పసుపు ఉత్పత్తి, వినియోగంలో భారత్లోనే ఎక్కువ

పసుపు ఉత్పత్తి, వినియోగంలో భారత్లోనే ఎక్కువ

పసుపు ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో భారత దేశం(82 శాతం) అగ్రగామి.  చైనాలో మన ఉత్పత్తిలో10 శాతం కూడా ఉండదు. పసుపు ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ది ఒకప్పుడు దేశంలో మొదటి స్థానం. అప్పట్లోనే దాదాపు 60 శాతం ఒకే రాష్ట్రంలో పండిస్తున్నా, స్థానికంగా గానీ, దేశంలో గానీ సరైన గుర్తింపు రాలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ 40 శాతం పండిస్తారు. 2017-–18లో దేశంలో మొత్తం పసుపు ఉత్పత్తి 9,46,650 టన్నులు కాగా, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు(అపెడా) అత్యధికంగా ఉత్పత్తి చేశాయి. పసుపు రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ధర కొన్నేండ్లుగా రూ.7 వేలు దాటుతలేదు. ఒకప్పుడు క్వింటాలుకు రూ.16 వేలు పలికిన పసుపు దారుణంగా రూ.5,500కు పడిపోతున్నది. మూడు రోజుల క్రితం 87 మార్కెట్లలో పసుపు సగటు ధర క్వింటాలుకు రూ.6,437. నిజామాబాద్ లో క్వింటాలుకు రూ.3,550 అతి తక్కువ ధర ఉంటే, బెంగళూరు మార్కెట్ లో క్వింటాలుకు రూ.13,500 ఉంది. సాగు ఖర్చు ఎకరాకు రూ.లక్ష దాటింది. ఖర్చులు పెరుగుతున్నా, డిమాండ్ ఉన్నా మార్కెట్​లో సరైన ధర వస్తలేదు. బ్యాంకు రుణాలు ఖర్చు మేరకు, అందరికి వస్తలేవు. ప్రైవేటు అప్పుల మీద రైతులు పంట పండిస్తున్నారు.

దిగుమతులు తగ్గాలి..

మన దగ్గర గణనీయమైన పసుపు ఉత్పత్తి ఉన్నప్పటికీ, భారతదేశం 2018-–19లో 43.48 మిలియన్ డాలర్ల విలువైన పసుపును దిగుమతి చేసుకుంది. గత కొన్నేండ్లుగా పసుపు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న దిగుమతుల వల్ల పసుపు రైతుల ప్రయోజనాల మీద దెబ్బ పడుతున్నది. విధానపర జోక్యం ద్వారా పరిష్కరించాల్సిన కీలకమైన సమస్య ఇది. నాణ్యమైన పసుపును కిలో రూ.117కు ఎగుమతి చేసి, రూ.87కు దిగుమతి చేసుకుంటోంది. ఈ రూ.30 వ్యత్యాసం పసుపు రైతును ఒత్తిడికి గురిచేస్తున్నది. వేగంగా పెరుగుతున్న దిగుమతుల వల్ల భవిష్యత్తులో మంచి ధర వచ్చే అవకాశం లేదు. ఇదే కొనసాగితే పసుపు సాగు తగ్గుతుంది. అంతర్జాతీయంగా పసుపులో మనం ఉన్న శిఖర స్థానం కోల్పోతున్నాం. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలూడుగి చూస్తున్నాయి. భారత్ పసుపు దిగుమతులకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. 

ఒకటి, దేశీయ, అంతర్జాతీయ పసుపు మధ్య ఉండే ధర వ్యత్యాసం. రెండవది, పసుపులో కర్కుమిన్, ముదురు పసుపు రంగు, ఒలియోరెసిన్, ముఖ్యమైన నూనె మొదలైన వాటి శాతం. మూడవది, వాతావరణ పరిస్థితుల బట్టి పసుపు దిగుబడిలో వచ్చే మార్పులు. నాలుగవది, భారత దేశంలో వినియోగం ఎక్కువగా ఉన్నా, నాణ్యత మీద, అందులోని కుర్కుమిన్ తదితర పదార్థాల మీద ప్రమాణాలపై, నియంత్రణపై అవగాహన లేకపోవడం. పసుపు నాణ్యత మీద దృష్టి పెట్టే నియంత్రణ వ్యవస్థ లేకపోవటం నష్టం కలిగిస్తున్నది. ఓ అంచనా ప్రకారం వినియోగదారుడు చెల్లించే కిలో రూ.240లో 29 శాతం మాత్రమే పసుపు రైతుకు అందుతున్నది.  అదే అమూల్ పాల విక్రయంలో రైతుకు దాదాపు 80 శాతం లభిస్తున్నది.  పసుపు రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంలో వ్యవస్థీకృత సమస్యలు ఉన్నాయి. పసుపు రైతులను సంఘటిత పరిచే సహకార సంఘాలు, కంపెనీ, ప్రభుత్వ శాఖ, సంస్థ గానీ క్షేత్ర స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణం. సుగంధ ద్రవ్యాల బోర్డు ఉన్నా, పని భారం వల్ల, నిధుల లేమి వల్ల పసుపునకు వారి విధుల్లో అంతగా ప్రాధాన్యత లేదు. ఇదేమి పాలన? అధికారంలో ఉన్న నాయకులకు పసుపు పట్ల, పసుపు రైతుల పట్ల కనీస జ్ఞానం, ఆలోచన లేదు. 

రైతుల మేలుకు చర్యలు

పసుపు ఒక వ్యవసాయ ఉత్పత్తిగా, పారిశ్రామిక ముడి పదార్థంగా, నిత్యావసరంగా గుర్తించి తగిన నాణ్యతా ప్రమాణాలు, వాణిజ్యం పెరుగుదల, నియంత్రిత వ్యవస్థ కోసం కేంద్ర స్థాయిలో కీలక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. పసుపు రైతు ప్రయోజనాలు కాపాడితేనే పసుపు ఉత్పత్తి, దిగుబడి పెరుగుతుంది. పసుపు వల్ల రైతుకు ప్రయోజనం ఉండాలంటే కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.15,000 వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏటా పసుపు కనీస మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. పసుపు పంట వల్ల నీటి వనరుల మీద, సారవంతమైన నేలల మీద దుష్ప్రభావం ఉండదు. అందుబాటులో ఉన్న 300 పసుపు రకాల మీద పరిశోధనలు చేస్తూ, కుర్కుమిన్, ఒలియోరేసిన్ శాతం పెంచే విధంగా అధ్యయనాలు చేయాల్సిందిగా సైంటిస్టులను ప్రోత్సహించాలి. అధిక దిగుబడి నిచ్చే, మార్కెట్ అవసరాలకు సరిపోయే విత్తన రకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైనంత సాయం అందించాలి. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ పరిధిలో ఉన్న ఎగుమతి ప్రోత్సాహక పథకాలు, తద్వారా నిధులు, తెలంగాణలో వాడేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించి లక్ష్యం పూర్తయ్యే వరకు చర్యలు చేపట్టాలి.

పరిశోధనలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి..

పసుపు పంట మీద పరిశోధన చేసే శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేవు. వ్యవసాయ పరిశోధనలు లేక, సొంతంగా పరిశోధన చేసే పసుపు రైతులకు ప్రోత్సాహం లేక, పసుపు రకాల్లో కృషి తగ్గిపోతున్నది. పసుపు రైతులకు స్వయం సహాయక బృందాల ద్వారా, లేదా సహకార సంఘాల ద్వారా, లేదా జిల్లా సహకార బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి లోన్లు ఇయ్యాలి. పసుపు పంటపై చేసే ఖర్చులను బట్టి ప్రతి ఎకరాకు పంట రుణ పరిమాణం ఖరారు చేయాలి. పసుపు రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే ప్రతి గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణలో కనీసం రెండు ప్రత్యేక పసుపు మార్కెట్ యార్డులు పెట్టాలి. కేంద్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు అవసరమైనవి, అనుగుణంగా ఉండేవి, పసుపు రైతులకు కూడా వర్తింప జేయాలి. రైతులు సేంద్రియ పద్ధతులు పాటించే విధంగా వ్యవసాయ విస్తరణ, పరిశోధన వ్యవస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ప్రధాన మంత్రి భీమా యోజన పసుపు రైతులకు కూడా వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా, పార్లమెంటు సభ్యుల ద్వారా కృషి చేయాలి. రాష్ట్ర స్థూల వ్యవసాయ ఆదాయంలో పసుపు ఉత్పత్తి, వ్యాపారం పొందుపరచాలి. ఏటా రాష్ట్ర వ్యవసాయ శాఖ సేకరించే సమాచారంలో పసుపునకు ప్రత్యేక పేజీ కేటాయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు పంట ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేయాలి. పసుపు పరిశోధన కేంద్రం బలోపేతం చేసి, నిధులు ఇవ్వాలి.

అంతర్జాతీయంగా డిమాండ్

రోగనిరోధక శక్తి పెంచే గుణం ఉండటంతో పసుపుకు మిడిల్ ఈస్ట్, అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా దేశాల నుంచి బాగా డిమాండ్ ​ఉంది. గత కొంత కాలంగా ఎగుమతుల పెరుగుదలకు అమెరికా, యూఏఈ, ఇరాన్, మొరాకో నుంచి బలమైన డిమాండ్ ఉండటమే కారణం. ఏండ్ల నుంచి మన దేశం పసుపు ఎగుమతిలో మొదటి స్థానంలో ఉన్నది. పసుపును ఆహారంలో రంగుగా వాడుతున్నారు. పసుపుకు వైద్యంలో మంచి స్థానం ఉంది. క్యాన్సర్, యాంటీ వైరల్, రోగ నిరోధక శక్తిని పెంచడంలో పసుపు మందుగా ఉపయోగ పడుతున్నది. పసుపు నుంచి కుర్కుమిన్ తీసే మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్(బ్లెండింగ్) పరిశ్రమలు, ఫార్మా, సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలు పసుపును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. 

మారుతున్న పంట ఉత్పత్తి

మహారాష్ట్రలో పసుపు ఉత్పత్తి పెరుగుతున్నది, తెలంగాణలో తగ్గుతున్నది. తెలంగాణాలో 2019-–20లో 386 వేల టన్నులు ఉత్పత్తి కాగా, 2021-–22 అంచనాల ప్రకారం 330 వేల టన్నులకు పడిపోయింది. అదే కాలంలో మహారాష్ట్రలో 219 వేల టన్నుల నుంచి 368 వేల టన్నులకు పెరిగింది. తెలంగాణ మొట్టమొదటిసారి పసుపు ఉత్పత్తిలో రెండో స్థానానికి పడిపోయింది. ఎప్పటి నుంచో 2020–-21 వరకు భారతదేశంలో పసుపు ఉత్పత్తి చేసే మొదటి ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. పసుపు రైతు మార్కెట్లో ధరల హెచ్చు తగ్గుల మాయాజాలంలో నష్టపోతున్నాడు. కమోడిటీ ఫ్యూచర్స్ పసుపు ధరలను నిర్ణయిస్తుంది. ఎగుమతిదారులు, పసుపు ప్రాసెసింగ్ పరిశ్రమ తమ లాభాలను చూసుకుంటున్నారు. ఎన్సీడీఈఎక్స్ (నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్), బీఎస్ఈలో పసుపు ఫ్యూచర్స్ ట్రేడింగ్​ను నిషేధించాలని మరాఠ్వాడా విదర్భ పసుపు ట్రేడ్ అసోసియేషన్ 2022 లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. - డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్