
హాంగ్జౌ: ఆసియా గేమ్స్ అథ్లెటిక్స్‌లో ఇండియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు మంగళవారం ఒక్క రోజే పతకాల ‘సిక్సర్’ కొట్టారు. విమెన్స్ జావెలిన్ త్రోలో అన్ను రాణి, 5 వేల మీటర్ల రేస్‌లో పారుల్ చౌదరి గోల్డ్ మెడల్స్‌తో కొత్త చరిత్ర సృష్టించారు. మిగతా విభాగాల్లో మహ్మద్ అఫ్సల్ పులిక్కలకత్, తేజస్విన్ శంకర్ సిల్వర్ పూలు పూయించగా, విత్య, ప్రవీణ్ కాంస్యాలు సాధించారు. మంగళవారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో 31 ఏళ్ల అన్ను నాలుగో ప్రయత్నంలో ఈటెను 62.92 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచింది.
దీంతో గేమ్స్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ సాధించిన ఇండియా తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. 2014లో అన్ను బ్రాంజ్ నెగ్గింది. ఇంతకుముందు బార్బారా వెబ్‌స్టర్ (1951 బ్రాంజ్), ఎలిజబెత్ డెవెన్‌పోర్ట్ (1962 బ్రాంజ్), గుర్మిత్ కౌర్ (1998 బ్రాంజ్) ఆసియా గేమ్స్‌లో మెడల్స్ గెలిచారు. ఇక 5 వేల మీటర్ల ఫైనల్లో పారుల్ 15:14.75 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణాన్ని నెగ్గింది. ఇండియా తరఫున ఈ ఘనత సాధించి తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్‌లో 3 వేల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ నెగ్గిన సిల్వర్‌కు తోడుగా గోల్డ్ వచ్చింది. గతంలో 5 వేల మీటర్లలో సునీతా రాణి (సిల్వర్ 1998, బ్రాంజ్ 2002), ఓపీ జైషా (బ్రాంజ్ 2006), ప్రీతి శ్రీధరన్ (సిల్వర్ 2010), కవితా రౌత్ (బ్రాంజ్ 2010) మెడల్స్ సాధించారు.
మెన్స్ డెకథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ నేషనల్ రికార్డును నెలకొల్పి 7666 పాయింట్లతో సిల్వర్‌ను నెగ్గాడు. 1500 మీటర్లలో నాలుగో ప్లేస్‌లో నిలిచినా మిగతా వాటిలో రాణించాడు. 1974 తర్వాత డెకథ్లాన్‌లో మెడల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా శంకర్ రికార్డు సృష్టించాడు. మెన్స్ 800 మీటర్ల రేస్‌ను 1:48.42 సెకన్లలో ముగించిన అఫ్సల్ సిల్వర్ మెడల్‌ను సాధించాడు.
విమెన్స్ 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య రామరాజ్ 55.68 సెకన్ల టైమింగ్‌తో బ్రాంజ్ గెలిచింది. మెన్స్ ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ 16.68 మీటర్ల దూరం దూకి మూడో ప్లేస్‌తో సిల్వర్ నెగ్గాడు. తాజాగా 2 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్‌తో అథ్లెటిక్స్‌లో ఇండియా పతకాల సంఖ్య 22 (4 గోల్డ్, 10 సిల్వర్, 8 బ్రాంజ్)కు చేరింది. దీంతో 2018 ఎడిషన్‌లో నెగ్గిన 20 మెడల్స్ రికార్డును అధిగమించారు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఆసియా గేమ్స్‌లో ఇండియా 69 (15 గోల్డ్, 26 సిల్వర్, 28 బ్రాంజ్) మెడల్స్‌తో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నది.