మయన్మార్‌‌ బార్డర్​ వెంట కంచె వేస్తం : అమిత్‌‌ షా ప్రకటన

మయన్మార్‌‌ బార్డర్​ వెంట కంచె వేస్తం : అమిత్‌‌ షా ప్రకటన
  • ఆ దేశ సైనికుల చొరబాట్ల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ: మయన్మార్‌‌  దేశ సైనికులు మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌‌లోకి ప్రవేశిస్తుండటంపై కేంద్రం స్పందించింది. వలసలను అరికట్టేందుకు సరిహద్దు వెంట కంచె వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా ప్రకటించారు. బంగ్లాదేశ్ సరిహద్దులాగానే భారత్ – -మయన్మార్ సరిహద్దును కాపాడుకుంటామని గౌహతిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్​షా స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇరుదేశాల సరిహద్దుల్లోని ప్రజలు ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ముసుగులో వేలాదిమంది మయన్మార్‌‌ వాసులు భారత్‌‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి ముగింపు పలుకుతామని అమిత్​షా వెల్లడించారు. మయన్మార్‌‌లో పాలన కొనసాగిస్తున్న మిలిటరీ జుంటాకు కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జుంటాకు, మూడు సాయుధ బృందాలకు మధ్య పోరు జరుగుతోంది. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్​లోకి ప్రవేశించారు. రెబల్‌‌ బృందాలు పైచేయి సాధిస్తుండటంతో పాటు తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో సైనికులు మిజోరంలోని లాంగ్‌‌ట్లాయ్‌‌ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మయన్మార్​లో ఏం జరుగుతోంది?

మయన్మార్‌‌లో 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ దాడుల్లో ‘త్రీ బ్రదర్‌‌హుడ్‌‌ అలయన్స్‌‌(టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్‌‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం(ఎంఎన్‌‌డీఏఏ), టాంగ్‌‌ జాతీయ విమోచన సైన్యం (టీఎన్‌‌ఎల్‌‌ఏ), అరాకన్‌‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది.

మిజోరం సీఎం విజ్ఞప్తితో..

మయన్మార్‌‌ ఆర్మీకి చెందిన వందలాదిమంది సిబ్బంది మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌‌ లోకి ప్రవేశిస్తుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. మిజోరం సీఎం లాల్‌‌ దుహోమా కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షాతో చర్చించారు. వారిని తిరిగి వెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే మయన్మార్ ​బార్డర్​ వెంట కంచె నిర్మించాలనే ప్రకటన వచ్చింది.