మానసిక సమస్యలున్న దోషులను ఉరితీయొద్దు

మానసిక సమస్యలున్న దోషులను ఉరితీయొద్దు

1999 నాటి కేసులో సుప్రీం తీర్పు

తీవ్రమైన నేరం చేసి ఉరిశిక్ష పడిన వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గాలేకపోతే ఉరితీయకూడదని సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తద్వారా మరికొన్ని దేశాల సరసన ఇండియాను నిలిపింది.  ఓ వ్యక్తిని దోషిగా తేల్చిన తర్వాత అతడికి మానసిక అనారోగ్యం బారిన పడినా, జ్ఞాపక శక్తి కోల్పోయినా ఉరి శిక్షను అమలు చేయకూడదని  ఇటీవల జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎంఎం శాంతనగౌడర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం దేశ చరిత్రలో తొలిసారిగా ఈ తీర్పునిచ్చింది.  నేరం చేసినట్టు దోషికి  గుర్తులేనప్పుడు శిక్షకు అర్థమేంటని ప్రశ్నించింది.

1999 డిసెంబర్​లో మహారాష్ర్టలోని గులుంబ్​లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసి, తర్వాత హత్య చేసిన ‘ఎక్స్’ (కోర్టు పెట్టిన పేరు ఇది) అనే వ్యక్తికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్షను 2008లో సుప్రీంకోర్టు సమర్థించింది. ఇటీవలే ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని,మానసిక అనారోగ్యం పేరుతో దోషులు తప్పించుకుంటారన్న ఆందోళనలపైనా స్పందించింది. తీవ్రమైన మానసిక అనారోగ్యం ఉందని డాక్టర్‌‌ సర్టిఫికెట్‌‌ సమర్పిస్తేనే మరణశిక్ష తప్పుతుందని పేర్కొంది.