పాకిస్తాన్‌‌‌‌కు ఇండియా నోటీసులు

పాకిస్తాన్‌‌‌‌కు ఇండియా నోటీసులు

సింధూ జలాల కమిషనర్ల ద్వారా ఈ నెల 25న అందజేత

న్యూఢిల్లీ: సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్తాన్‌‌‌‌కు ఇండియా నోటీసు ఇచ్చింది. సింధూ జలాల కమిషనర్ల ద్వారా ఈ నెల 25న ఈ నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐడబ్ల్యూటీ రూల్స్‌‌‌‌ను సక్రమంగా అమలుచేసే విషయంలో, కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ముందుకు రాకుండా పాక్ మొండిగా వ్యవహరిస్తుండటం వల్లే నోటీసులు పంపాల్సి వచ్చిందన్నాయి. ‘‘ఇండియా నోటీసుతో 90 రోజుల్లోగా ఇరుదేశాల మధ్య చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇండియా–పాక్ మధ్య నదీజలాల పంపిణీకి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న కరాచీలో సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. దీనిపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై ఇండియాకు.. పశ్చిమ నదులైన సింధూ, చీనాబ్, జీలం నదులపై పాక్‌‌‌‌కు నియంత్రణ ఉంటుంది. రెండు దేశాల మధ్య సహకారం కోసం సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీనికి ఇరుదేశాల కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.