ్య ఒప్పందం అమలుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు ప్రయత్నించాలని సూచించారు. సీఈటీఏపై జులైలో సంతకం చేసిన మూడు నెలల్లో వాణిజ్యం, పెట్టుబడిలో ఆరు బిలియన్ పౌండ్ల పెరుగుదల ఉందని స్టార్మర్ అన్నారు. ప్రస్తుతం 56 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్-యూకే ద్వైపాక్షిక వాణిజ్యం, 2030 గడువు కంటే ముందే రెట్టింపు అవుతుందని మోదీ అన్నారు.

‘‘టెలికాం, ఏఐ, బయోటెక్, క్వాంటం, సెమీ-కండక్టర్, సైబర్ అంతరిక్ష రంగాలలో రెండు దేశాల భాగస్వామ్యం ఉంది. కీలక ఖనిజాలు, ఏపీఐ లాంటి వ్యూహాత్మక రంగాలలో మనం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి. ప్రపంచ నాయకులుగా మారగల కొన్ని రంగాలను గుర్తించడానికి భారతదేశం, యూకే వ్యాపార నాయకులు కృషి చేయాలి”అని ప్రధాని మోదీ సూచించారు. యూకేకు చెందిన తొమ్మిది యూనివర్సిటీలు భారతదేశంలో క్యాంపస్‌‌‌‌‌‌‌‌లను తెరుస్తాయని మోదీ ప్రకటించారు.