‘సిటిజన్‌షిప్‌’పై చల్లారని ఆందోళనలు

‘సిటిజన్‌షిప్‌’పై చల్లారని ఆందోళనలు
  • ఢిల్లీలో హింస
  • ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జ్‌
  • శాంతియుతంగా నిరసన తెలపాలని సీఎం కేజ్రీవాల్‌ పిలుపు
  • తమిళనాడు, కేరళలోనూ నిరసనలు

న్యూఢిల్లీ: సిటిజన్‌‌ షిప్‌‌ చట్ట వ్యతిరేక ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నాయి. నార్త్‌‌ఈస్ట్‌‌ ఢిల్లీలో మంగళవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.  శీలంపూర్‌‌‌‌లో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పోలీసుల వెహికిల్స్​ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రాళ్లు  విసరడంతో కొంతమంది పోలీసులకు దెబ్బలు తగిలాయని అధికారులు చెప్పారు. సీసీటీవీలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌‌ చేశారు. టియర్‌‌‌‌ గ్యాస్‌‌ ప్రయోగించారు. దాదాపు రెండున్నర గంటల తర్వాత పరిస్థితి అదుపు చేశామని పోలీసు అధికారి చెప్పారు.  విధ్వంసం నేపథ్యంలో శీలంపూర్‌‌‌‌లో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు,  ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు దాడి చేశారని, దెబ్బలు కూడా తగిలాయని ఆందోళనకారులు ఆరోపించారు. ఆందోళనలతో  7 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసేసిన అధికారులు, వాటిలో ‌‌‌‌ఐదు స్టేషన్లను తిరిగి తెరిచారు. ట్రాఫిక్‌‌ను కూడా డైవర్ట్‌‌ చేశారు. ఆందోళనలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ స్పందించారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.శీలంపూర్‌‌‌‌ ఎమ్మెల్యే హాజీ ఇష్రాక్  కూడా ఆందోళనకారులకు వీడియో మెసేజ్‌‌ పంపారు. “ శాంతియుతంగా నిరసన చేసి, మీ డిమాండ్లను తెలియజేయండి” అని  అన్నారు. యువత రోడ్లపైకి వచ్చి అల్లరి చేయొద్దని ఆప్‌‌ సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ సంజయ్‌‌ సింగ్‌‌ కోరారు.

జామియా యూనివర్సిటీలో 10 మంది అరెస్ట్‌‌‌‌

సిటిజన్‌‌‌‌ షిప్‌‌‌‌ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన ఆందోళనకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో స్టూడెంట్స్‌‌‌‌ ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. వీడియోలను పరిశీలించి వాటి ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పది మందిని విచారిస్తున్నామని, ఆందోళనల్లో పాల్గొన్న మరి కొంతమందిని గుర్తించే పనిలో ఉన్నట్టు అధికారులు చెప్పారు. సిటిజన్‌‌‌‌ షిప్‌‌‌‌ చట్టానికి వ్యతిరేకంగా  జామియాలో  స్టూడెంట్స్‌‌‌‌ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బస్సులు, పోలీసు బైకులను ధ్వంసం చేశారు. మంగళవారం కూడా  యూనివర్సిటీలో పరిస్థితి ఆందోళనకరంగా కనిపించింది. సిటిజన్​షిప్​ చట్టం,  ఎన్‌‌‌‌ఆర్సీకి వ్యతిరేకంగా  స్టూడెంట్స్‌‌‌‌, స్థానికులు ఆందోళన చేశారు. చలిని కూడా లెక్కచేయంకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. మరోవైపు యూపీలోని అలీగఢ్‌‌‌‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం అర్ధరాత్రి రిలీజ్‌‌‌‌ చేశారు. అరెస్టైన వారిలో 8 మంది స్టూడెంట్స్‌‌‌‌ ఉన్నారన్నారు. యూనివర్సిటీలో మంగళవారం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెప్పారు. హాస్టల్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ వెకేట్‌‌‌‌ చేసి వెళ్లిపోయారన్నారు. యూపీలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం ఆందోళనలు కొనసాగాయి.

జలియన్‌‌‌‌వాలా బాగ్‌‌‌‌ ఘటన గుర్తొచ్చింది: ఉద్ధవ్‌‌‌‌

ముంబై: జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పోలీసుల తీరు జలియన్‌‌‌‌ వాలా బాగ్‌‌‌‌ ఘటనను గుర్తు చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌‌‌ థాక్రే అన్నారు. “ సమాజంలో అశాంతి వాతావరణం క్రియేట్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. పోలీసులు యూనివర్సిటీలోకి వెళ్లి ఫైరింగ్‌‌‌‌ చేయడం జలియన్‌‌‌‌ వాలా బాగ్‌‌‌‌ సంఘటనను గుర్తు చేసింది. యువతను ఇబ్బంది పెట్టే ఏ దేశమూ సుస్థిరంగా ఉండదు” అని ఉద్ధవ్‌‌‌‌ అన్నారు.

42 యూనివర్సిటీల్లో పరిస్థితి ప్రశాంతం

న్యూఢిల్లీ: దేశంలోని 42 యూనివర్సిటీల్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ, యూపీలోని అలీగఢ్‌‌‌‌ యూనివర్సిటీల్లో మాత్రమే ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. కొన్ని యూనివర్సిటీల్లో క్యాండిల్‌‌‌‌ ర్యాలీలు, శాంతియుత ఆందోళన నిర్వహించారని చెప్పారు. జామియా వర్సిటీలో  జరిగిన ఆందోళనలపై హ్యూమన్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ డవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ మినిస్ట్రీకి  రిపోర్ట్​ అందిందని చెప్పారు.

ఫారిన్‌‌‌‌ వర్సిటీలకు తాకిన సెగ

జామియా, అలీగఢ్‌‌‌‌ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడాన్ని నిరిసిస్తూ హార్వర్డ్‌‌‌‌, ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ యూనివర్సిటీల్లో చదువుతున్న ఇండియన్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ నిరసనలు చేశారు. “ జామియా,  అలీగఢ్​ వర్సిటీల స్టూడెంట్స్‌‌‌‌పై పోలీసుల దాడులను ఖండిస్తున్నాం. పోలీసు ఫోర్స్‌‌‌‌ను వాడటం అంటే స్టూడెంట్స్ హక్కులను కాలరాయడమే. ఈ ఘటన షాక్‌‌‌‌కు గురి చేసింది” అని ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌, స్కాలర్స్‌‌‌‌, అల్యూమినీ జాయింట్‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చింది.

‘జామియా’ ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు.. జామియా మిలియా, అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ  స్టూడెంట్స్​పై పోలీసుల చర్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్​ చీఫ్​ సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకులు మంగళవారం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిశారు.  సిటిజన్​షిప్​ చట్టంపై  తమ నిరసనను రాష్ట్రపతికి తెలిపారు. ప్రెసిడెంట్​ను కలిసినవారిలో  గులామ్​ నబీ ఆజాద్​, సీపీఎం నేత సీతారాం ఏచూరి, డీఎంకే నాయకుడు  టీఆర్​బాలు, ఇతర నాయకులు ఉన్నారు.

కేరళలో బస్సులు ధ్వంసం

తిరువనంతపురం: సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ చట్టానికి వ్యతిరేకంగా కేరళలో మంగళవారం జరిగిన ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు బలవంతంగా షాపులను మూసేయించారు. ఆర్టీసి బస్సులపై రాళ్లు విసిరి డ్యామేజ్‌‌‌‌ చేశారు. ఈ ఘటనలో కొంత మంది ప్రయాణికులకు దెబ్బలు తగిలాయి. దీంతో 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆందోళకారులను చెదరగొట్టేందుకు వాటర్‌‌‌‌‌‌‌‌ కెనాన్లను ఉపయోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 ఇస్లామిక్‌‌‌‌ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. మహిళలు కూడా పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.

 

చెన్నైలో డీఎంకే ఆందోళన

చెన్నై: డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో నిరసనలు చేపట్టారు. చెన్నైలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ ఎంపీ కనిమొళి పాల్గొన్నారు. ఈ చట్టం మతాలపై వివక్ష చూపుతోందని, అందుకే శ్రీలంక తమిళులను మినహాయించిందని అన్నారు. ఈ చట్టం ముస్లింల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ప్రెసిడెంట్‌‌‌‌ స్టాలిన్‌‌‌‌ అన్నారు. బీజేపీ వాళ్లకి కావాల్సింది ఇండియా అభివృద్ధి కాదని, ముస్లింల హక్కులను లాక్కోవడమే అని విమర్శించారు. కేవలం ముస్లింలు, తమిళ రెఫ్యూజీలను మాత్రమే ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

ప్రజాస్వామ్యం… ఐసీయూలో: కమల్ హాసన్​

చెన్నై: మక్కల్‌‌‌‌ నీది మయ్యుమ్‌‌‌‌ (ఎంఎన్‌‌‌‌ఎం) పార్టీ చీఫ్‌‌‌‌, సినీనటుడు కమల్‌‌‌‌హాసన్‌‌‌‌ ఏఐఏడీఎంకే మీద ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యం ఐసీయూకి చేరిందని కామెంట్‌‌‌‌ చేశారు. “  స్టూడెంట్స్‌‌‌‌ రాజకీయాలను అర్థం చేసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. యువత రాజకీయాలపై అవగాహన పెంచుకుని ప్రశ్నిస్తే తప్పేంటి? వాళ్లను ఎందుకు అణిచి వేస్తున్నారు” అని అన్నారు.  సిటిజన్​షిప్​ చట్టం ఒక రాష్ట్రానికి పరిమితం కాదని, దానిపై దేశమంతటా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.  సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఎన్‌‌‌‌ఎమ్‌‌‌‌ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.