మనోడికి అన్యాయం.. కారణం లేకుండా హనుమ విహారిపై వేటు

మనోడికి అన్యాయం.. కారణం లేకుండా హనుమ విహారిపై వేటు
  • కివీస్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌కు ఎంపిక చేయని సెలక్టర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  టెస్టులనే నమ్ముకున్న తెలుగు క్రికెటర్‌‌‌‌, హైదరాబాదీ హనుమ విహారికి అన్యాయం జరిగింది. ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌ నుంచి విహారిని తొలగించారు. న్యూజిలాండ్‌‌‌‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో పోటీపడే ఇండియా టీమ్‌‌‌‌లో తనకు చోటు దక్కలేదు. నేషనల్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిటీ ఎలాంటి కారణం చెప్పకుండా, కనీసం వివరణ కూడా ఇవ్వకుండా అతనిపై వేటు వేసింది.  గత ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో సిడ్నీ టెస్టులో విహారి వీరోచిత ఇన్నింగ్స్‌‌‌‌తో ఇండియాను కాపాడాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్నప్పటికీ అశ్విన్‌‌‌‌తో కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేసి టీమ్‌‌‌‌కు ఓటమి తప్పించాడు. దాంతో, సిడ్నీ టెస్ట్‌‌‌‌ హీరో అంటూ తనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. సిడ్నీలో అయిన గాయం వల్లే ఆ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌కు విహారి దూరమయ్యాడు. తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు సెలక్ట్‌‌‌‌ అయినా..వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తప్పిస్తే నాలుగు టెస్టుల్లో తనకు చాన్స్‌‌‌‌ రాలేదు. ఈ లెక్కన ఫామ్‌‌‌‌ ఆధారంగా తనపై వేటు వేశారన్న వాదన సరైంది కాదని చెప్పొచ్చు. అదే టైమ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ను ఉన్నట్టుండి టెస్టు టీమ్‌‌‌‌లోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడి మూడేళ్లు కావస్తోంది. మొన్నటి ఐపీఎల్‌‌‌‌లోనూ ఏ మాత్రం ఆకట్టుకోలేదు.  పైగా, విహారి ఆల్ట్రా డిఫెన్స్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ స్టైల్‌‌‌‌ రహానె, పుజారా మాదిరిగా ఉంటుందని, మిడిలార్డర్‌‌‌‌లో వైవిధ్యం కోసం అయ్యర్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇచ్చారని సెలక్షన్‌‌‌‌ కమిటీ సన్నిహిత వర్గాల వాదనలోనూ పస లేదు. ఇప్పటికే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేని హార్దిక్‌‌‌‌ పాండ్యాను టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆడించి చేతులు కాల్చుకున్న  చేతన్‌‌‌‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్​ కమిటీ ఇప్పుడు విహారిని టెస్టుల నుంచి  తప్పించి విమర్శలు ఎదుర్కొంటోంది. నష్ట నివారణలో భాగంగా ఈ నెలలో సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు వెళ్లే ఇండియా---–-ఎ టీమ్‌‌‌‌లో విహారిని చేర్చినట్టు ప్రకటించింది. కానీ, తెలుగు క్రికెటర్‌‌‌‌ ఇప్పటికే  ఇండియా-–ఎ టీమ్‌‌‌‌కు దాదాపు రెండేళ్లు కెప్టెన్‌‌‌‌గా పని చేశాడు. ఒకవేళ విహారిని సౌతాఫ్రికా పంపాలని ముందుగానే భావిస్తే.. మూడు రోజుల కిందట సెలక్ట్‌‌‌‌ చేసిన టీమ్‌‌‌‌లోనే తన పేరు ఉండాలి.  కానీ, ఇప్పుడు చేర్చి సెలక్టర్లు తమ తప్పును అంగీకరించారని అనొచ్చు. 

బ్యాట్‌‌‌‌తోనే సమాధానం చెప్పాలె..

ఓపెనర్‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గానే కాకుండా పార్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గానూ సత్తా చాటుతున్న విహారి విషయంలో సెలక్టర్లు, టీమ్​ మేనేజ్​మెంట్​తీరు సరిగ్గా లేదు. బాగానే ఆడుతున్నా  అతడిని పక్కనబెడుతున్నారు. గతంలో  వెస్టిండీస్‌‌‌‌ టూర్‌‌‌‌లో విహారి నాలుగు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 32, 93, 111, 53 నాటౌట్‌‌‌‌.. స్కోర్లు చేసిప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌గా నిలిచాడు. తన వల్లే  విండీస్‌‌‌‌ గడ్డపై ఇండియా తొలి టెస్టు సిరీస్‌‌‌‌ నెగ్గింది. కానీ వెంటనే సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఐదుగురు బౌలర్ల ప్లాన్‌‌‌‌ కోసం తనను విస్మరించారు. వచ్చే నెలలో సౌతాఫ్రికా టూర్‌‌‌‌ ఉన్న నేపథ్యంలో ఇండియా–ఎ టీమ్‌‌‌‌ తరఫున సత్తా చాటితే విహారి మళ్లీ టీమ్‌‌‌‌లోకి రావొచ్చు. తనను విస్మరించిన సెలక్టర్లకు విహారి ఇప్పుడు బ్యాట్​తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

భరత్‌‌‌‌కు పిలుపు.. ఫస్ట్​ టెస్టులో రహానెకు కెప్టెన్సీ

ఆంధ్ర వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ శ్రీకర్‌‌‌‌ భరత్‌‌‌‌కు  నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌ నుంచి పిలుపొచ్చింది. అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌‌‌‌గా ఆడుతున్న రోహిత్‌‌‌‌ శర్మ, జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌‌‌‌ షమీ,రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌కు   సెలక్టర్లు రెస్ట్‌‌‌‌ ఇచ్చారు. పంత్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో భరత్‌‌‌‌ను తీసుకున్నారు. నవంబర్‌‌‌‌ 25-–డిసెంబర్‌‌‌‌ 7 మధ్య  కాన్పూర్‌‌‌‌, ముంబై వేదికలుగా కివీస్‌‌‌‌తో జరిగే రెండు టెస్టుల కోసం శుక్రవారం 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.  రెగ్యులర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ ఈ సిరీస్‌‌‌‌లో రెండో టెస్ట్‌‌‌‌కు జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.  ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌‌‌‌లో రహానె జట్టును నడిపించనుండగా చతేశ్వర్‌‌‌‌ పుజారా వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తాడు. హనుమ విహారిపై వేటు వేసిన సెలక్టర్లు.. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌కు అవకాశమిచ్చారు.  అశ్విన్​, జడేజా, అక్షర్​ ఉన్నప్పటికీ మరో స్పిన్నర్​  జయంత్​ యాదవ్​ను తీసుకున్నారు. ప్రసీద్‌‌‌‌ కృష్ణ నాలుగో పేసర్‌‌‌‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌: అజింక్యా రహానె(కెప్టెన్‌‌‌‌), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, చతేశ్వర్‌‌‌‌ పుజారా(వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, వృద్ధిమాన్‌‌‌‌ సాహా, కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, జయంత్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఇషాంత్‌‌‌‌ శర్మ, ఉమేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, ప్రసీద్‌‌‌‌ కృష్ణ.