Asian Games 2023: కుర్రోళ్లు అదరగొట్టారు : చైనా గడ్డపై గోల్డ్ కొట్టిన భారత క్రికెట్ జట్టు

Asian Games 2023: కుర్రోళ్లు అదరగొట్టారు : చైనా గడ్డపై గోల్డ్ కొట్టిన భారత క్రికెట్ జట్టు

గోల్డ్ మెడల్ లక్ష్యంగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత యువ క్రికెట్ జట్టు ఆ లక్ష్యాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ పై గోల్డ్ మెడల్ గెలిచి చైనా గడ్డపై భారత జెండాను రెపరెపలాడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన  ఆఫ్ఘనిస్తాన్ జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. 

అయితే వర్షం భారీగా కురవడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించలేదు. దీంతో మ్యాచుని రద్దు చేసి భారత్ ని విజేతగా ప్రకటించారు. భారత్ టాప్ సీడ్ గా ఉండడమే దీనికి కారణం. ఈ విజయంతో తొలిసారి ఆసియా క్రీడల్లోకి వెళ్లి గోల్డ్ మెడల్ గెలిచిన జట్టుగా భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రుతురాజ్ గైక్వాడ్ తొలి ప్రయత్నంలోనే భారత్ కి గోల్డ్ మెడల్ అందించి భవిష్యత్తు కెప్టెన్ గా కితాబులందుకుంటున్నాడు. కాగా.. కొన్ని రోజుల క్రితం ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు కూడా క్రికెట్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచారు.    

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ ప్రారంభం నుంచి టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఏ దశలోనూ అఫ్గాన్ భారీ స్కోర్ చేసే దిశగా కనిపించలేదు. అఫ్గాన్ బ్యాటర్లలో షహీదుల్లా కమల్ ఒక్కడే 49 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. కమల్ కి నైబ్ (27) చక్కని సహకారం అందించాడు. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, షాబాజ్ అహ్మద్, శివమ్ దూబే తలో వికెట్ తీసుకున్నారు.