సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్ దగ్గర క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ నెల 25న జరిగే ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడికి కూడా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ఇప్పటివరకు టికెట్స్ ఇష్యూ చేయకపోవడంతో హెచ్ సీయూ తీరుపై మండిపడుతున్నారు. టికెట్స్ ఎప్పుడిస్తారో క్లారిటీగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం రేపు ఇస్తారంటూ ఫ్యాన్స్ కు సర్ధిచెప్పి పంపిస్తున్నారు.
దాదాపు వారం రోజులుగా టికెట్స్ కోసం ఫ్యాన్స్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మూడ్రోజుల కింద ఆన్ లైన్ లో పెట్టినా.. వెంటనే అయిపోయినట్లు చూపించారు. ఇక ఆఫ్ లైన్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ రోజూ గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ జింఖానా గ్రౌండ్ కు భారీగా చేరుకున్నారు. అయితే అక్కడ కూడా టికెట్స్ ఇవ్వట్లేదని తెలియడంతో అభిమానులు గొడవ చేశారు.
హెచ్ సీఏ బ్లాక్ లో టికెట్లకు ప్రోత్సహిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ‘ఆన్ లైన్లో బుక్ చేస్తే మనీ రిఫండ్ చేస్తున్నారు. జింఖాన గ్రౌండ్ వద్దకు వచ్చి ఐదు రోజులుగా తిరిగి వెళుతున్నాం. టికెట్స్ కోసం ఇవాళ ఉదయం నుండి జింఖానా గ్రౌండ్స్ వద్ద వెయిట్ చేస్తున్నాము. టికెట్ ల కోసం ఉప్పల్ వెళితే జింఖానా గ్రౌండ్ కి వెళ్ళండి అని చెప్పారు. జింఖానా గ్రౌండ్స్ కి వస్తే ఇక్కడ ఎవరు లేరు. మాకు టికెట్స్ కావాలి. ఆఫ్ లైన్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారో కూడా సమాచారం లేదు. ఇప్పటి వరకు ఆఫ్ లైన్ టికెట్స్ విషయంలో స్పష్టత ఇవ్వక పోవడం దారుణం. టికెట్స్ అన్ని బ్లాక్ లో విక్రయిస్తున్నారు. రూ.2 వేల టికెట్స్.. రూ. 5 వేలు, రూ.6వేలకు విక్రయిస్తున్నారు. టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకొని సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదు’ అంటూ క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
