వంట నూనె దిగుమతులు 16 శాతం తగ్గుదల.. గత నెల 15.48 లక్షల టన్నులకు పతనం

వంట నూనె దిగుమతులు 16 శాతం తగ్గుదల.. గత నెల 15.48 లక్షల టన్నులకు పతనం

న్యూఢిల్లీ: రిఫైన్డ్, క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల జులైలో మనదేశ వంట నూనె దిగుమతులు ఏడాది లెక్కన 16 శాతం తగ్గాయి. మొత్తం 15.48 లక్షల టన్నుల దిగుమతులు మాత్రమే జరిగాయని సాల్వెంట్ ఎక్స్‌‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఈఏ) తెలిపింది. గత సంవత్సరం ఇదే నెలలో దిగుమతులు 18,40,062 టన్నులుగా ఉన్నాయి. ఈ లెక్కల్లో నేపాల్ నుంచి జరిగిన దిగుమతులు లేవు.

రిఫైన్డ్ ఆయిల్ దిగుమతులు భారీగా తగ్గడానికి కారణం దిగుమతి సుంకం పెరగడమేనని ఎస్​ఈఏ పేర్కొంది. 2025 మే 31 నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ (సీపీఓ), రిఫైన్డ్ పామోలిన్ మధ్య దిగుమతి సుంకం తేడా 8.25 శాతం నుంచి 19.25 శాతానికి పెరిగింది. దీనితో రిఫైన్డ్ ఆయిల్ దిగుమతి లాభదాయకంగా లేకుండా పోయింది. ఫలితంగా, జులై 2025లో రిఫైన్డ్ పామోలిన్ దిగుమతులు 5వేల టన్నులకు పడిపోయాయి. అంతకు ముందు నెలలో ఇది 1.63 లక్షల టన్నులు, జులై 2024లో 1.36 లక్షల టన్నులుగా ఉంది.

"దిగుమతి సుంకం తేడాను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైందే!  ఇది రిఫైన్డ్ పామోలిన్ దిగుమతిని తగ్గించి, దేశీయ రిఫైనింగ్ రంగానికి మేలు చేస్తోంది. అలాగే, డిమాండ్‌‌ను క్రూడాయిల్ వైపు మళ్లిస్తోంది" అని ఎస్​ఈఏ తెలిపింది. జూలై 2025లో క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులు కూడా గత సంవత్సరం ఇదే నెలలో 9,36,876 టన్నుల నుంచి 8,50,695 టన్నులకు తగ్గాయి.  క్రూడ్ సన్​ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 3,66,541 టన్నుల నుంచి 2,00,010 టన్నులకు తగ్గాయి. భారతదేశం పామ్ ఆయిల్​ను ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది.

ఇతర నూనెల దిగుమతుల్లోనూ పతనం
తినదగినవి కాని నూనెల దిగుమతులు కూడా 55,014 టన్నుల నుంచి 31వేల టన్నులకు తగ్గాయి. మొత్తం కూరగాయల నూనెల (తినదగినవి, తినదగినవి కానివి) దిగుమతులు గత నెలలో 17 శాతం తగ్గి 15,79,041 టన్నులకు చేరుకున్నాయి. ఇది 2024లో ఇదే నెలలో 18,95,076 టన్నులుగా ఉంది. నవంబర్ 2024లో ప్రారంభమైన ప్రస్తుత ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో, మొత్తం కూరగాయల నూనెల దిగుమతులు 110.13 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఇది 121.24 లక్షల టన్నులుగా ఉంది, అంటే 9 శాతం తక్కువ.

వంట నూనెల దిగుమతులు 119.35 లక్షల టన్నుల నుంచి 107.56 లక్షల టన్నులకు తగ్గాయి. అయితే, తినదగినవి కాని నూనెల దిగుమతులు 1.88 లక్షల టన్నుల నుంచి 2.57 లక్షల టన్నులకు పెరిగాయి. ఎస్ఏఎఫ్టీఏ ఒప్పందం కింద, నేపాల్ భారతదేశానికి ఎక్కువగా రిఫైన్డ్ సోయాబీన్, సన్​ఫ్లవర్ ఆయిల్, తక్కువ మొత్తంలో ఆర్బీడీ పామోలిన్, రేప్‌‌సీడ్ ఆయిల్​ను సున్నా సుంకంతో ఎగుమతి చేసింది. నవంబర్ 2024 నుంచి జూన్ 2025 వరకు నేపాల్ నుంచి 5.21 లక్షల టన్నుల దిగుమతులు జరిగాయి.