ఢిల్లీలో ఇండియా కూటమి సేవ్ డెమోక్రసీ ర్యాలీ మార్చి 31న ఒకే వేదికపైకి ప్రతిపక్షాలు

ఢిల్లీలో ఇండియా కూటమి సేవ్ డెమోక్రసీ ర్యాలీ మార్చి 31న ఒకే వేదికపైకి ప్రతిపక్షాలు

ఢిల్లీలోని రాంలీలా మైదాన్‪లో భారీ ర్యాలీ చేపట్లనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ ప్రకటించింది. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా సేవ్ డెమోక్రసీ పేరుతో ఈ మెగా మార్చ్ నిర్వహిస్తామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు. ఆదివారం (మార్చి 24)న ఆప్‌ నేతలతో కలిసి కాంగ్రెస్‌, సీపీఎం నేతలు సంయుక్త నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చి 31న సేవ్ డెమోక్రసీ ర్యాలీ తీస్తామని మీడియాకు చెప్పారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తీరుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 

మార్చి 31న ఇండియా కూటమి మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని ఆయన తేల్చి చెప్పారు.  ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ కూడా బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాహుల్‌ గాంధీ యుద్ధం చేస్తున్నారని అందులో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు.