ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్ లకు కేంద్రం నోటీసులు

ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్ లకు కేంద్రం నోటీసులు

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఇటీవల X, యూట్యూబ్, టెలిగ్రామ్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్(CSAM) ఉంటే వెంటనే తీసివేయమని వారికి సూచించింది. ఈ సందర్భంగా ఆయా ప్లాట్ ఫారమ్స్ కు నోటీసులు జారీ చేసింది.

ఇంటర్నెట్ లోని వారి ప్లాట్ ఫారమ్ ల నుంచి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటియల్(CSAM) లాంటిది ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని కేంద్రం హెచ్చరించింది. భవిష్యత్తులో కంటెంట్ నియంత్రణ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను అమలు చేయాలని కూడా నొక్కిచెప్పింది. ఐటీ నిబంధనల ప్రకారం సురక్షితమైన, విశ్వసనీయమైన ఇంటర్నెట్ ను రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా మధ్యవర్తులు తమ ప్లాట్‌ఫారమ్‌లలో క్రిమినల్ లేదా హానికరమైన పోస్ట్‌లను నిషేధించే ఐటి చట్టంలో నిర్దేశించిన కఠినమైన అంచనాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. వాటిని ఉల్లంఘిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 79ప్రకారం, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.