ఇండియా కూటమి ముందడుగు

ఇండియా కూటమి ముందడుగు

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ  ఘోరంగా ఓడిపోయింది.  నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల ఫలితాల్లో ఆశించిన మేరకు రాణించలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి..  నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కోవడానికి కొత్త ఫార్ములాను కనుగొనవలసి వచ్చింది. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా పోరాడితే దాని ఫలితం పరాజయమే అని,  పతనం తప్పదని కాంగ్రెస్ గ్రహించింది. 

ఇండియా కూటమి సమైక్యంగా ముందుకు సాగాలాంటే చాలా పొలిటికల్​ డిప్లొమసీ అవసరం.   కానీ, బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​తోపాటు మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గం,  శివసేన ఉద్ధవ్​ వర్గం (యూబీటీ) ఇతర ప్రాంతీయ పార్టీలపై నిరంతరం దాడి చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ  ప్రతిపక్షాల ఐక్యతను చాలా సులభతరం చేసింది. దీంతో  ప్రతిపక్షాలన్నీ తమ వైరుధ్యాలను పక్కనపెట్టి ఏకమయ్యాయి.

ప్రాంతీయ పార్టీలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విస్తృత దాడి వారిని కాంగ్రెస్‌‌ కూటమిలో చేరేలా చేసింది. తమ మనుగడకే బీజేపీ పెద్ద ముప్పు అని ప్రాంతీయ పార్టీలు భావించాయి. దీంతో ప్రాంతీయ పార్టీలు బీజేపీపై పోరుకు తామంతా దృఢపడాలని నిర్ణయించుకున్నాయి. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ జూన్ 2023లో ఏర్పడింది. ఆమ్​ఆద్మీ పార్టీ చీఫ్​ కేజ్రీవాల్‌‌, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితరులు కాంగ్రెస్‌‌ నాయకులతో కలిసి ఫొటోలు దిగడం అదే తొలిసారి. కేజ్రీవాల్, మమతా బెనర్జీ  వీరిద్దరూ ఢిల్లీ, పంజాబ్,  పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలను నియంత్రిస్తున్నారు. ఆప్​ ఢిల్లీ, పంజాబ్​లో అధికారంలో ఉండగా, మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ  పశ్చిమబెంగాల్​లో అధికారంలో ఉంది. 

‘ఇండియా’ కూటమి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

ప్రతిపక్ష ఇండియా కూటమికి నాయకుడిగా ఎవరు ఉండాలనేది మొదటి ప్రధాన సమస్య. మమతా బెనర్జీ, అఖిలేశ్​యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు రాహుల్ గాంధీని ప్రతిపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి సుముఖంగా లేరు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిగా ఎవరూ ఉండరని ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్​ ప్రకటించడంతో ఓ భారీ సమస్య పరిష్కారమైంది. అదేవిధంగా ప్రతిపక్ష కూటమికి ఉన్న మరో పెద్ద సమస్య సీట్ల పంపకం. టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ బీజేపీతో మాత్రమే తలపడే రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్ మొదలైనవి) కాంగ్రెస్ సీట్లను నిర్ణయించే ఫార్ములాను సూచించింది.  ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయించే రాష్ట్రాల్లో (ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు) ప్రాంతీయ పార్టీలు ఇచ్చే స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ ఫార్ములాను కాంగ్రెస్ ఆమోదించింది. కామన్ మినిమం ప్రోగ్రామ్, మేనిఫెస్టోలపై ఆయా పార్టీల మధ్య అవగాహన ఉంది కాబట్టి ఇది పెద్దగా సమస్యని కలిగించదు. 

ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి పరిస్థితి

లోక్​సభ ఎన్నికల్లో పోటీచేసే సీట్లు పంచుకోవడంపై ఇండియా కూటమి ఏకతాటిపై నిలవలేకపోయిందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైంది. దీనిపై బీజేపీ ప్రతిపక్ష ఇండియా కూటమిని హేళన చేసింది. సమస్యలు, నిర్ణయాల్లో జాప్యాలు కొనసాగాయి. అయితే మీడియాలో విమర్శలు రావడంతో కాంగ్రెస్ పార్టీ సత్వరం స్పందించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇండియా కూటమి ఆశలు సజీవంగా నిలిచాయి. 
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్:   ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హైకమాండ్​, సమాజ్​వాది పార్టీ చీఫ్​ అఖిలేశ్​యాదవ్ మధ్య  ఒక అంగీకారం కుదిరింది. ఉత్తరప్రదేశ్‌‌లో 63 మంది ఎంపీలు, మధ్యప్రదేశ్‌‌లో ఒక ఎంపీ నియోజకవర్గంలో అఖిలేష్ యాదవ్ సమాజ్ వాది పార్టీ  పోటీ చేయనుంది. మిగిలిన చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇది ఐక్యత సాధించిన ప్రధాన విజయం.

ఢిల్లీ :  అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్​, కాంగ్రెస్ 2012 నుంచి రాజకీయంగా బద్ద శత్రువులు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదరింది. ఢిల్లీలో ఆప్​ 4 ఎంపీ  స్థానాల్లో, కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 

పంజాబ్: పంజాబ్‌‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​, కాంగ్రెస్‌‌లకు 85% ఓట్లు వచ్చినందున, పంజాబ్​లో అన్ని పార్లమెంటు స్థానాలన్నీ కైవసం చేసుకుంటామని వారు విడివిడిగా పోటీ చేయడానికి అంగీకరించారు. పంజాబ్‌‌కు ఇది మంచి ఫార్ములా అని చెప్పవచ్చు.

బిహార్, తమిళనాడు:  లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ,  కాంగ్రెస్ ఇప్పటికే మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య పూర్తి అవగాహన ఉన్నందున అస్సలు సమస్య లేదు. అదేవిధంగా, తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ చాలాకాలం నుంచి మిత్రపక్షంగా ఉంటున్నాయి.

మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే సారథిగా ఉన్న శివసేన (యూబీటీ), శరద్ పవార్‌‌లతో కాంగ్రెస్ ఇప్పటికే పొత్తు పెట్టుకుంది. వారి మధ్య పూర్తి అవగాహన ఉంది.

పశ్చిమ బెంగాల్: బెంగాల్‌‌లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో మమతా బెనర్జీకు విభేదాలు ఉండటంతో కొంతమేరకు ఇరుపార్టీల మధ్య సమస్య ఉంది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి సమస్యను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. అసమ్మతి ఉన్నప్పటికీ మమతా బెనర్జీ తాను ఇండియా కూటమిలో భాగమని చెప్పారు. కాగా, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇండియా కూటమికి భాగస్వాములు లేనందున కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది.

కాంగ్రెస్‌‌పై ఇండియా కూటమి ప్రభావం

1952 పార్లమెంటు ఎన్నికల నుంచి కాంగ్రెస్ ప్రతిసారి దేశవ్యాప్తంగా కనీసం 450 మంది ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ 300 లోక్​సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. ఇది చాలా పెద్ద మార్పు. పోటీచేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ తన జాతీయ భౌగోళిక ఉనికిని  కోల్పోతుంది. అయితే ప్రాంతీయ పార్టీలతో ఐక్యం కావాలంటే కాంగ్రెస్‌‌కు మరో ప్రత్యామ్నాయం లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే చాలావరకు కేంద్రంలోని అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతర  ప్రతిపక్ష పార్టీలను చాలావరకు ఏకం చేసింది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలైన బీఎస్పీ, కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్​, వైఎస్ఆర్ జగన్ పార్టీ వైసీపీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీలు ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగం కాలేదన్నది నిజం. కనీసం 400 ఎంపీ స్థానాల్లో  ప్రతిపక్షాలు ఏకమై బలపరిచిన ఒకే అభ్యర్థితో ముఖాముఖి పోటీ చేయడం కాంగ్రెస్‌‌కు కలిసొచ్చే లాభం. ఇది బీజేపీకి పెద్ద సవాల్. ప్రతిపక్షాల ఇండియా కూటమిలోని ఆయా పార్టీల ఓటు బదిలీ కీలక అంశంగా మారనుంది. పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఓటు బదిలీ సామర్థ్యం చాలా కీలకం. 

 గత ఎన్నికల్లో ఇదే అతిపెద్ద సవాలు. ఉత్తరప్రదేశ్‌‌లో కాంగ్రెస్, అఖిలేశ్​ యాదవ్ పార్టీ ఎస్పీ, మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓటర్లకు రెండవ ఎంపిక బీజేపీ అవుతుంది. కూటమి ఓట్లు తమ అభ్యర్థికి బదిలీ కాకపోతే ఇండియా కూటమి ఫెయిల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్‌‌లో టీఎంసీ, కాంగ్రెస్‌‌, కమ్యూనిస్టుల ఓటర్లు రాజకీయంగా పెద్ద శత్రువులు. ఇక్కడ వారి  ఓటు బదిలీ సమస్య కావచ్చు. కానీ, ఇండియా అలయన్స్ సాధ్యమైనంత ఐక్యతను సాధించింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇది పెద్ద ముందడుగు. చైనీయులు చెప్పినట్లు.. సుదీర్ఘ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఇండియా కూటమి తన ప్రయాణంలో ఒక బలమైన  ముందడుగు వేసిందని చెప్పాలి.

- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​