73 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కివీస్

73 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కివీస్

ఇప్పటికే సిరీస్‌‌ కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌‌లో న్యూజిలాండ్‌‌ను  వైట్‌‌వాష్‌‌ చేసింది.  కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ( 56) బ్యాటింగ్​ జోరుకు తోడు బౌలింగ్‌‌లో స్పిన్నర్‌‌ అక్షర్‌‌ పటేల్ రాణించడంతో ఆదివారం జరిగిన మూడో టీ20లో 73 రన్స్‌‌ తేడాతో కివీస్‌‌ను చిత్తుగా ఓడించింది. దాంతో, సిరీస్‌‌ను 3–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసి టెస్టులకు ముందు కాన్ఫిడెన్స్‌‌ పెంచుకుంది. ఫస్ట్​ బ్యాటింగ్​ చేసిన ఇండియా 20 ఓవర్లలో 184 రన్స్​ చేయగా చేజింగ్‌‌లో కివీస్‌‌ 17.2 ఓవర్లలో 111 రన్స్‌‌కే ఆలౌట్​ అయింది. 

కోల్‌‌కతా: టీమిండియా ఇరగదీసింది. టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫెయిల్యూర్‌‌ను మరిపించే పెర్ఫామెన్స్‌‌ చేసింది. ఫుల్​టైమ్​ కెప్టెన్​గా రోహిత్​ శర్మ  తన ఫస్ట్​ సిరీస్​లోనే క్లీన్​స్వీప్ విక్టరీ సాధించాడు. వరుసగా మూడో గెలుపుతో ఇండియా మూడు టీ20ల సిరీస్​లో​  న్యూజిలాండ్‌‌ను  వైట్‌‌వాష్‌‌ చేసింది.కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (31 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) మెరుపులకు తోడు బౌలింగ్‌‌లో స్పిన్నర్‌‌ అక్షర్‌‌ పటేల్ (3–0–9–3) చెలరేగడంతో ఆదివారం జరిగిన మూడో టీ20లో 73 రన్స్‌‌ తేడాతో కివీస్‌‌ను చిత్తుగా ఓడించింది. సిరీస్‌‌ను 3–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసి టెస్టులకు ముందు కాన్ఫిడెన్స్‌‌ పెంచుకుంది. ఈడెన్‌‌ గార్డెన్స్‌‌ వేదికగా జరిగిన ఈ పోరులో తొలుత ఇండియా 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. రోహిత్‌‌ పాటు ఓపెనర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ (29), మిడిలార్డర్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (25), వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (20), లాస్ట్‌‌లో దీపక్‌‌ చహర్‌‌ (8 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 21 నాటౌట్) రాణించారు. అనంతరం అక్షర్‌‌కు తోడు మిగతా బౌలర్లు కట్టడి చేయడంతో ఛేజింగ్‌‌లో కివీస్‌‌ 17.2 ఓవర్లలో 111 రన్స్‌‌కే కుప్పకూలి ఓడిపోయింది. ఓపెనర్‌‌ మార్టిన్‌‌ గప్టిల్‌‌ (36 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) మెరుపు ఫిఫ్టీ కొట్టినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అక్షర్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌, రోహిత్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌ అవార్డులు దక్కాయి.  3 ప్లస్‌‌ మ్యాచ్‌‌లున్న టీ20 సిరీస్‌‌లను అత్యధికంగా ఆరుసార్లు క్లీన్‌‌స్వీప్‌‌ చేసిన ఇండియా ఈ ఘనత సాధించిన పాకిస్తాన్‌‌ (6) రికార్డును సమం చేసింది.  

రోహిత్‌‌ ధనాధన్‌‌
తొలుత టాస్‌‌ నెగ్గిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ అనూహ్యంగా బ్యాటింగ్‌‌ ఎంచుకున్నాడు. తన నిర్ణయానికి న్యాయం చేస్తూ.. లోకేశ్‌‌ ప్లేస్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చిన యంగ్‌‌స్టర్‌‌ ఇషాన్‌‌తో కలిసి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (1/31) వేసిన ఫస్ట్‌‌ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, మిల్నే (1/47) బౌలింగ్‌‌లో ఇషాన్‌‌ రెండు ఫోర్లు బాదాడు. ఇద్దరి జోరుకు  పవర్‌‌ప్లేలోనే 69 రన్స్‌‌ వచ్చాయి. కానీ, పవర్‌‌ప్లే తర్వాత బౌలింగ్‌‌కు వచ్చిన శాంట్నర్‌‌ రెండు ఓవర్లలో ఇషాన్‌‌తో పాటు సూర్యకుమార్‌‌ (0), పంత్‌‌ (4)ను ఔట్‌‌ చేసి ఇండియా స్పీడుకు బ్రేక్‌‌లేశాడు. అయితే, శాంట్నర్‌‌ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్‌‌ ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకోవడంతో పాటు స్కోరు వంద దాటించాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే సోధీ (1/31)కి రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో శ్రేయస్‌‌ అయ్యర్‌‌, వెంకటేశ్‌‌ అయ్యర్‌‌  మంచి షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌‌ను ముందుకు నడిపించారు.  కానీ, మూడు బాల్స్‌‌ తేడాతో ఇద్దరూ ఔటవడంతో 140/6తో నిలిచిన ఇండియా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. అయితే, టెయిలెండర్లు హర్షల్‌‌ పటేల్‌‌ (18), దీపక్‌‌ చహర్‌‌  చివర్లో అనూహ్యంగా చెలరేగారు. ముఖ్యంగా మిల్నే వేసిన లాస్ట్‌‌ ఓవర్లో చహర్‌‌ 4,4, 6 సహా 19 రన్స్‌‌ రాబట్టి జట్టుకు భారీ స్కోరు అందించాడు. 

అక్షర్​ అదుర్స్​
ఛేజింగ్​లో వరుసగా వికెట్లు తీసిన ఇండియా బౌలర్లు ప్రత్యర్థిని దెబ్బమీద దెబ్బ కొట్టారు. మూడో ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన అక్షర్‌‌ ఐదు బాల్స్‌‌ తేడాలో ఓపెనర్‌‌ డారిల్‌‌ మిచెల్‌‌(5), మార్క్‌‌ చాప్‌‌మన్‌‌ (0)ను వెనక్కుపంపి కివీస్‌‌కు షాకిచ్చాడు. తన మరుసటి ఓవర్లోనే గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌ (0) డకౌట్‌‌ చేశాడు. ఈ దశలో గప్టిల్‌‌కు తోడైన టిమ్‌‌ సీఫర్ట్‌‌ (17) కాసేపు ప్రతిఘటించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌‌కు 31 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, 11వ ఓవర్లో గప్టిల్‌‌ను ఔట్‌‌ చేసిన చహల్‌‌ (1/26)ఈ జోడీని విడదీశాడు. అక్కడి నుంచి కివీస్‌‌ కోలుకోలేకపోయింది. తర్వాతి ఓవర్లో   సీఫర్ట్‌‌ రనౌటయ్యాడు. నీషమ్‌‌ (3)ను హర్షల్‌‌ (2/26) పెవిలియన్‌‌ చేర్చగా.. ఇషాన్‌‌ విసిరిన డైరెక్ట్‌‌ త్రోకు శాంట్నర్ (2) రనౌటయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌‌ల్లో బౌలింగ్‌‌ చేయని ఆల్‌‌రౌండర్‌‌ వెంకటేశ్‌‌ (1/12) ఈ పోరులో మూడు ఓవర్లు వేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఆడమ్‌‌ మిల్నే (7)ను ఔట్‌‌ చేసి ఇంటర్నేషన్‌‌ క్రికెట్‌‌లో ఫస్ట్ వికెట్‌‌ ఖాతాలో వేసుకున్నాడు. హర్షల్‌‌ బౌలింగ్‌‌లో ఇష్‌‌ సోధీ (9) వెనుదిరగ్గా.. రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఫెర్గూసన్‌‌ (14)... దీపక్‌‌ చహర్‌‌ (1/26)కు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇవ్వడంతో కివీస్‌‌ పోరాటం ముగిసింది.