
కుమమొటో (జపాన్): వెన్ను గాయం నుంచి కోలుకున్న ఇండియా నంబర్ వన్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మొదలయ్యే జపాన్ మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో అతనితో పాటు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ టైటిల్‌పై గురి పెట్టారు. ఆసియా గేమ్స్ సింగిల్స్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గే క్రమంలో గాయపడ్డ ప్రణయ్ డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలకు దూరమయ్యాడు.
నాలుగు వారాల తర్వాత కోర్టులోకి అడుగు పెడుతున్న అతను తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ లీ చెయుక్ యుయి (హాంకాంగ్)తో పోటీ పడనున్నాడు. లక్ష్యసేన్ మూడో సీడ్ లోకల్ ఫేవరెట్ కొడై నరావొకాతో తలపడనుండగా, శ్రీకాంత్ క్వాలిఫయర్‌తో తన పోరు ఆరంభించనున్నాడు. కొన్నాళ్లుగా నిరాశ పరుస్తున్న స్టార్ షట్లర్ పీవీ సింధు విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడె మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడనుంది. మెన్స్ డబుల్స్‌లో ఇండియా నం.1 జోడీ సాత్విక్–చిరాగ్‌పై అంచనాలున్నాయి.