టెర్రరిస్టులు ఎక్కడికి పారిపోయినా.. వేటాడి చంపుతున్నాం : మోదీ

టెర్రరిస్టులు ఎక్కడికి పారిపోయినా.. వేటాడి చంపుతున్నాం : మోదీ

 

  • వాళ్ల అడ్డాలోకి దూరి మరీ హతమారుస్తున్నం
  • వార్ జోన్ లోనూ భద్రతకు గ్యారంటీ ఇచ్చాం
  • ఉత్తరాఖండ్‌‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని కామెంట్

డెహ్రాడూన్/జైపూర్/న్యూఢిల్లీ:  టెర్రరిస్టులు ఎక్కడకు పారిపోయినా వదలబోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాళ్ల అడ్డాలోకి దూరి మరీ చంపుతామని ఆయన స్పష్టం చేశారు. యూరీ సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్ ఎయిర్  స్ట్రయిక్సే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్ లోని రిషికేశ్   లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. తమ పదేండ్ల పాలనలో ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశామన్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చామని, అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఉన్నపుడు శత్రువులు, టెర్రరిస్టులు దాన్ని అలుసుగా తీసుకొని దేశంపై దాడులకు దిగేవారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.‘‘కాంగ్రెస్  హయాంలో మన సైనికులకు కనీసం బుల్లెట్ ప్రూఫ్​జాకెట్లు కూడా లేకుండె. శత్రువుల బుల్లెట్ల నుంచి వారిని కాపాడేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చిన ఘనత మా బీజేపీ ప్రభుత్వానిదే. ఈ రోజు మోడ్రన్ రైఫిళ్ల నుంచి ఫైటర్ ప్లేన్ల వరకు ప్రతీదీ దేశంలోనే తయారవుతున్నది” అని మోదీ పేర్కొన్నారు. రాముడి ఉనికిని కాంగ్రెస్  ప్రశ్నించిందని, అయోధ్య రామ మందిరాన్ని కూడా వ్యతిరేకించిందని ఆయన విమర్శించారు. మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ ను ఆహ్వానించామన్నారు. అంతటితో ఆగకుండా హిందూ దేవతలకు ప్రతిరూపమైన శక్తిపై యుద్ధం చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారని మోదీ ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐదు లోక్ సభ సీట్లకు ఈ నెల 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు

తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ లోని కరౌలీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోనూ  ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అవినీతిపరులపై మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అవినీతిపరులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందువల్లే తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘అవినీతిని నిర్మూలించాలని చెప్పే మోదీ ఒక వైపు. అవినీతిపరులను కాపాడాలని చెప్పే వారు మరోవైపు. వారందరూ కలిసి అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారిని నేనొకటే హెచ్చరిస్తున్నా. నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు. ఇది మోదీ గ్యారంటీ” అని ఆయన వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన అంటూ కాంగ్రెస్  పార్టీ దశాబ్దాల పాటు కాలయాపన చేసిందని, వాస్తవానికి 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చింది తమ ప్రభుత్వమేనని మోదీ అన్నారు.

గేమర్లతో మోదీ ఇంటరాక్షన్

టాప్  ఇండియన్  గేమర్లతో ప్రధాని  మోదీ గురువారం ఇంటరాక్ట్  అయ్యారు. గేమింగ్  ఇండస్ట్రీకి సంబంధించిన  అంశాలపై వారితో చర్చించారు. ఈ వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ  ట్విట్టర్ లో షేర్ చేశారు. గేమింగ్  ఇండస్ట్రీలో వస్తున్న కొత్త పరిణామాలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు. దేశంలో గేమింగ్  పరిశ్రమను ప్రోత్సహిస్తున్న గేమర్ల క్రియేటివిటీని మోదీ సర్కారు గుర్తించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఇండియన్  గేమర్లు తీర్థ మెహతా, పాయల్  ధరే, అనిమేష్​  అగర్వాల్, అన్షూ బిస్త్, నమన్  మాథుర్, మిథిలేష్​ పాటంకర్, గణేష్  గంగాధర్ తో మోదీ పీసీ, వీఆర్  గేమ్స్  ఆడారని అమిత్ మాలవీయ వివరించారు.